తమిళనాడు రాష్ట్రంలో పోలింగ్‌కు సర్వంసిద్ధమైంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు.
అయితే, గత పది పదిహేను రోజులుగా ఎన్నికల ప్రచారం సాగింది. ఇది ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రచార సమయంలో భారీ ఎత్తున నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 428 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇందులో సుమారు రూ.225.5 కోట్ల నగదు ఉంది. ఇక బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువుల ఖరీదు సుమారు రూ.176 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన ఐటీ సోదాల్లో ఆ మొత్తం లభ్యం అయినట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజుల క్రితం చెన్నైతో పాటు ఇతర నగరాల్లోనూ ఐటీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఎవరి నుంచి, ఎక్కడ నుంచి, ఎంతెంత స్వాధీనం చేసుకున్నారో ఇంకా అధికారులు స్పష్టంగా వెల్లడించలేదు.