కరోనా వైరస్ సంక్రమణ ప్రపంచ దేశాల్లో మరోసారి విస్తరిస్తోంది. చైనాలో మళ్లీ కరోనా కేసులు అధికమవుతున్నాయి. డెల్టా వేరియంట్ ఇప్పుడా దేశాన్ని వెంటాడుతోంది. ఇండియాలో కరోనా సంక్రమణ తగ్గుముఖ పడుతోంది. అదే సమయంలో రష్యా, చైనా, అమెరికా, యూకే దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. పొరుగుదేశం చైనాలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా డెల్టా వేరియంట్ కేసుల వ్యాప్తి కలకలం కల్గిస్తోంది. గత వారం రోజుల వ్యవధిలో 11 ప్రావిన్స్‌లలో వందకు పైగా కేసులు నమోదయ్యాయి. 40 లక్షల జనాభా కలిగిన లాన్‌జువో నగరంలో అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించారు. ప్రజలెవరూ ఇళ్లు వదిలి బయటకు రావద్దని చైనా స్పష్టం చేసింది. చైనాలో ఇప్పటి వరకూ 75 శాతం ప్రజలకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయింది.
వ్యాక్సినేషన్ 75 శాతం పూర్తయినా..కొత్త కేసులు రావడం ఆందోళన కల్గిస్తోంది. జీరో కోవిడ్ లక్ష్యంలో ముందుకెళ్తున్న చైనాకు కేసుల పెరుగుదల షాక్ కల్గిస్తోంది. 1-2 కేసులు కన్పించినా కఠినమైన ఆంక్షలు విధించేస్తోంది లాన్‌జువాలో కేవలం 6 కేసులు నమోదవగానే అప్రమత్తమై లాక్‌డౌన్ విధించింది చైనా.
24 గంటల్లో 29 కేసులు బయటపడితే అందులో 6 కేసులు లాన్‌జువో నగరం నుంచి ఉన్నాయి. మిగిలిన దేశాలతో పోల్చితే చైనాలో కేసుల తక్కువే ఉన్నాయి. అయితే చైనా మాత్రం తక్కువ కేసులున్నా సరే తీవ్రంగా పరిగణిస్తోంది.