అవును బిస్కెట్ ప్యాకెట్ దొంగలించిన పాపానికి తోటి విద్యార్థిపై దాడి చేశారు.. సీనియర్ విద్యార్థులు. ఈ దురాగతం డెహ్రాడూన్‌లోని ఓ బోర్డింగ్ స్కూలులో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్కూలు యాజమాన్యం కూడా బయటికి పొక్కనివ్వలేదు. అంతేగాకుండా మృతి చెందిన బాలుని మృతదేహాన్ని ఖననం చేసింది.
వివరాల్లోకి వెళితే... డెహ్రాడూన్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఔటింగ్‌కు తీసుకుని వెళ్లాలని నిర్ణయించింది. అదే సమయంలో వాసు యాదవ్(12) అనే బాలుడు ఓ దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడని షాపు యజమాని ఆరోపించాడు. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చాడు.
దాంతో విద్యార్థులు ఎవరూ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లొద్దని యాజమాన్యం ఆదేశించింది. ఔటింగ్ క్యాన్సిల్ కావడంతో వాసు యాదవ్ మీద సీనియర్ విద్యార్థులు కోపం పెంచుకుని.. క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో వాసు యాదవ్‌ను చావబాదారు.
ఆ తర్వాత అతడిని చిత్రహింసలు పెట్టి శరీరం మీద చన్నీళ్లు పోశారు. అంతేకాకుండా గంటల పాటు తరగతి గదిలోనే వదిలేశారు. అతడిని కొన్ని గంటల పాటు క్లాస్ రూమ్‌లోనే వదిలేసి వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత బాలుడిని వార్డెన్ గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వాసును ఆస్పత్రికి తరలించారు.
కానీ అతను అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. ఈ విషయం బయటకు పొక్కితే పాఠశాలకే ప్రమాదం అని భావించిన యాజమాన్యం.. గుట్టు చప్పుడు కాకుండా వాసు మృతదేహాన్ని ఖననం చేశారు. చివరికి మీడియా సాయంతో పోలీసులకు ఈ వ్యవహారం తెలిసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
యాజమాన్యం తీరు ఈ వ్యవహారంలో దారుణమని.. బాలుడు చనిపోయిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయలేదని.. అతడి మృతదేహాన్ని వారికి అప్పగించకుండానే ఖననం చేశారని పోలీసులు చెపుతున్నారు.