Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆద్యంతం థ్రిల్లింగ్‌నిచ్చే "శేషాచలం" ట్రెక్కింగ్...!!

Webdunia
మన శరీరంలోని సిరలు, ధమనుల్లాగా అంతుపట్టకుండా ఉంటాయి "శేషాచలం" దారులన్నీ...! చుట్టూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుగా ఉండే కొండలు, లోయలు, చెట్లుచేమలూ, లెక్కలేనన్ని వన్యప్రాణులు.. వీటన్నింటికీ ఆలంబనగా అక్కడక్కడా నీటి చలిమలు, సెలయేళ్ళు ఈ శేషాచలం అడవి సొంతం.

తూర్పు కనుమలలో భాగమయిన శేషాచలం వనసీమ నిజానికి తిరుమలకు ఆధ్యాత్మిక అంతరాత్మ అని చెప్పవచ్చు. పురాణాలలో కనిపించే శేషపాన్పునే మన పూర్వీకులు శేషాచలం కొండతో పోల్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప జిల్లాల మధ్యన విస్తరించి ఉన్నవే శేషాచలం కొండలు.

అబ్బురపరిచే పెద్దపులి చిత్రం..!
  మూడువేల సంవత్సరాల క్రితం ఆదిమ మానవుడు గీసిన పెద్దపులి చిత్రం ఈ దారిలోనే కనిపిస్తుంది. అలాగే బూచోళ్ళపేట దగ్గర ఓ రాతి గోడపై గీసిన పురాతన అడవి చిత్రకారుల సహజ వర్ణ చిత్రాలు మనల్ని అబ్బుర పరుస్తాయి. అందులోని ఏనుగు సవారీ, వేట, కత్తీ డాలు, పిట్టలు...      
ఎర్రచందనానికి ప్రసిద్ధిగాంచిన శేషాచలం కొండల్లోకి ట్రెక్కింగ్ వెళ్ళాలంటే ముందుగా... రేణిగుంట-కడప జాతీయ రహదారి మీదుగా కుక్కల దొడ్డి గ్రామంవద్ద ఉన్న "బాలపల్లె బంగ్లా క్యాంప్" నుంచి బయలుదేరాలి. 1920లో బ్రిటీష్‌వారు కట్టిన ఈ బంగ్లా అప్పట్లో ఎందరో బ్రిటీష్ అధికారులకు, కలెక్టర్లకు, సర్వేయర్లకు, వేటగాళ్లకు ఆతిథ్యం ఇచ్చింది. ప్రఖ్యాత వేటగాడు కెన్నెత్ అండర్సన్ మనుషులను తినే ఒక పెద్దపులిని చంపేందుకు ఇక్కడే ఉండి పథకం వేశాడట.

ఆ తరువాత రాష్ట్రంలోనే మొదటి జాతీయ పార్కు అయిన శ్రీవెంకటేశ్వరా జాతీయోద్యానవనం గుండా ప్రయాణం సాగించాలి. తిరుమల, దాని చుట్టూ ఉండే వనాలన్నీ శ్రీ వెంకటేశ్వరా అభయారణ్యం పరిధిలోకే వస్తాయి. ఎప్పుడో 140 సంవత్సరాల క్రితమే అంతరించిపోయిందని అందరూ అనుకుంటున్న బంగారు బల్లిని ఆ మధ్య శాస్త్రవేత్తలు ఈ అడవుల్లోనే కనుగొన్నారట.

ప్రయాణం అలా సాగుతుండగా "ఇరుసులు" అనే తొలి మజిలీ చేరుకుంటాం. పచ్చిని కొండల నడుమ ఆకుదొన్నెను మరిపించే ఒక రమ్యమైన ప్రదేశమే ఇరుసులు. ఇక్కడి మడుగులోని నీరు అడుగుభాగం కూడా కనిపించేటంత స్వచ్ఛంగా ఉంటాయి. తరువాత ఈ ప్రాంతానికి దగ్గర్లోనే ఉన్న "చాకిరేవుబాన జలపాతం" దిశగా ప్రయాణం సాగించాలి.

