ఆఫ్రికా దేశాల్లో ఒకటైన సియర్రా లియోన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని ఫ్రీటౌన్‌లో గోయిత్రమ్ సూపర్ మార్కెట్ సమీపంలో చమురు ట్యాంకర్ ఓ లారీని ఢీకొట్టి రోడ్డుపై నిలిచిపోయింది.
ఈ ప్రమాదంతో ట్యాంకర్ నుంచి చమురు లీకైంది. దీన్ని సేకరించేందుకు అనేక మంది స్థానికులు ఆయిల్ ట్యాంకర్ వద్దకు వచ్చారు. ఇంతలో ఆయిల్ ట్యాంకర్ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ఈ ఘటనలో 91 మంది వరకు దుర్మరణం పాలయ్యారు. 100 మంది వరకు ప్రజలు క్షతగాత్రులయ్యారు.
పేలుడు ధాటికి సమీపంలోని షాపులు, పాదచారులకు కూడా మంటలు అంటుకున్నాయి. మృతులు గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. వారి శరీర భాగాలు విసిరేసినట్టుగా చెల్లాచెదురుగా పడ్డాయి.
ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం బీభత్సంగా మారిపోయింది. ఈ ఘటనపై సియర్రా లియోన్ అధ్యక్షుడు జూలియన్ మాడా బియో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.