Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా ఎన్నికలు : బూతులు తిట్టుకుంటున్న ట్రంప్, హిల్లరీ... అమెరికా పెద్దన్న పాత్ర గోవిందా...?!!

మరో 3 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ఎవరో తేలిపోనుంది. ఐతే అమెరికా చరిత్రలో 2016 ఎన్నికలు చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. హిల్లరీ క్లింటన్, డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ ఇద్దరిలో ఎవరు గెలి

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (17:52 IST)
మరో 3 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ఎవరో తేలిపోనుంది. ఐతే అమెరికా చరిత్రలో 2016 ఎన్నికలు చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. హిల్లరీ క్లింటన్, డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా ఈ ఎన్నికల సమయంలో వారి వాగ్యుద్ధాలు, స్థాయి దిగజారి చేసుకున్న వ్యాఖ్యలు అమెరికా పరువుకు మాయని మచ్చ తేవడం ఖాయం అంటున్నారు నిపుణులు. ప్రపంచానికి పెద్దన్నగా వెలిగిపోతోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బూతు బాగోతం నడుస్తోంది. దేశ, ప్రపంచాభివృద్ధికి అవసరమైన నిర్మాణాత్మక సూచనలు, సలహాలు.. విమర్శలు, ప్రతి విమర్శలు చేయాల్సిన అభ్యర్థులు వాళ్ల వాళ్ల బూతు బాగోతాలపైనే దృష్టిపెడుతున్నారు. అధ్యక్ష పదవికి జరుగుతున్న పోటీలో అభ్యర్థులు విస్తృతంగా వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు.
 
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఆయా పార్టీల అధినేతలపై, మంత్రులపై, ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం భారతదేశం లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సర్వసాధారణంగా కనిపించే విషయమే. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వారిని చూశాక వాళ్లు కూడా భారతీయ నాయకుల స్థాయికి దిగి వచ్చారనే అనిపించకమానదు. అమెరికా ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పర్యాయం హిల్లరీ - ట్రంప్ మధ్య వ్యక్తిగత విమర్శలు పరాకాష్టకు చేరాయి. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఆడవాళ్లు కనబడితే ఎగబడతాడని ప్రచారం జరుగుతోంది. 
 
తాజాగా డెమొక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ కూడా ఒక సందర్భంలో ట్రంప్‌ తనపైకి కామంతో ఎగబడే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. హిల్లరీ కంటే ముందు పలువురు మహిళలు కొన్నేళ్ళ క్రితం డొనాల్డ్‌ ట్రంప్‌ తమతో అలా అసభ్యంగా ప్రవర్తించాడు, ఇలా అసభ్యంగా ప్రవర్తించాడు - అక్కడ చేతులు వేశాడు, ఇక్కడ చేతులు వేశాడు అంటూ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కొన్ని ఏళ్ల క్రితం ఈ సంఘటనలు జరిగితే ఇంతకాలానికి వారు ఎందుకు స్పందిస్తున్నారనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఈ ఎన్నికల సమయంలోనే వారికి ఆ విషయాలు ఎందుకు గుర్తొచ్చాయా? ట్రంప్ పైన అనేక లైంగిక, వ్యక్తిగత ఆరోపణలు డెమొక్రాటిక్ పార్టీ నేతలు చేస్తుండగా, ట్రంప్ కూడా అదేరీతిలో బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన లైంగిక వేధింపులను తిరగతోడుతున్నారు. తాజాగా మరో అడుగుముందుకేసిన ట్రంప్ మీడియా మద్దతు లేకపోతే హిల్లరీ క్లింటన్‌కు కుక్కలు పట్టే ఉద్యోగం కూడా దొరకదని వ్యాఖ్యానించాడు. హిల్లరి భర్త బిల్ క్లింటన్‌ను సెక్స్ జంతువు అని అభివర్ణించారు.
 
అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు, పాటించాల్సిన విధానాల గురించి అధ్యక్ష అభ్యర్థుల మనోభావాలను తెలుసుకునే ప్రెసిడెన్షియల్ డిబేట్‌కు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గౌరవం ఉంది. కానీ ఈ డిబేట్లు ఈసారి పరస్పర దూషణలకు వేదిక అయ్యాయి. తొలి టీవీ చర్చలో హిల్లరీ అనారోగ్యాన్ని వేలెత్తి చూపుతూ చర్చ జరిగినంత సేపూ ట్రంప్‌ ముక్కు చీదుతున్నట్టు నటించి ఆమెను గేలి చేశారు. ట్రంప్‌ పన్నులు ఎగవేశారని, జాత్యహంకార ధోరణికి ఆయన మారుపేరని హిల్లరీ విమర్శించగా హిల్లరీ వివాదాస్పద మెయిల్స్‌ను గురించి ట్రంప్‌ ఆక్షేపించారు. రెండో చర్చా వేదికలో ఇద్దరు నేతలూ పూర్తిగా దిగజారిపోయి వ్యాఖ్యలు చేసుకున్నారు. 2005లో విశ్వసుందరిపై ట్రంప్‌ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ట్రంప్‌కు మహిళలంటే గౌరవం లేదని హిల్లరీ దుయ్యబట్టారు. దీనికి ట్రంప్‌ తాను కేవలం మాటల మనిషినేనని, హిల్లరీ భర్త బిల్ క్లింటన్ లాగా తాను చేతల మనిషిని కాదని ఎద్దేవా చేశారు. చివరి రౌండ్‌లో రిగ్గింగ్‌ చేసి తనపై గెలిచేందుకు హిల్లరీ కుట్రపన్నుతున్నారంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్  ఏంటని యావత్ ప్రపంచం నిర్ఘాంతపోయింది.
 
