తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఉక్రెయిన్‌పై సాగిస్తున్న పోరును ఆపే ప్రసక్తే లేదని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగువే స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన చేశారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేదాకా రష్యా సాయుధ దళాలు ప్రత్యేకత సైనిక చర్యను కొనసాగిస్తాయని ఆయన తేల్చి చెప్పారు.
ఉక్రెయిన్ నుంచి నిస్సైనికీరణ చేయడంతో పాటు... ఆ దేశం నుంచి నాజీ తత్వాన్ని పారదోలడమే తమ లక్ష్యమని సెర్గీ వెల్లడించారు. ఉక్రెయిన్ నిస్సైనికీరణను చేసేందుకు తాము సైనిక చర్యకు పాల్పడితే అందుకు ప్రతిగా ప్రాశ్చాత్య దేశాలు తమపై ఆంక్షలు విధిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాశ్చాత్య దేశాల సైనిక ముప్పు నుంచి రష్యా కాపాడుకోవడం కూడా తమ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. అదేసమయంలో ఉక్రెయిన్‌కు నాటో దేశాలు సంపూర్ణ మద్దతు ఇచ్చినప్పటికీ తాము అనుకున్న లక్ష్యం చేరుకునేంత వరకు యుద్ధాన్ని విరమించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.