జగన్ అన్నయ్య నాకోసం ప్రొడ్యూసర్ ను మార్చేశారు...చక్రి ఇంటర్యూ 2

Webdunia
సోమవారం, 15 డిశెంబరు 2014 (22:47 IST)
'సిక్‌ బే హాస్పిటల్‌'లో జాబ్‌కు సెలక్ట్‌ అయ్యాను!
అమీర్‌పేటలోని 'సిక్‌ బే' అనే హాస్పిటల్‌లో జాబ్స్‌ కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయన్న విషయం ఆ ఫ్రెండ్‌ ద్వారా తెలుసుకుని అటెండ్‌ అయ్యాను. నా పాజిటివ్‌ యాటిట్యూడ్‌, నా స్మైలింగ్‌ ఫేస్‌, ఫ్రెండీ నేచర్‌ వాళ్ళకు బాగా నచ్చింది. వెంటనే జాయినవ్వమన్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల గల చిన్న చిన్న క్లినిక్స్‌, హాస్పిటల్స్‌కు వెళ్ళి.. 'సిక్‌ బే'లో గల సూపర్‌ స్పెషాలిటీస్‌ గురించి డెమాన్‌స్ట్రేట్‌ చేయడం నా డ్యూటీ. ఓ మూడు సంవత్సరాలపాటు ఆ జాబ్‌ చేశాను. డాక్టర్స్‌ను లవగలిగేది.. 'అయితే ఉదయం పూట, లేకపోతే సాయంత్రం వేళలే' కాబట్టి మధ్యాహ్నాలు సంగీతం కోసం కేటాయించుకునేవాడ్ని.
 
మూడేళ్ళలో 30 ఆల్బమ్‌లు 'పండు వెన్నెల' ఆల్బమ్‌ ఆర్థికంగా నాకు వెన్నెల కురిపించకపోయినా.. నాకు చాలామంచి పేరుతెచ్చిపెట్టి, నాలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. నాకొక మంచి 'విజిటింగ్‌ కార్డ్‌'లా ఉపయోగపడి ఆడియో కంపెనీలన్నిటితో పరిచయాలు పెరిగేలా చేసింది. అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది. ఒక వెల్లువలా అవకాశాలు వచ్చిపడటం మొదలుపెట్టాయి. చూస్తుండగానే మూడేళ్ళలో 30 ఆల్బమ్స్‌ రిలీజ్‌ చేశాను. ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ మార్కెట్‌లో 'చక్రి' అనే పేరు ఓ చిన్నసైజు సంచలనమైపోయింది.
 
'గీత రచయిత'గా ముద్ర పడకూడదని.. 
నా ఆల్బమ్స్‌ ద్వారా నా పేరు ఫిలిం ఇండస్ట్రీకి తెలియడం మొదలైంది. కోటిబాబు అనే ఓ ఫ్రెండ్‌ ద్వారా ఓ సినిమా ఆఫర్‌ వచ్చింది. అయితే పాట కట్టడం(మ్యూజిక్‌ చేయడం) కోసం కాదు... పాట రాయడం కోసం. నేను రిలీజ్‌ చేసే ఆల్బమ్స్‌లో చాలావరకు పాటలు నేనే రాస్తుండేవాడ్ని. నా కలం పేరు 'చల్లగాలి'. అయితే నా గోల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావడం తప్ప లిరిక్‌ రైటర్‌ కావడం కాదు. పైగా నా స్ట్రెంగ్త్‌ నాకు బాగా తెలుసు.. కాబట్టి మ్యూజిక్‌ డైరెక్షన్‌ పైనే ఫోకస్‌ పెట్టాలనుకున్నాను తప్ప.. సైడ్‌ ట్రాక్‌లోకి వెళ్ళదలచుకోలేదు. దాంతో ఏరికోరి వచ్చిన ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాను.
 
మలుపు తిప్పిన మెగా ఆల్బమ్‌
అదే టైమ్‌లో 'సన ఆడియో' ఓనర్‌ సలీమ్‌. చిరంజీవిగారి బర్త్‌డే స్పెషల్‌గా ఆల్బమ్‌ చేద్దామంటూ నన్ను అప్రోచ్‌ అయ్యారు. స్వతహాగా చిరంజీవికి వీరాభిమానినైన నేను ఎగిరి గంతేశాను. అప్పట్లో చాలా సన్నగా ఉండేవాడ్నిలెండి(పెద్దగా నవ్వుతూ). పాత ట్యూన్స్‌ తీసుకుని వాటికి కొత్త లిరిక్స్‌ రాయిద్దామన్న సలీమ్‌తో నేను ఏకీభవించలేదు. ట్యూన్స్‌ మరియు లిరిక్స్‌ రెండూ కొత్తగానే ఉండాలని పట్టుబట్టాను. 'మాస్టార్‌', 'చూడాలని వుంది' సినిమాలు విడుదలై 'స్నేహం కోసం' షూటింగ్‌ జరుగుతున్న రోజులవి. 8 పాటలతో 'చిరునవ్వు' అనే టైటిల్‌తో.. ఆల్బం తయారుచేశాం. నేను పాడితే కంపోజింగ్‌ మీద ఎఫెక్ట్‌ పడుతుందని. నేను ఒక్క పాట కూడా పాడకుండా వేరే సింగర్స్‌తో పాడించాం. పాటలన్నీ 'చల్లగాలి' పేరుతో నేనే రాశాను.
 
