దేశంలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, ఇందులో ఈ నెల 6వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరుగనుంది.
ఇందులో కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు సంభంధించిన ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలను టైమ్స్ నౌ ప్రకటించింది. కేరళలో ఎల్‌డీఎఫ్ అధికారంలోకి వస్తుండగా పుదుచ్చేరిలో ఎన్డీఏకు అధికారం దక్కుతుందని తమ సర్వేలో తేలినట్లు టైమ్స్ నౌ పేర్కొన్నది.
వీరి సర్వే ఫలితాల ప్రకారం కేరళలో ఎల్డీఎఫ్ 2016 ఎన్నికల్లో గెలిచిన సంఖ్య కంటే 14 సీట్లను కోల్పోయి 77 స్థానాల్లో విజయం సాధించనున్నది. ఎల్డీఎఫ్ ప్రధాన ప్రత్యర్థి అయిన యూడీఎఫ్ ఈసారి 62 నియోజకవర్గాల్లో గెలువనున్నది.
గత ఎన్నికల్లో యూడీఎఫ్ 47 స్థానాల్లో గెలుపొందింది. కాగా, 2016 ఎన్నికల్లో ఒక సీటుకే పరిమితమైన బీజేపీ.. ఇప్పుడు కూడా ఒక్క స్థానంలోనే విజయం సాధించనున్నది.
ఓట్ల షేరింగ్ విషయానికొస్తే, ఎల్డీఎఫ్ 42.4 శాతం వస్తాయని అంచనా వేశారు. 2016లో (43.5 శాతం) కంటే స్వల్పంగా తక్కువ. యూడీఎఫ్ గత ఎన్నికల్లో కంటే కొంచెం ఎక్కువగా 38.6 శాతం ఓట్లు పొందనుంది. బీజేపీ 2016లో పొందిన వాటాను ఈ ఎన్నికలలో 1.5 శాతం మేర మెరుగుపరుస్తుందని అంచనా వేశారు.
ఇతర పార్టీలు ఒకే సీటును గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, స్వతంత్రులు 2.6 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించలేరని పేర్కొంది. ఎల్డీఎఫ్ 71-83 మధ్య, యూడీఎఫ్ 56-68 మధ్య సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్టు ఈ సర్వే ఫలితాల్లో వెల్లడైంది.
ఇకపోతే, మళ్లీ ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుందనే విషయంపై ఓటర్లు కూడా స్పష్టమైన తీర్పునిచ్చారు. కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ వైపే ప్రజలు మొగ్గు చూపినట్లు టైమ్స్ నౌ సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పినరయి విజయన్‌కు 39.3 శాతం, ఊమెన్ చాందీకి 26.5 శాతం, ముల్లపల్లి రామచంద్రన్‌కు 8.8 శాతం ఓట్లు దక్కాయి.
కేరళ ముఖ్యమంత్రి పనితీరు చాలా సంతృప్తికరంగా ఉన్నట్లు 44.72 శాతం మంది తెలిపారు. కాగా, కొంత మేరకు సంతృప్తిగా ఉన్నామని 32.92 శాతం మంది, సంతృప్తికరంగా లేమని 21.93 శాతం మంది వెల్లడించారు.