Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటనను శాసించిన యశస్వి మన "ఎస్వీ"

Webdunia
" బాబూ వినరా.. అన్నా తమ్ములా కథ ఒకటి" అంటూ ఎన్నో ఆశలతో పెంచుకున్న అనుబంధం ముక్కలైతే కంటనీరు ఒలికించే ఇంటిపెద్దగా, "వివాహ భోజనంబు, వింతైన వంటకంబు" అంటూ ఘటోత్కచుడిగా, "డోంగ్రే, గూట్లే.. మాట తప్పావ్, పచ్చి నెత్తురు తాగుతా" అంటూ కర్కశమైన రౌడీగా... నరకాసురుడు, కంసుడు, రావణుడు, కీచకుడు, హిరణ్యకశిపుడు... ఇలా అనేక రకాలుగా సమస్త దక్షిణ భారత ప్రేక్షకుల ముందు ఒక నటమాంత్రికుడు "ప్రతి నాయకుడి"గా ప్రత్యక్షమవుతాడు. ఆ మాంత్రికుడే ఎస్వీ. రంగారావు.

భయానకం, వీరం, రౌద్రం, కరుణం, శృంగారం, హాస్యం, శాంతం, బీభత్సం, అద్భుతం... అనే నవరసాలన్నింటినీ తన పాత్రల స్వభావంలో సునాయాసంగా ఒలికించి, అందరి మన్ననలు పొందిన మహానటుడు ఎస్వీ రంగారావు. ఏ పాత్ర అయినా దాంట్లో పరిపూర్ణ నటుడిని చూసిన అనుభూతిని కలిగించిన ఈ నటసార్వభౌముడి జన్మదినం.. చరిత్రలో జూలై 3వ తేదీకి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది.
ఆయనకు ఆయనే సాటి...!
  ఆయనలోని గంభీర స్వరం, మాటల్లోని ఈజ్, మాట విరవడంలో, అభినయంలో ఆయనకు ఆయనే సాటి. పౌరాణిక పాత్రలకు సరిపోయే ఆహార్యం, రాజసం, ఠీవి, దర్పం ఆయన సొంతం. ఏ పాత్రలోనైనా ఇట్టే ఎదిగిపోగా ఆయన స్వభావంతో పాటు, ఆయన పాత్రలు కూడా ఆయన్లో ఒదిగిపోయి "వహ్వా" అనిపిస్తాయి...      


మూడు దశాబ్దాలపాటు మూడొందలకు పైగా చిత్రాలలో నటించి ఆయా పాత్రలలో మమేకమై జీవించిన సామార్ల వెంకట రంగారావు... కృష్ణ జిల్లా నూజివీడులో కోటేశ్వరనాయుడు, లక్ష్మీ నరసాయమ్మ దంపతులకు 1918 జులై 3న జన్మించారు. తండ్రి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కావడం వల్ల అనేక ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది. దీంతో రంగారావు మద్రాసులో ఉండే నాన్నమ్మ వద్దనే పెరిగారు.

ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేసిన రంగారావు తొలిసారిగా మద్రాసు హిందూ హైస్కూల్‌లో తన పదిహేనో ఏట ముఖానికి రంగేసుకున్నారు. ఆ తరువాత నటనమీద ఉండే ఇంట్రెస్టుతో ఎక్కడ ఏ నాటక ప్రదర్శన జరిగినా అక్కడ వాలిపోయేవారు. నాన్నమ్మ ఏలూరుకు మకాం మార్చటంతో ఆమెతో పాటు వెళ్ళిన ఎస్వీఆర్ విశాఖలో ఇంటర్, కాకినాడలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తరువాత ఫైర్ ఆఫీసర్‌గా బందరు, విజయనగరం తదితర ప్రాంతాల్లో పనిచేశారు.

ఉద్యోగం చేస్తున్నా ఎస్వీఆర్‌కి నటనలో మాత్రం ఆసక్తి తగ్గలేదు. అడపాదడపా నాటకాలు వేస్తూనే వచ్చారు. ఆ తరం నటీనటులు అధికులతో ఎస్‌.వి.ఆర్‌.కి కళాశాల స్థాయిలోనే సంబంధాలు ఏర్పర్చుకున్నారు కూడా..! ఈ క్రమంలో ఆయన బంధువొకరు తీస్తున్న "వరూధిని" చిత్రంలో నటించారు. ఆయన ఇందులో బాగానే నటించినా, చిత్రం విజయం సాధించకపోవటంతో అవకాశాలన్నీ వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయాయి. ఈలోపు మేనమామ కుమార్తె లీలావతితో ఆయనకు వివాహం అయ్యింది.

ఆ తరువాత "మనదేశం, తిరుగుబాటు" లాంటి చిత్రాలలో చిన్నా చితక వేషాలు వేసినా... విజయా సంస్థ తొలి చిత్రం "షావుకారు"లో సున్నపు రంగడు పాత్ర ఆయన సినీ జీవితాన్ని మలుపుతిప్పింది. వెంటనే "పాతాళ భైరవి"లో మహా మాంత్రికుడి పాత్ర వెతుక్కుంటూ వచ్చింది. ఆ పాత్ర అప్పుడే కాదు ఎప్పటికీ నిత్య ‘రాక్షసమే’. అదే ఎస్‌.వి.ఆర్‌.ని ఒక గాంభీర్యం, ఒక నిండుదనం, ఒక విలక్షణ పోషణ, ఒక అసమాన నటనా కౌశలం ఉన్న నటుడిగా పరిచయం చేసింది.

ఇక అప్పట్నినుంచీ ఎస్వీఆర్ వెనుదిరిగి చూడలేదు. పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.

ఆయనలోని గంభీర స్వరం, మాటల్లోని ఈజ్, మాట విరవడంలో, అభినయంలో ఆయనకు ఆయనే సాటి. పౌరాణిక పాత్రలకు సరిపోయే ఆహార్యం, రాజసం, ఠీవి, దర్పం ఆయన సొంతం. ఏ పాత్రలోనైనా ఇట్టే ఎదిగిపోగా ఆయన స్వభావంతో పాటు, ఆయన పాత్రలు కూడా ఆయన్లో ఒదిగిపోయి "వహ్వా" అనిపిస్తాయి.

కళ్లతో మాట్లాడుతూ.. కనుబొమలతో మనల్ని కదలించే మహానటుడు ఎస్వీఆర్. అందుకే ఆయన "నర్తనశాల"లో నటించిన కీచక పాత్రకి జకార్తాలో జరిగిన "ఫిల్మ్‌ ఫెస్టివల్‌"లో ఉత్తమ నటుడిగా బహుమతినందుకున్నారు. అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో అవార్డునందుకున్న తొలి నటుడు కూడా ఆయనే...!

1946 లో వచ్చిన ‘వరూధిని’ చిత్రం నుంచి 1974లో విడుదలైన ‘యశోధకృష్ణ’ సినిమా వరకు తెలుగులో నూట అరవై చిత్రాలు, తమిళంలో నూరు చిత్రాలు, కన్నడంలో రెండు, మలయాళంలో మూడు, హిందీలో మూడు చిత్రాల్లో నటించారు. అభిమానులు ప్రేమతో ‘విశ్వనట చక్రవర్తి, నటసార్వభౌమ, నటశేఖర, నటసింహ’ వంటి బిరుదులతో ఘనంగా సత్కరించారు. అనేక పర్యాయాలు ఉత్తమ నటుడు, ఉత్తమసహాయ నటుడి అవార్డులు, రాష్ట్రపతి పతకాలు పొందారు.

నిర్మాతగా "నాదీ అడజన్మే" చిత్రాన్ని, దర్శక నిర్మాతగా "చదరంగం, బాంధవ్యాలు" అనే చిత్రాలను రూపొందించారు. దర్శకుడిగా అవి ఆయనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చాయి. వ్యక్తిగా చమత్కారి, హాస్యప్రియుడు, భేషజాలు లేని నిరాడంబరుడు, సామాజిక సేవా సంస్థలకు తన వంతు సాయం అందించడంలో ఏనాడూ వెనుకంజ వేయలేదు. భారత్-చైనా, భారత్‌-పాక్‌ యుద్ధాల సమయాల్లో ఆర్థిక సాయం అందించడమే కాక, నాటక ప్రదర్శనలతో దేశానికి రక్షణ నిధిని సమకూర్చారు.

వ్యక్తిగా రంగారావు సహృదయుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవారు కారు. 1974 జులై 18న రెండోసారి వచ్చిన గుండెపోటుతో ఈ నటసార్వభౌముడు మద్రాసులో తుదిశ్వాస విడిచి అఖిలాంద్ర ప్రేక్షకులకు తీరని దుఃఖాన్ని కలిగించారు. భౌతికంగా ఆయన లేకుండా ఎన్నో ఏళ్లు గడిచినా, ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో ఆ నటచక్రవర్తి స్థానం ఎన్నటికీ చెరిగిపోనిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

Show comments