దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని దీంతో వైరస్ వ్యాప్తి పెరిగిపోతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో రానున్నరోజులు చాలా ప్రమాదకరంగా మారతాయని ఆయన హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభణపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇకనైనా ప్రజలు అప్రమత్తమై కరోనా కట్టడికి సహకరించాలని మంత్రి సూచించారు. ప్రజలు పూర్తి స్థాయిలో మాస్క్‌లు ధరించడం లేదు. కొందరు మాస్క్‌ను మెడ భాగానికి, జేబుకే పరిమితం చేస్తున్నారు. దీని వల్ల వైరస్ సులువుగా వ్యాపిస్తోంది.
కొవిడ్‌పై ప్రాథమిక జాగ్రత్తలు పాటించినపుడే వైరస్‌ను కట్టడి చేయగలం. ప్రస్తుతానికి కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మేరకు దేశంలో అందుబాటులో ఉన్న ఆ రెండు టీకాలను తీసుకోవాలి. రానున్నరోజుల్లో వ్యాక్సిన్ పంపిణీని మరింత వేగవంతం చేయనున్నాం అని మంత్రి వివరించారు..