జర్నలిస్టులంతటి నీతిలేని వాళ్లు ఈ భూమ్మీదే లేరు : డోనాల్డ్ ట్రంప్
అమెరికా జర్నలిస్టులపై ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఈ జర్నలిస్టులంతటి నీతిలేని వాళ్లు ఈ భూమ్మీదే లేరని మండిపడ్డారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలు పెద్దగా రాలేదని కొన్ని పత్రిక
అమెరికా జర్నలిస్టులపై ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఈ జర్నలిస్టులంతటి నీతిలేని వాళ్లు ఈ భూమ్మీదే లేరని మండిపడ్డారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలు పెద్దగా రాలేదని కొన్ని పత్రికలు ఖాళీ జాగా ఫొటోలు ప్రచురించడమే ఆయన ఆగ్రహానికి కారణం. మీడియాతో తాను యుద్ధం చేస్తున్నానని, తన ప్రమాణ స్వీకారానికి జనం పెద్దసంఖ్యలో హాజరు కాలేదని రాసినందుకు మీడియా ఫలితం అనుభవిస్తుందని హెచ్చరించారు.
సీఐఏ హెడ్‌క్వార్టర్స్‌లో నిఘా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘నా సభకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. వాషింగ్టన్ మాన్యుమెంట్‌కు దారితీసే రోడ్డంతా కిక్కిరిసిపోయింది. పొద్దునే లేచి కొన్ని నెట్‌వర్క్‌లు చూశాను. మైదానంలో ఖాళీగా ఉన్న ప్రాంతమంటూ జనం లేనిచోట ఫొటోలు తీసి ప్రచురించారు. కానీ పది, పదిహేను లక్షల మంది వచ్చారు. ఓ మీడియా సంస్థ రెండున్నర లక్షల మందే వచ్చారని రాసింది. ఇది పచ్చి అబద్ధం. వేదిక వద్ద ఒకవైపు రెండున్నర లక్షలున్న మాట నిజం. కానీ వాషింగ్టన్ మాన్యుమెంట్ వరకు 20 బ్లాకుల మేర ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చారు. అబద్ధాలు రాసినందుకు వారు మూల్యం చెల్లించుకుంటారు’ అంటూ హెచ్చరించారు.
అంతేకాకుండా, నిఘా వ్యవస్థతో తనకు అభిప్రాయ భేదాలు వచ్చినట్లు మీడియా రాసిందని, అందుకే తొలుత సీఐఏ ప్రధాన కార్యాలయానికి వచ్చానని చెప్పారు. ‘మీడియాతో నేను పోరాటం చేస్తున్నానని మీకు తెలుసు. ఈ భూమ్మీద నీతినిజాయితీ లేనివారిలో మీడియా కూడా ఉంది’ అని ఆయన అనగానే సీఐఏ అధికారులు బిగ్గరగా నవ్వారు. కాగా.. ఐఎస్ ఉగ్రవాద సంస్థను, ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని తుదముట్టించడం తప్ప అమెరికాకు వేరే మార్గం లేదని ట్రంప్ వారితో అన్నారు.