Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా అధ్యక్ష ఎన్నికలు: అధికార మార్పిడి ఎలా జరుగుతుంది?

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (10:26 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలిచినట్లు ఇంకా డోనల్డ్ ట్రంప్ ఒప్పుకోలేదు. కానీ అధికార మార్పిడికి మాత్రం అంగీకారం తెలిపారు. మరోవైపు బైడెన్ గెలుపును సవాల్ చేసేందుకు చట్టపరమైన అన్ని మార్గాలనూ ఆయన న్యాయవాదుల బృందం అన్వేషిస్తోంది. ఇంతకీ అధికార మార్పిడి అంటే ఏమిటి? దీన్ని ఎందుకు అంత ముఖ్యమైన ప్రక్రియగా భావిస్తారు?

 
అధికార మార్పిడి అంటే..
కీలకమైన సమాచారాన్ని, విధులను ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయడం. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడి బృందం వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే విధులు నిర్వర్తించేందుకు సహాయపడటం. రాబోయే ప్రభుత్వానికి జనరల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్‌ (జీఎస్‌ఏ)గా పిలిచే ఓ ప్రభుత్వ సంస్థ సాయం చేస్తుంది. ఆఫీసులో లోపలి ప్రాంతాలతోపాటు, పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం కోసం నిధులు సమకూరుస్తుంది.

 
ఈ అధికార మార్పిడి ప్రక్రియకు దాదాపుగా 11 వారాల సమయం పడుతుంది. అంటే ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారో తెలిసినప్పటి నుంచి అధికారికంగా బాధ్యతలు తీసుకునే వరకు (జనవరి 20 వరకు) సమయం అవసరం అవుతుంది. ఇక్కడ కేవలం అధ్యక్షుడు మాత్రమే మారరు. దాదాపు 4,000 రాజకీయ పదవుల్లో మార్పులు వస్తాయని సెంటర్ ఫర్ ప్రెసిడెన్సియల్ ట్రాన్సిషన్ తెలిపింది.

 
ఈ సమయంలో ఏం జరుగుతుంది?
అధికార మార్పిడి సమయంలో తొలుత కొత్త సిబ్బంది ఎంపిక జరుగుతుంది. తర్వాత వారికి విధుల నిర్వహణలో కీలకమయ్యే సమాచారాన్ని అందిస్తారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి షెడ్యూల్‌ను కూడా రూపొందిస్తారు. ఒకసారి అధికారికంగా పదవీ బాధ్యతల బదిలీ మొదలైతే.. కొత్త అధ్యక్షుడి అధికార మార్పిడి బృందం బాధ్యతలు తీసుకుంటుంది. మొదటగా వీరికి రోజూ సెక్యూరిటీ సంబంధిత అంశాలపై సమాచారం అందిస్తారు.

 
దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్ష అభ్యర్థులకు ఎన్నికలకు ముందే దేశ భధ్రతకు సంబంధించిన సమాచారం అందిస్తారు. కానీ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తికి మాత్రం మరింత సవివర సమాచారం ఇస్తారు. ముఖ్యంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడమే లక్ష్యంగా.. నిఘా సమాచారాన్ని బైడెన్‌కు అధికారులు అందిస్తారు.

 
2000లో అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడి కాస్త ఆలస్యమైంది. 11 సెప్టెంబరు దాడులను బుష్ ప్రభుత్వం అడ్డుకోవడంలో విఫలం కావడానికి అధికార మార్పిడి ఆలస్యం కూడా ఒక కారణమని దాడులపై దర్యాప్తు చేపట్టిన ఒక కమిషన్ తెలిపింది. అధికారం చేపట్టేందుకు రాబోతున్న అధ్యక్షుడి బృందానికి మొదట ఆఫీసులో స్థలం కేటాయింపు, పరికరాలు, సాంకేతికత బదిలీ జరుగుతుంది.

 
ప్రస్తుత ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటుచేస్తారు. దీంతో విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు కొత్త వ్యక్తుల్ని ఎంచుకోవడానికి వీలు పడుతుంది. కీలకమైన మంత్రులు, అధికారులకు బయటకు వెళ్తున్న సిబ్బంది తాము నిర్వహించిన విధులపై సమాచారం కూడా ఇస్తారు. ఇప్పటికే తన బృందంలోని సభ్యుల్లో కొంత మందిని బైడెన్ ప్రకటించారు. అధికార మార్పిడి ప్రక్రియలో భాగంగా.. ఏ పదవులకు సిబ్బందిని ఎంపిక చేయాలో కొత్త అధ్యక్షులకు ఒక అవగాహన వస్తుంది.

