తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గి.. ఇపుడు మళ్లీ విజృంభిస్తోంది. ఫలితంగా బుధవారం సెంచరీకిపైగా కొత్త కేసులు నమోదు కాగా, గురువారం కూడా మరో సెంచరీకి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1908కి చేరింది.
రాష్ట్రానికి వలస వచ్చిన వారిలో గురువారం కొత్తగా 117 కొత్త కేసులు నమోదయ్యాయి. స్థానికంగా 66 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 51 మందికి కరోనా సోకినట్టు తేలింది. వారిలో సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇద్దరు వలస కార్మికులు కూడా కరోనా బారినపడ్డారు.
దీంతో ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో మొత్తం 348 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ సోకి చికిత్స తీసుకుని మెరుగుపడి డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1345 మంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 67. ప్రస్తుతం ఆస్పత్రుల్లో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 844గా వుంది.