చెన్నై ఇసుక కాంట్రాక్టర్ జే.శేఖర్ రెడ్డికి, ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్ రోహిత్ టాండన్‌కు కొత్త కరెన్సీ నోట్లు (రూ.2000) సమకూర్చిన కోల్‌కతాకు చెందిన హవాలా డీలర్ పరాస్ ఎం.లోధాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఈయన ఏకంగా రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల మేరకు కొత్త నోట్లను సమకూర్చారు.
ఈ విషయాన్ని గుర్తించిన ఈడీ అధికారులు ఆయనపై కన్నేశారు. ఆయనపై ద్రవ్య అక్రమ చలామణీ నియంత్రణ చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది. దేశ విడిచి పోకుండా లుక్ఔట్ నోటీసు జారీ చేశారు. అయితే, ఈడీ అధికారులు ఊహించినట్లుగానే దేశ వీడి పారిపోయేందుకు లోధా ముంబై విమానాశ్రయానికి వచ్చారు. ఆయనను గుర్తించిన ఈడీ అధికారులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు. అప్పటికప్పుడు ఢిల్లీకి తరలించి... లోతుగా ప్రశ్నించారు. అరెస్టు చేసినట్లు ప్రకటించారు.
‘‘రూ.25 కోట్ల పాత నోట్ల మార్పిడికి సంబంధించి శేఖర్ రెడ్డి, రోహిత్ టాండన్‌లతో లోధా మంతనాలు జరిపారు. ఈ కేసులోనే ఆయనను అరెస్టు చేశాం’’ అని ఈడీ ప్రకటన జారీ చేసింది. శేఖర్ రెడ్డి బృందం నుంచి ఐటీ అధికారులు 180 కోట్ల పాత, కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో రోహిత్ టాండన్ ఆఫీసు నుంచి 13.5 కోట్ల కొత్తనోట్లు సీజ్ చేశారు. శేఖర్ రెడ్డిని అరెస్టు చేసిన కొద్దిసేపటికే... లోధానూ అరెస్టు చేయడం గమనార్హం.
‘‘లోధా, టాండన్ కొందరు బ్యాంకు అధికారులతో కలిసి భారీ కుట్రకు పాల్పడ్డారు. ప్రజలకు అందాల్సిన కరెన్సీని దారి మళ్లించారు. ప్రజల్ని మోసం చేశారు’’ అని ఈడీ పేర్కొంది. శేఖర్ రెడ్డి అన్ని కోట్ల కొత్త నోట్లు ఎలా సంపాదించారో తేల్చేందుకు ఈడీతోపాటు సీబీఐ కూడా రంగంలోకి దిగింది.