 
కొత్తగా నియమించబోయే 4,000 రాజకీయ పదవుల్లో 1,200 పదవులకు సెనేట్ ఆమోదం అవసరం అవుతుంది. అధికార మార్పిడి సమయంలోనే కొత్తగా పదవుల్లోకి రాబోయే వ్యక్తులకు బ్యాగ్రౌండ్ తనిఖీలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి నడుమ ముఖ్యమైన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి ఎక్కువ సమాచారం తెలుసుకోవాలని భావిస్తున్నట్లు ఇప్పటికే బైడెన్ స్పష్టంచేశారు.

 
ప్రభుత్వ అధికారులతో సమావేశాలతోపాటు విదేశాల్లో ప్రముఖ నాయకులతో కొత్త అధ్యక్షుడు మాట్లాడేందుకు అధికార మార్పిడి బృందం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటివరకు బైడెన్ బృందంలోని అందరూ అనధికార ఛానెళ్ల ద్వారా కాల్స్, మెయిల్స్‌లో సంభాషణ జరిపుతూ వచ్చారు. వీరందరికీ ప్రభుత్వ ఈ-మెయిల్‌తోపాటు అత్యధిక సెక్యూరిటీ కలిగిన సమాచార ప్రసార పరికరాలు ఇస్తారు.

 
గత ఎన్నికల తర్వాత జరిగినట్టే, కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు, ఆయన సతీమణికి వైట్‌హౌస్ మొత్తం పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తారు. కొత్తగా ఎలాంటి మార్పులు చేయమంటారు? ఎలా అలంకరించమంటారు? లాంటి సూచనలన్నీ వారి నుంచి తీసుకుంటారు. ఇదొక ఆనవాయితీ మాత్రమే.

 
ఆలస్యం ఎందుకు?
తదుపరి అధ్యక్షుడిని గుర్తిస్తూ జీఎస్‌ఏ ప్రకటన జారీచేసిన వెంటనే అధికార మార్పిడి ప్రక్రియ మొదలవుతుంది. అయితే, బైడెన్‌ను కొత్త అధ్యక్షుడిగా గుర్తిస్తూ నవంబరు 23 వరకు జీఎస్‌ఏ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. అంటే ఎన్నికలు పూర్తైన మూడు వారాల వరకు ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో బైడెన్‌కు అందాల్సిన నిధులు, ఇతర వనరులు నిలిచిపోయాయి.

 
అధికార మార్పిడి ఇప్పుడు మొదలుకావాలని ఎలాంటి నిబంధనలూ లేవు. దీంతో ఈ అవకాశాన్ని ఉపయోగించి అధికార మార్పిడిని ట్రంప్ బృందం ఆలస్యంచేస్తూ వచ్చింది. అమెరికా చట్టాల ప్రకారం.. ఎన్నికల విజేత ఎవరో తెలిసిన తర్వాత అధికార మార్పిడి ప్రక్రియను జీఎస్‌ఏ మొదలుపెట్టాలి. అయితే ఫలానా రోజు మొదలుపెట్టాలని ఎలాంటి నిబంధనా లేదు.

 
2000లోనూ ఇలానే జరిగింది. సాధారణంగా జరిగే సమయంతో పోలిస్తే.. సగం సమయంలోనే ఆనాడు అధికార మార్పిడి చేయాల్సి వచ్చింది. అప్పట్లో కూడా ఫలితాలను కోర్టులో సవాల్ చేవారు. 2016లో మాత్రం ట్రంప్ విజేతగా గెలిచినట్లు వెంటనే జీఎస్‌ఏ గుర్తించింది. అధికారిక ప్రకటన వెలువడకముందే, అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆయన కలిశారు. ఆ మరుసటిరోజే వైట్‌హౌస్‌లోనూ పర్యటించారు.

 
ఎవరు చెల్లిస్తారు?
అధికార మార్పిడికి అయ్యే ఖర్చుల్లో కొంత ప్రభుత్వం భరిస్తుంది. మిగతావాటికి ప్రైవేటు నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఒకసారి కొత్త అధ్యక్షుణ్ని జీఎస్‌ఏ గుర్తించిన వెంటనే, 7 మిలియన్ డాలర్ల నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి సేకరించిన నిధులు వీటికి అదనం.

 
నవంబరు మొదటి వారంలోనే అధికార మార్పిడి కోసం ఏడు మిలియన్ డాలర్లను బైడెన్ సమీకరించినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఆ తర్వాత కూడా మరిన్ని నిధుల కోసం మద్దతుదారులను ఆయన అభ్యర్థించినట్లు వివరించింది. కొత్త అధ్యక్షుడి అధికార మార్పిడి బృందం బిల్లుల్ని చెల్లించేందుకు ఈ మిలియన్ డాలర్లను వినియోగిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments