తాలిబాన్ అనుకూలవాదిగా పేరున్న పాక్ మతపెద్ద సుఫీ ముహమ్మద్‌ను, ఆయన ఇద్దరు కుమారులను పాకిస్థాన్ భద్రతా యంత్రాంగం అరెస్టు చేసింది. గతంలో పాకిస్థాన్ ప్రభుత్వం- తాలిబాన్ తీవ్రవాదుల మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో సుఫీ ముహమ్మద్ మధ్యవర్తిత్వం వహించారు. ప్రస్తుతం ఈ ఒప్పందం అమల్లో లేదు. దీనిని ఇరువర్గాలు రద్దు చేసుకున్నాయి.
ఇదిలా ఉంటే పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్ ప్రధాన నగరం పెషావర్‌లో సుఫీ ముహమ్మద్‌ను, ఆయన ఇద్దరు కుమారులను అధికారిక యంత్రాంగం అరెస్టు చేసింది. తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా సుఫీ ముహమ్మద్ సమస్యాత్మక స్వాత్ లోయలో అశాంతి నెలకొనడానికి, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో ఆయన ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
నిషేధిత తెహ్రీక్ ఎ నిఫాజ్ ఎ షరియా ముహమ్మదీ సంస్థకు సుఫీ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ఇద్దరు కుమారులు జియాఉల్లా, రిజ్వానుల్లా, వారి సహాయకుడొకరిని కూడా పెషావర్‌లో భద్రతా యంత్రాంగం అరెస్టు చేసింది.
అధికారులు ఈ నలుగురిని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. స్వాత్ లోయతోపాటు, మొత్తం మలకాండ్ డివిజన్‌లో తీవ్రవాదాన్ని, హింసాకాండను ప్రోత్సహిస్తున్నందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు సుఫీని అరెస్టు చేశామని ఆదివారం నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్ సమాచార శాఖ మంత్రి మియాన్ ఇఫ్తిఖర్ హుస్సేన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.