చిరంజీవిగారు నా కోసం చూస్తుంటే.. నేనేమో..!!
ఆల్బమ్‌ను చిరంజీవిగారి చేతుల మీదుగా రిలీజ్‌ చేయాలని 'స్నేహం కోసం' షూటింగ్‌ స్పాట్‌లో ఆయన్ని కలిశాం. షాట్‌ గ్యాప్‌లో చిరంజీవిగారు మమ్మల్ని కలిశారు. అప్పటికింకా సెల్‌ కెమెరాలు రాలేదు. అందుకే చిరంజీవిగారిని కలిసిన ఆ 'మెగా మూమెంట్‌'ను ఫొటో రూపంలో పొందుపరచుకోవాలని ఫొటోగ్రాఫర్‌ తాతాజీ కోసం నేను పరుగులు తీశాను. అప్పటికే ఆల్బమ్‌లోని పాటలు విని ఉన్న చిరంజీవిగారు ఆసక్తిగా 'ఆల్బమ్‌ చేసినతను ఎక్కడ' అంటూ అటుఇటు చూస్తున్నారు. నేనేమో.. ఫొటోగ్రాఫర్‌ కోసం వెతుకుతున్నాను. మిగతావాళ్ళంతా కంగారుపడి నేనెక్కడున్నానో చూసి నన్ను చిరంజీవిగారి దగ్గరకు లాక్కొని వెళ్ళారు. ఆల్బం చేసింది నేనని తెలియగానే చిరంజీవిగారి ముఖంలో ఒకింత ఆశ్చర్యం తొంగి చూసింది. ఆపై ఆయన పెదాలపై 'చిరునవ్వు' విరిసింది. ఆరకంగా 'చిరునవ్వు' ఆల్బమ్‌ టైటిల్‌ జస్టిఫై అయిపోయింది. 'చిరునవ్వు' నాకు చాలా పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది. 'అప్పటివరకు నేను చేసిన ఆల్బమ్‌లన్నీ ఒకెత్తు- 'చిరునవ్వు' ఒక్కటీ ఒకెత్తు అనేంతగా నాకు పేరొచ్చింది.
 
రెహమాన్‌ రేంజ్‌లో ఉందన్నారు!
'చిరునవ్వు' విజయస్ఫూర్తితో తెలుగులో 'వందేమాతరం' చేశాను. అది విని ఆర్పీ పట్నాయక్‌ నన్ను ప్రశంసలతో ముంచెత్తారు. రెహమాన్‌ రేంజ్‌లో ఉందన్నారు. ఆర్పీతో అప్పట్నుంచే నాకు మంచి అనుబంధం వుండేది. ఆర్పీ, కౌసల్య, రవివర్మ వంటి వాళ్ళంతా నా ఆల్బమ్స్‌లో పాడుతుండేవారు. ఆర్పీకి అనూప్‌ని పరిచయం చేసింది నేనే.
 
పాట రాయమంటే పౌరుషం వచ్చేది
నా ఆల్బమ్స్‌లో కొన్ని పాటలు నేనే రాస్తానన్న విషయం తెలిసి పాటలు రాయమంటూ అవకాశాలు వస్తుండేవి. అలాంటప్పుడు నాలోని మ్యూజిక్‌ డైరెక్టర్‌కి తెగ పౌరుషం వచ్చేసేది. ఎంతగా అంటే.. ఓ సందర్భంలో సాక్షాత్తూ చిరంజీవిగారి సినిమా కోసం పాట రాసే అవకాశం వచ్చినా తటపటాయించాను. దాంతో ఆ అవకాశం వేరొకరికి వెళ్లిపోయింది. గీత రచయితగా ముద్రపడకూడదన్న ఆలోచనలో ఉన్న నేను 'హమ్మయ్య' అనుకున్నాను. మెల్లగా చిన్నచిన్న సినిమాలకు మ్యూజిక్‌ డైరెక్షన్‌ చేసే ఛాన్స్‌లు రావడం మొదలయ్యాయి. అయితే నా తొలి చిత్రం చిన్న చిత్రం కాకూడదని మెంటల్‌గా ఫిక్సయిపోయి ఉన్న నేను ఆ ఆఫర్స్‌ను స్మూత్‌గా రిజెక్ట్‌ చేస్తూ వచ్చేవాడ్ని.
 
'మరోచరిత్ర'లా చరిత్ర సృష్టిస్తుందన్నారని..!!
ఆ టైమ్‌లో 'మరో ప్రేమకథ' అనే చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్షన్‌ ఆఫర్‌ వచ్చింది. నేను షరా మామూలుగా 'నో' అన్నాను. 'లేదు.. 'మరో చరిత్ర' తరహాలో చరిత్ర సృష్టిస్తుందని నన్ను బలవంతంగా ఒప్పించారు. కాస్త అయిష్టంగానే ఆ సినిమా ఒప్పుకున్న నేను.. ఆ తర్వాత ఎంతో ఇష్టపడి ఆ చిత్రం కోసం అయిదు పాటలు చేశాను. అయితే అంతటితోనే ఆ సినిమా ఆగిపోయింది. ఆ అయిదు పాటల్లో ఒకటి 'మోన.. మోన.. మోనా...' ఒకటి. తర్వాత ఆ పాటను 'శివమణి' కోసం వాడుకున్నాం. 
 
'లైఫ్‌'లో మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదనుకుంటూనే.. 
లైఫ్‌లో ఇంకెప్పుడూ అటువంటి తప్పు చేయకూడదని బలంగా ఫిక్సయినప్పటికీ.. ఓ 'బలహీన క్షణం'లో (చిన్నగా నవ్వుతూ..) మళ్ళీ 'లైఫ్‌' అనే మరో చిన్న సినిమాకి సైన్‌ చేశాను. అది కూడా అంతే. ఆగిపోయింది. వరుసగా రెండు సినిమాలకు అవకాశాలు వచ్చినా.. అవి ఆచరణ రూపం దాల్చకపోవడంతో నాలో కొంత ఆత్మన్యూనత ఏర్పడింది. కానీ ఆ తర్వాత ప్రశాంతంగా ఆలోచిస్తే.. ఓ సినిమా ఆగిపోవడంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాత్ర ఏముంటుంది? అనిపించింది. సినిమాలు రిలీజై వాటిలో నా మ్యూజిక్‌ బాగోలేదంటే బాధపడాలి తప్ప.. ఇలా ఆగిపోయినందుకు కాదు కదా?' అనుకుంటూ ధైర్యం తెచ్చుకునేవాడ్ని. అదే టైమ్‌లో 'లిటిల్‌ హార్ట్స్‌' అనే మరో సినిమా వచ్చింది. ఇది ఆగిపోలేదు కానీ చాలా లేట్‌గా రిలీజైంది.
 
సత్యదేవ్‌ ద్వారా శుభవార్త
చేసిన మూడు సినిమాలు మూలనపడిపోయి మానసికంగా కొంత నిరుత్సాహంగా ఉన్న సమయంలో.. ప్రస్తుతం ఆదిత్య మ్యూజిక్‌లో వర్క్‌ చేస్తున్న సత్యదేవ్‌ ద్వారా జగన్‌ అన్నయ్య (పూరి జగన్నాథ్‌) నాకు పరిచయమయ్యారు.
 
సంగీతాన్ని కాచి వడబోసిన అనుభవం 'బాచి'కి ఉపయోగపడింది!
'బద్రి' సినిమాతో సంచలన విజయం సాధించి ఉన్న జగన్‌ అన్నయ్య తన నెక్ట్స్‌ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోసం చూస్తున్న టైమ్‌లో.. నా టైమ్‌ బాగుండి నేను తనని కలిశాను. అది 2000, జూన్‌ 15. 'బాచి' చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్షన్‌ చేసే గోల్డెన్‌ ఛాన్స్‌ను నా బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు జగన్‌ అన్నయ్య. అప్పటికే 40 ప్రైవేట్‌ ఆల్బమ్స్‌, ఓ మూడు సినిమాలు (విడుదల కాకపోయినా) చేసి ఉన్న అనుభవంతో ఎంతో మనసు పెట్టి 'బాచి' సినిమాకు సంగీతం చేశాను. కానీ 'బాచి' సినిమా.. జగన్‌ అన్నయ్య పాలిట మాత్రమే కాదు నా పాలిట కూడా ఓ పెద్ద బూచిలా మారిపోయింది.
 
దటీజ్‌ జగన్‌ అన్నయ్య!
'బాచి' సినిమా ఫ్లాపయ్యింది. అయితే 'బద్రి' హిట్‌ తాలూకు క్రెడిట్‌ వల్ల కొంచెం ఆలస్యమైన జగన్‌ అన్నయ్యకు 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' వచ్చింది. కానీ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నన్ను పెట్టుకోవద్దంటూ ఏమాత్రం మొహమాటం లేకుండా డైరెక్ట్‌గా చెప్పేశారు ప్రొడ్యూసర్స్‌. జగన్‌ అన్నయ్య నచ్చచెప్పాలని ఎంత చూసినా వాళ్లు 'ససేమిరా' అన్నారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్‌ని మార్చేశారు తప్ప నన్ను మార్చలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమ్స్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్.. గంజాయి స్మగ్లర్ల దాడి.. పరిస్థితి విషమం

రెండేళ్ల చిన్నారిని అరెస్ట్ చేసిన అమెరికా అధికారులు.. ఏం జరిగిందంటే?

అమరావతిలో చంద్రబాబు, పవన్.. 301 మంది ఖైదీలకు పెరోల్ మంజూరు

Royal Sikh: రాజసం ఉట్టిపడే తలపాగాతో కనిపించిన పవన్ కల్యాణ్

గోదావరి పుష్కరాలను కుంభమేళా స్థాయిలో నిర్వహించాలి.. ఏపీ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

Show comments