తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా మహిళను చేయాలని ఉందని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. వరంగల్ జిల్లా మడికొండలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తెరాస కంటే ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రతిపాదన చేసిందని రాహుల్ గాంధీ తెలిపారు.
తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర ఏమీ లేదనీ, టి బిల్లు రూపకల్పన దగ్గర్నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి అవసరమైనవేమిటనేవన్నీ కాంగ్రెస్ పార్టీ రూపొందించిందని చెప్పుకొచ్చారు.
తాము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే పార్లమెంటులో బీజేపీ, టీడీపీలు అడ్డుకునే ప్రయత్నం చేశాయని అన్నారు. వారి అడ్డంకులను అన్నింటినీ అధిగమించి జూన్ 2న తెలంగాణ ప్రజల కల సాకారం కాబోతోందని చెప్పారు. 29వ రాష్ట్రంగా ఏర్పడబోతున్న తెలంగాణ ఒక్కటే కాదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని వెల్లడించారు.