కాలేజీకి చదువుకోవడానికి వచ్చే అమ్మాయిలు, అబ్బాయిలు సన్నిహితులుగా మారడం చివరకి అది కాస్త ప్రేమకు దారితీయడం చూస్తూనే మనం ఉంటాం. దీంతో చదువు పట్ల అశ్రద్ధ, సమయాన్ని వృథా చేయడం, గొడవలకు దిగడం వంటి పనులు సర్వసాధారణమైపోతోంది. దీనివల్ల అటు విద్యార్థుల భవిష్యత్తుతోపాటు కళాశాల పేరు ప్రతిష్ఠలు సైతం దెబ్బతింటాయి.
ఈ సమస్యను అధిగమించడానికి చైనాలోని ఓ విశ్వవిద్యాలయం అమలు చేస్తోన్న నిబంధనల గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్‌లో 'క్వింగ్‌డావో బిన్‌హాయ్' అనే ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఉంది. ప్రస్తుతం చైనా సోషల్ మీడియాలో ఈ విశ్వవిద్యాలయం నిబంధనల విషయంలో హాట్‌టాపిక్‌గా మారింది. చైనా సామాజిక మాద్యమాల్లో ఇప్పుడంతా ఈ విషయంపైనే పోస్టులు కనిపిస్తున్నాయి. వర్సిటీ విధించిన నిబంధనలేంటంటే...
* విద్యార్థిని విద్యార్థులు కళాశాల ఆవరణలో కలిసి తిరగకూడదు. మాట్లాడుకోకూడదు. కనీసం కన్నెత్తి కూడా చూసుకోకూడదు.
* ఒకే హెడ్‌సెట్‌తో అమ్మాయులు, అబ్బాయిలు పాటలు వినకూడదు.
* చేతిలో చేయి వేసుకొని తిరగకూడదు.
* క్యాంటీన్‌లో భోజనం చేసేప్పుడు అమ్మాయిలు.. అబ్బాయిలు ఎలాంటి సంభాషణలు, సంజ్ఞలు చేసుకోకూడదు.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి శిక్ష అమలు చేస్తారు. ఆ శిక్ష ఏంటో తెలుసా? కళాశాల మరుగుదొడ్లను, పరిసరాలను శుభ్రం చేయాలి. ఈ శిక్షలు కేవలం విద్యార్థులకే కాకుండా తమ వర్సిటీలో పనిచేస్తోన్న అందరికీ వర్తిస్తాయట.
ఈ విషయంపై సదరు వర్సిటీ మేనేజర్ మాట్లాడుతూ... సమాజంలోని జనాలతో ప్రవర్తించాల్సిన తీరు పట్ల అవగాహనను విద్యాలయం నుంచే అలవరుచుకోవాలని తాము ఈ నిబంధనలు పెట్టామని, విద్యార్థుల భవిష్యత్తుకి తమ విధానలు ఉపయోగపడతాయని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో మాత్రం విద్యార్థులు తమ స్నేహితులతో స్నేహంగా ఉండలేకపోతున్నామని, కాలేజీలో తమ ప్రియురాళ్లతో గడపలేకపోతున్నామని వాపోతున్నారు.