ఆ తరువాత దారిలో కనిపించే యానాదుల ఆరాధ్య స్థలం "చెంచమ్మ పేట", దానికి కుడివైపున "కరవు కోన", ఎడమవైపున "మాలోడి పేట" ముందుకు వెళితే "తుంబుర తీర్థం" వైపుగా ప్రయాణం సాగుతుంది. మూడువేల సంవత్సరాల క్రితం ఆదిమ మానవుడు గీసిన పెద్దపులి చిత్రం ఈ దారిలోనే కనిపిస్తుంది. అలాగే బూచోళ్ళపేట దగ్గర ఓ రాతి గోడపై గీసిన పురాతన అడవి చిత్రకారుల సహజ వర్ణ చిత్రాలు మనల్ని అబ్బుర పరుస్తాయి. అందులోని ఏనుగు సవారీ, వేట, కత్తీ డాలు, పిట్టలు, నృత్యాలు గత కాలాన్ని మన కళ్లముందు సాక్షాత్కరిస్తాయి.

అలా వెళ్ళగా వెళ్ళగా... ప్రముఖ కవయిత్రి, శ్రీనివాసుని పరమ భక్తురాలు తరిగొండ వెంగమాంబ తపస్సు చేసిన తరిగొండమ్మ గవి వస్తుంది. ఇది చాలా పెద్దది. ఇక్కడ ప్రతిఏటా మాఘశుద్ధ పౌర్ణమికి ఉత్సవాలు జరుగుతాయి. పెద్ద సంఖ్యలో యాత్రికులు కూడా వస్తుంటారు. ఇదే దారిలో నారద మంటపం, దీన్ని దాటుకుని వెళ్తే తుంబుర తీర్థానికి చేరుకుంటాం.

కొన్ని లక్షల సంవత్సరాల భౌగోళిక పరిణామక్రమంలో రెండుగా చీలిన శిఖరమే తుంబుర తీర్థ శిఖరం. ఆ చీలిక పొడవునా నీటికుండాలు, దొనలు, మడుగులు ఏర్పడ్డాయి. వీటి అంచున ఎంతో జాగ్రత్తగా నడుస్తూ ముందుకెళితే తుంబుర తీర్థ ప్రవాహం చల్లగా పలుకరిస్తుంది.

ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. నమ్మకం సంగతలా ఉంచితే అనేకమైన మూలికలను స్పర్శిస్తూ, స్వచ్ఛమైన గాలిని ఒరుసుకుంటూ వచ్చే ఆ నీటిలో స్నానం చేస్తే మనసుకు, శరీరానికి కూడా ఒక అనిర్వచనీయమైన ఆనందం కలగడం మాత్రం వాస్తవం.

ఆపై కొండవాలు మీద నుంచి ప్రయాణిస్తూ దిగుడుబావి లాంటి "రామకృష్ణ తీర్థం" చేరుకుంటాం. ప్రతి ఏటా ముక్కోటికి ఇక్కడ జరిగే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు హాజరవుతుంటారు. ఆ తరువాత అలాగే ముందుకెళ్తే మలయాళస్వామి తపస్సు చేసిన "సనకసనంద తీర్థం" దర్శించి, పాపనాశనం డ్యామ్ మీదుగా శ్రీనివాసుడి ఇల వైకుంఠం తిరుమల దిశగా సాగిపోతుంది శేషాచలం ప్రయాణం...!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రముఖ గాయకుడు పి.జయచంద్రన్ కన్నుమూత

వరకట్నం కోసం 21 ఏళ్ల మహిళ గొంతు కోసి చంపేశారు..

కోడలిని హత్య చేసి పాతిపెట్టిన అత్తమామలు.. చివరికి ఏమైందంటే?

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Show comments