Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటు కరోనా.. ఇటు డెంగీ

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (22:32 IST)
అసలే కరోనా కాలం, ఆపై జ్వరాల దెబ్బ. ముఖ్యంగా డెంగీ విజృంభిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఏదో ఒక జ్వరంతో బాధపడుతున్నవారే. వీటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటుండటం మరింత గందరగోళానికి తావిస్తోంది. చికిత్సలు వేర్వేరనే విషయం తెలియక కొందరు నొప్పి మాత్రలనూ ఆశ్రయిస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరంగానూ పరిణమిస్తోంది.
 
కొవిడ్‌.. కొవిడ్‌..
గత 18 నెలల నుంచీ అందరి నోటా ఇదే మాట. అదేంటో గానీ ఈ ఏడాదిన్నరలో కొవిడ్‌-19 తప్ప ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లేవీ అంతగా కనిపించలేదు. ఆసుపత్రుల్లో చేరినవారిలో నూటికి 99% మంది కరోనా బాధితులే. ఒకప్పటిలా డెంగీ, మలేరియా, అటు కరోనా.. ఇటు డెంగీ వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్‌ వంటివి విజృంభించలేదు.

చేతుల శుభ్రత, బయటకు అంతగా రాకపోవటం, మాస్కులు ధరించటం, ఇంటి ఆహారమే తినటం, పరిసరాల్లో దోమలు పెరగకుండా చూసుకోవటం వంటి జాగ్రత్తలు దీనికి కారణం కావొచ్చు. అయితే ఇటీవల కొవిడ్‌ రెండో దశ తగ్గుముఖం పట్టే సమయంలో డెంగీ జ్వరాలు పెరుగుతుండటం కలవరం కలిగిస్తోంది.
 
కొవిడ్‌-19, డెంగీ రెండింటిలోనూ తొలిదశలో దగ్గు తప్ప జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలన్నీ ఒకేలా ఉంటాయి. కొందరిలో ఒకేసారి డెంగీ, కొవిడ్‌-19 రెండూ కలిసి ఉంటున్నాయి కూడా. డెంగీ ఒక్కటే కాదు.. వర్షాకాలంలో విజృంభించే మామూలు ఫ్లూ, మలేరియా, స్క్రబ్‌ టైఫస్‌, లెప్టోస్పైరోసిస్‌ వంటివీ దాడిచేస్తున్నాయి. 
 
వీటిల్లోనూ జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు తలెత్తుతుంటాయి. జ్వరం అనగానే కొవిడే అని భయపడిపోతున్న రోజుల్లో వీటి తారతమ్యాలను గుర్తించి, మసలు కోవటం ఎంతైనా అవసరం.
 
డెంగీనా? కొవిడా?
ప్రస్తుతం కొవిడ్‌-19తో పాటు అందరినీ ఎక్కువగా భయపెడుతోంది డెంగీనే. దీనికి మూలం డెంగీ వైరస్‌లు. ఈడిస్‌ జాతి దోమలు కుట్టటం ద్వారా వ్యాపిస్తుంది. ఇక కొవిడ్‌-19కు మూలం సార్స్‌-కొవీ-2 వైరస్‌. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. తీవ్రతను బట్టి వీటి లక్షణాలు ఆధారపడి ఉంటాయి.
 
ఒక మాదిరి నుంచి మధ్యస్థ డెంగీలో- జ్వరం, కళ్ల వెనక నొప్పి, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నడుం నొప్పి, వాంతి, వికారం, దద్దు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్‌ కణాలు పడిపోవటం కనిపిస్తాయి. తీవ్రమవుతున్నకొద్దీ- చర్మం మీద దద్దు, కడుపు నొప్పి, విడవకుండా వాంతులు, పొట్టలో నీరు చేరటం, నిస్సత్తువ, చిరాకు, కాలేయం పెద్దగా అవ్వటం తలెత్తుతుంటాయి.

తీవ్ర దశలో- రక్తనాళాల్లోంచి ప్లాస్మా లీకవుతుంటుంది. దీంతో రక్తం చిక్కబడుతుంది. ఇది షాక్‌కు దారితీస్తుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. ప్లేట్‌లెట్లు బాగా పడిపోవటం వల్ల రక్తస్రావం కూడా కావొచ్చు. క్రమంగా కాలేయం, గుండె వంటి అవయవాల పనితీరు అస్తవ్యస్తమవుతుంది.
 
ఒక మాదిరి నుంచి మధ్యస్థ కొవిడ్‌-19లో- జ్వరం లేదా వణుకు, దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, నిస్సత్తువ, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, రుచి, వాసన పోవటం, గొంతునొప్పి, ముక్కుదిబ్బడ, ముక్కు కారటం, వాంతి, వికారం, విరేచనాల వంటివి కనిపిస్తాయి. తీవ్ర దశలో- ఆయాసం, రక్తంలో ఆక్సిజన్‌ శాతం పడిపోవటం, న్యుమోనియా, ఊపిరితిత్తులు విఫలం కావటం, అవయవాలు దెబ్బతినటం వంటివి తలెత్తుతాయి.
 
చికిత్స మారితే ప్రమాదం
జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలుంటే ముందుగా అది కొవిడా? డెంగీనా? లేదూ రెండు కలిసి ఉన్నాయా? అనేది కచ్చితంగా నిర్ధారణ చేశాకే చికిత్స ఆరంభించాలి. ఇది చాలా ముఖ్యం. వీటికి చేసే చికిత్సలు వేర్వేరు. డెంగీలో ప్లేట్‌లెట్‌ కణాలు పడిపోయి, రక్తస్రావమయ్యే అవకాశముంది. కొవిడ్‌-19లో రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడే ప్రమాదముంది. అందుకే కొవిడ్‌-19లో రక్తం చిక్కబడకుండా చూసే హెపారిన్‌ వంటి మందులు ఇస్తారు.

డెంగీలో రక్తం గడ్డకట్టే తీరు ఎలా ఉందో చూసుకుంటూ ప్లేట్‌లెట్లు బాగా పడిపోతే రక్తనాళం ద్వారా ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. ఇది ఏమాత్రం అటూఇటైనా ప్రమాదమే. కొవిడ్‌-19 చికిత్సను డెంగీకి ఇస్తే రక్తస్రావమై ప్రాణం మీదికి రావొచ్చు. డెంగీ చికిత్సను కొవిడ్‌-19 బాధితులకు ఇస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరే ప్రమాదముంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి, తగు పరీక్షల ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments