పది నెలల చిన్నారి శాన్విని, ఆమె నాన్నమ్మ సత్యవతిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన యండమూరి రఘునందన్(32) అలియాస్ రఘుకు ఉరి శిక్ష ఖరారైంది. దీంతో ఈ ముద్దాయిని వచ్చే నెల 23వ తేదీన రఘుకు ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు అమెరికాలోని పెన్సిల్వేనియా కోర్టు ఆదేశాలు జారీచేసింది. కాగా, భారతీయ అమెరికన్‌కు మరణశిక్ష అమలు చేయటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం కుడుములకుంట గ్రామానికి చెందిన వెన్నా ప్రసాదరెడ్డి, లత దంపతులు అమెరికాలోని పెన్సిల్వేనియాలో నివాసం ఉంటున్నారు. వీరి పాప వెన్నా శాన్వి. ఈ చిన్నారిని చూసుకునేందుకు.. ఆమె నానమ్మ సత్యవతి ఆమెరికా వెళ్లారు.
అక్కడ ప్రసాదరెడ్డి, లత దంపతులకు పరిచయం ఉన్న వ్యక్తి యండమూరి రఘునందన్ చిన్నారి శాన్విని డబ్బు కోసం కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన నానమ్మ సత్యవతిని కూడా చంపేశాడు. ఆ తర్వాత శాన్విని ఓ సూట్ కేసులో పెట్టాడు. ఊపిరి ఆడక చిన్నారి చనిపోయింది.
2012లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. దీనిపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి రఘనందన్‌ను అరెస్టు చేశారు. మొదట్లో తనకేమీ తెలియదని చెప్పినా.. డబ్బుకోసం డిమాండ్ చేస్తూ రాసిన లేఖతో నిజమేమిటో బయటపడింది. కేసు విచారించిన న్యాయస్థానం అతనికి మరణ శిక్ష ఖరారు చేసింది.