ఇటీవలి కాలంలో పెళ్లికాని యువతీయువకులు సహజీవనం పేరుతో తమ బంధాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో సహజీవనంలో జంటల మధ్య ఎలాంటి మనస్పర్థలు చోటుచేసుకున్నా అది రెండోవారి ప్రాణాల మీదకి వచ్చేస్తుంది. ఇటీవల అలాంటి దారుణ ఘటన ఒకటి జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలు తనను పెళ్లాడాలంటూ ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేసాడు ప్రియుడు.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని బృందావన్ ధాంలో గత ఐదేళ్లుగా ప్రియురాలు పింకీతో సంజయ్ పాటిదార్ అనే యువకుడు సహజీవనం చేస్తున్నాడు. కాలం గడుస్తూ వుండటంతో పింకీ... మనం ఒకరికొకరు అర్థం చేసుకున్నాము కదా... నన్ను వివాహం చేసుకో అంటూ సంజయ్ పైన ఒత్తిడి తీసుకువచ్చింది. గత ఐదేళ్లుగా ఆమెను అనుభవిస్తూ వచ్చిన సంజయ్... ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని తన స్నేహితుడు వినోద్ తో కలిసి హత్యకు ప్లాన్ చేసాడు. ఈ క్రమంలో ఆమెను అదను చూసి హత్య చేసాడు.
ఆమె మృతదేహాన్ని బయటకు తీసుకుని వెళ్లకుండా కాళ్లూ చేతులు కట్టేసి ఇంట్లో వున్న ఫ్రిడ్జిలో కుక్కేసాడు. అనంతరం ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఐతే ఇంటి నుంచి దుర్గంధం వస్తుండటంతో పాటు ఇంట్లో ఎవ్వరూ కనిపించకపోవడంతో ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి తలుపులను తెరిచి చూడగా విషయం బైటపడింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.