ఒకపుడు సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా న్యాయవాద వృత్తిని చెప్పుకునేవారు. అయితే.. ఐటీ బూమ్ పుణ్యమాని ఈ వృత్తి కోర్సుల పట్ల యువతలో ఆసక్తి బాగా తగ్గిపోయింది. యువతీ యువకులు ఎక్కువగా ఐటీ కోర్సులపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
దీనికి ఉదాహరణగా.. లా సెట్ ప్రవేశ పరీక్షను తీసుకోవచ్చు. గత ఏడాది నిర్వహించిన ఈ పరీక్షకు 12 వేల మంది అభ్యర్థులు హాజరుకాగా, ఈ దఫా మాత్రం కేవలం తొమ్మిది వేల మంది మాత్రమే హాజరయ్యారు.
పరీక్షలో లా కోర్సులకు అర్హత సాధించినప్పటికీ యువత మాత్రం ఈ కోర్సుల్లో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో కళాశాలల్లో సీట్లన్నీ ఖాళీగానే మిగిలిపోతున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్, ఐటీ కోర్సుల పట్ల చూపిస్తున్న ఆసక్తిని లా కోర్సుల పట్ల విద్యార్థులు చూపించడం లేదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే దేశంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు కొరత ఉందని, అందువల్లే కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల్లో లా కోర్సుల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.