మయన్మార్ ప్రతిపక్ష నేత ఆంగ్ సాన్ సూకీ కేసు విచారణపై శుక్రవారం తీర్పు వెలువడనుందని కోర్టు అధికారి ఒకరు తెలిపారు. సూకీపై మోపిన భద్రతాపరమైన అభియోగాలపై కోర్టు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. సూకీపై మయన్మార్ సైనిక పాలకులు ఈ కేసు పెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ కేసులో తుది వాదోపవాదాలు ముగిశాయని, శుక్రవారం తీర్పు వెలువడుతుందని కోర్టు అధికారి ఒకరు ఓ మీడియా సంస్థతో చెప్పారు. మరో ముగ్గురు నిందితులపై కేసు విచారణ కొనసాగుతున్నప్పటికీ, సూకీకి సంబంధించిన అభియోగాలపై విచారణ పూర్తయిందన్నారు.
కోర్టు విచారణకు జర్నలిస్ట్‌లకు కూడా ప్రవేశార్హత లేదు. అయితే విదేశీ దౌత్యవేత్తలను మాత్రం విచారణను వీక్షించేందుకు అనుమతించారు. గతంలో మయన్మార్ అధికార మిలిటరీ జుంతాకు అనుకూలంగా తీర్పులు వెల్లడించిన మయన్మార్ కోర్టులు సూకీ విచారణపై ఎటువంటి తీర్పు వెల్లడించనున్నాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొనివుంది.