వచ్చే మే నెలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ను మార్చి నెలలో విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 3వ తేదీతో ముగియనుంది. ఈలోపు కొత్త ప్రభుత్వం ఏర్పడేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.
ఇందులోభాగంగా, మార్చి నెలలో నోటిఫికేషన్ జారీ చేసి.. ఆరు లేదా ఏడు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. భద్రతా దళాలు, ఈవీఎంల అందుబాటు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని దీనిపై ఒక నిర్ణయానికి వచ్చి మార్చి తొలి వారంలో నోటిఫికేషన్ ఇస్తుంది.
లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను కూడా కలిపి నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అయితే నవంబరులో రద్దయిన జమ్మూకాశ్మీ అసెంబ్లీకి కూడా పార్లమెంటు ఎన్నికలతో పాటు లేదంటే దాని కన్నా ముందే ఎలక్షన్ నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం. అక్కడ ఎన్నికల సమయంలో భద్రతాపరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దీనిపై నిర్ణయం తీసుకోనుంది.