2016 జూన్ 16న రిపబ్లికన్ అభ్యర్థుల్లో ఒకరిగా బరిలో నిలిచిన ట్రంప్‌ చేసిన తొలి ప్రసంగమే సంచలనాలకు వేదిక అయింది. అమెరికాలో ఉన్న మెక్సికన్లు నేరగాళ్లు, రేపిస్టులు.. వాళ్లని దేశం నుంచి తరిమేస్తానని ప్రకటించి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కొత్త అధ్యాయానికి తెరతీశారు ట్రంప్‌. దీనికి హిల్లరీ మెక్సికన్లు కాదు నువ్వే రేపిస్టువి.. ఫాసిస్టువి అంటూ ట్రంప్‌పై ఎదురుదాడి చేయడంతో తిట్లపర్వం మొదలైంది. మాటల యుద్ధం కాస్తా జుగుప్సాకరమైన చర్యల దాకా వెళ్లింది. శానఫ్రాన్సిస్కోలో రాత్రికి రాత్రి నగ్నంగా ఉన్న ట్రంప్‌ విగ్రహాలు వెలిసాయి. ఆ వెంటనే.. హిల్లరీ ముఖానికి నల్లరంగు పూసిన కార్టూన్లు, పోస్టర్లు వేల సంఖ్యలో జనాల్లోకి వచ్చేశాయి. టాయిలెట్‌ పేపర్లపైన.. మద్యం సీసాల మీద.. ఆఖరికి చూయింగ్‌ గమ్‌ రేపర్లను కూడా వదలకుండా ప్రత్యర్థులను కించపరిచే వ్యాఖ్యలు, చిత్రాలతో ఇరువర్గాలూ జుగుప్సాకరంగా ప్రవర్తించాయి.
 
200 ఏళ్లకు పైబడిన అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో దూషణల పర్వం కొత్తదేమీ కాదుగానీ.. సరికొత్త అధమస్థాయిలకు దిగజారడం మాత్రం ఇదే మొదటిసారి. పరస్పర వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు, జుగుప్సాకర వ్యాఖ్యలతో అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఒబామా మొదలుకుని మాజీ విశ్వసుందరి దాకా అందరినీ ప్రచారంలో వీధుల్లోకి లాగారు. ట్రంప్‌ మహిళలతో అసభ్యంగా ఉన్న వీడియోలు హల్‌చల్‌ చేశాయి. సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నారు. అమెరికా పౌరశాస్త్ర పాఠ్యాంశాల్లో ఇప్పుడు ఈ తిట్ల పురాణంతో కొత్త పాఠం చేర్చక తప్పదని మరికొందరు చలోక్తులు విసురుతున్నారు. నిజానికి లైంగిక ఆరోపణలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్తేం కాదు. అమెరికా ఆరో అధ్యక్షుడైన జాన్‌ క్విన్సీ ఆడమ్స్‌పై 1828 లోనే పలు ఆరోపణలొచ్చాయి. ఆయన రాజకీయ లబ్ధి కోసం తన పనిమనిషిని రష్యన్‌ జార్‌ అలెగ్జాండర్‌1 వద్దకు పంపారని విస్తృతంగా ప్రచారమైంది. 1825లో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన 2 శతాబ్దాల్లో జరిగిన పలు ఎన్నికల్లో ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడిచింది. కానీ ప్రస్తుత అభ్యర్థులు అధ్యక్ష ఎన్నికలను వీధి రాజకీయంగా మార్చేశారని విశ్లేషకులు వాపోతున్నారు.
 
ఏది ఏమైనా అధ్యక్ష పదవికి జరుగుతున్న ప్రచారం సందర్భంగా ఇరువురు అభ్యర్థుల సంభాషణలు, విమర్శలు, ప్రతి విమర్శలు రోతపుట్టిస్తున్నాయి. పెద్దన్నగా ప్రపంచాన్నే అదుపు చేయాలని ప్రయత్నించే అమెరికాకు తలవంపులు తెచ్చాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బలహీనమైన దేశాలు బలమైన దేశాలుగా అభివృద్ధి చెందుతుండగా, బలమైన దేశాలు బలహీనమైన దేశాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అగ్ర రాజ్యంగా ఎంతకాలం ఉంటుందో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం