Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్ ఎన్నికలు 2024: ట్రంప్, హారిస్‌లలో ఎవరిది ముందంజ? సర్వేలు ఏం చెబుతున్నాయి?

బిబిసి
బుధవారం, 30 అక్టోబరు 2024 (22:17 IST)
అమెరికాకు కాబోయే అధ్యక్షుడి కోసం ఆ దేశ ఓటర్లు నవంబర్ 5న ఓటింగ్‌లో పాల్గొంటారు. మొదట్లో ఈ ఎన్నికలు 2020 నాటి పోటీని పునరావృతం చేస్తాయని అనుకున్నారు. కానీ, జూలైలో అధ్యక్షుడు జో బైడెన్ పోటీ నుంచి తప్పుకుని ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కమలా హారిస్‌‌ను అధ్యక్ష అభ్యర్ధిగా బలపరచడంతో కథ మారిపోయింది. అమెరికా తన తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకుంటుందా ? లేదా రెండోసారి ట్రంప్‌కు అవకాశమిస్తుందా ? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న పెద్ద ప్రశ్న. ఎన్నికల రోజు సమీపిస్తున్న వేళ సర్వేల అంచనాలు, వైట్‌హౌస్ రేసుపై ప్రచారం ఎలాంటి ప్రభావం చూపిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
 
జాతీయ సర్వేల్లో ఎవరు ముందున్నారు..?
జాతీయ సర్వేల సగటును గమనిస్తే ట్రంప్ కంటే కమలా హారిస్ కాస్త ముందంజలో ఉన్నారు. జూలై చివర్లో అధ్యక్ష పదవి రేసులో హారిస్ అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెదే పై చేయిగా ఉంది. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తొలి వారాల్లో హారిస్ ప్రచారంలో గట్టి ప్రభావమే చూపించారు. ఆగస్టు చివరి నాటికి దాదాపు 4 శాతం పాయింట్ల ఆధిక్యతను సాధించారు. సెప్టెంబర్ 10న ఇద్దరి మధ్య ఏకైక డిబేట్‌ జరిగినప్పటికీ, ఈ నంబర్లు సెప్టెంబర్ నెలాఖరుకు కూడా స్థిరంగానే ఉన్నాయి. ఆ డిబేట్‌ను 7 కోట్ల మంది వీక్షించారు. అయితే, గత కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య అంతరం గణనీయంగా తగ్గుతోంది. కింద ఉన్న పోల్ ట్రాకర్ చార్ట్ ‌ను పరిశీలిస్తే ట్రెండ్ లైన్లు సగటును సూచిస్తే, డాట్స్ (చుక్కలు) ప్రతి అభ్యర్థి వ్యక్తిగత సర్వే ఫలితాలను చూపిస్తున్నాయి.
 
ఒక అభ్యర్థి దేశవ్యాప్తంగా ఎంత ప్రజాదరణ పొందారో తెలుసుకోవడానికి ఈ జాతీయ సర్వేలు ఒక గైడ్‌లా ఉపయోగపడతాయి. అంతేకానీ, ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి ఈ సర్వే ఫలితాలే ప్రామాణికం కాదు. ఎందుకంటే, ఎన్నికలలో అమెరికా ఎలక్టోరల్ కాలేజ్‌ అనే పద్ధతిని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా యూఎస్‌లో ప్రతి రాష్ట్రానికి దాని జనాభా ఆధారంగా ఓట్ల సంఖ్య ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీలో 538 ఓట్లు ఉంటాయి. వాటిలో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలో చాలా రాష్ట్రాలు ఎక్కువగా ఒకే పార్టీవైపు మొగ్గుచూపుతాయి. ఇరువురూ గెలిచే అవకాశాలు ఉన్న రాష్ట్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. రెండు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా పోటీపడే అవకాశం ఉన్న రాష్ట్రాలను బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ లేదా స్వింగ్ స్టేట్స్ అంటారు.
 
స్వింగ్ స్టేట్స్‌లో గెలిచేది ఎవరు...?
సర్వేల సగటు ఆధారంగా చూస్తే... ఈ ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్‌గా పరిగణిస్తున్న 7 రాష్ట్రాల్లో పోటీ రసవత్తరంగా ఉంది. ఏ ఒక్క అభ్యర్థికి కూడా నిర్ణయాత్మక ఆధిక్యత లేదు. హారిస్ పోటీలోకి వచ్చినప్పటి నుంచి ట్రెండ్‌లను గమనిస్తే... రాష్ట్రాల మధ్య కొన్ని తేడాలను హైలైట్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. కానీ, జాతీయ సర్వేలతో పోల్చితే రాష్ట్రాల సర్వేలు చాలా తక్కువగానే ఉంటాయి. ప్రతి సర్వేలో ఎంతో కొంత మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది. అంటే, వాళ్లు ప్రకటించిన నంబర్లు వాస్తవానికి కాస్త అటో, ఇటో ఉండొచ్చు.
 
ఆగస్టు ప్రారంభం నుంచి చూసుకుంటే అరిజోనా, జార్జియా, నెవాడా, నార్త్ కరోలినాలో కొన్నిసార్లు ఆధిక్యం చేతులు మారింది. అయినప్పటికీ, ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలలో ఆగస్టు ప్రారంభం నుంచి హారిస్ ఆధిక్యంలో ఉన్నారు. కొన్ని సార్లు ఆ ఆధిక్యం మధ్య తేడా రెండు-మూడు పాయింట్లుగానే ఉంది. ఈ మధ్యకాలంలో పోటీ రసవత్తరంగా మారింది. ప్రస్తుతం పెన్సిల్వేనియాలో ట్రంప్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
 
ట్రంప్ 2016లో అధ్యక్షుడిగా గెలుపొందేవరకు కూడా ఈ మూడు రాష్ట్రాలు డెమొక్రటిక్ పార్టీకి కంచు కోటలుగా ఉండేవి. 2020లో జో బైడెన్ వాటిని మళ్లీ డెమొక్రటిక్ పార్టీ వైపు తిప్పుకున్నారు. ఇప్పుడు హారిస్ కూడా అదే పని చేస్తే, ఆమె గెలుపులో ఈ రాష్ట్రాలు కీలకంగా మారుతాయి. జో బైడెన్ పోటీ నుంచి తప్పుకునే సమయానికి ఈ ఏడు స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ సుమారు 5 శాతం పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే, డెమొక్రటిక్ పార్టీ తరపున కమలా హారిస్ అధ్యక్ష బరిలోకి వచ్చిన తరువాత పోరు ఎలా మారిపోయిందో ఈ సర్వే ఫలితాలను ఓ సంకేతంగా భావించవచ్చు. జో బైడెన్ ‌పోటీ నుంచి తప్పుకునే సయమానికి పెన్సిల్వేనియాలో 4.5 శాతం పాయింట్ల వెనుకంజలో ఉన్నారు. దీనిని మనం కింది చార్ట్‌లో చూడొచ్చు. ఈ ఏడు స్వింగ్ స్టేట్స్‌లో అత్యధిక ఎలక్ట్రోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రం పెన్సిల్వేనియా. అందుకే రెండు పార్టీలకు ఈ రాష్ట్రం ఎంతో కీలకం. ఇక్కడ ఆధిక్యత కనబరిస్తే మ్యాజిక్ ఫిగర్ 270 సాధించడం సులువు అవుతుంది.
 
ఈ సగటులను ఎలా లెక్కిస్తారు?
మేము చూపిస్తున్న గ్రాఫికల్ చిత్రాలలోని సరాసరి గణాంకాలను అమెరికన్ న్యూస్ నెట్‌వర్క్ (ఏబీసీ న్యూస్) పోలింగ్ అనాలసిస్ వెబ్‌సైట్ 538 లెక్కగట్టింది. ఈ సరాసరి లెక్కలు తీయడానికి... జాతీయ స్థాయిలో, స్వింగ్ స్టేట్స్‌లో అనేక సర్వే సంస్థలు చేపట్టిన డాటాను వీరు తీసుకుంటారు.
 
అయితే, ఏ సర్వే సంస్థ అంటే ఆ సర్వే సంస్థ నుంచి వీళ్లు డాటా తీసుకోరు. ఆయా సంస్థలు ఎంత పారదర్శకంగా ఉన్నాయో తెలుసుకోవడానికి...వారు ఎంత మందితో సర్వే నిర్వహించారు? ఏ సమయంలో సర్వే చేశారు? సర్వేలు ఆన్‌లైన్‌లో చేశారా లేదా ఆఫ్‌లైన్ లో చేశారా? వంటి అంశాలను 538 వైబ్‌సైట్ పరిగణలోకి తీసుకుంటుంది.
 
ఈ సర్వేలను ఎంత వరకు నమ్మొచ్చు?
ప్రస్తుతానికైతే, స్వింగ్ స్టేట్స్‌లో కేవలం 2-3 శాతం పాయింట్ల తేడాతో కమలా హారిస్, ట్రంప్‌లు ఆయా రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. దీనిని బట్టే పోటీ ఎంత రసవత్తరంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారు అన్నది అంచనా వేయడం కష్టం.
 
2016, 2020 ఎన్నికల్లో ట్రంప్‌కున్న ప్రజా మద్దతును సర్వేలు తక్కువగా అంచనా వేశాయి.
 
దీంతో, ఎన్నికల్లో వచ్చే ఫలితాలు తమ అంచనాలు దగ్గరగా ఉండేందుకు ఆయా సర్వే సంస్థలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జనరల్‌గా హీరోయిన్‌కి స్పేస్ ఉండదు - పర్సనల్‌గా నాకు రాకెట్ ఇష్టం: రుక్మిణి

50 ఏళ్ల 50 కేజీల తాజమహల్ బ్యూటీ 'ఐష్' బాలీవుడ్ హీరోతో పట్టుబడిందట

హనుమాన్‌గా రిషబ్ శెట్టి జై హనుమాన్ ఫస్ట్ లుక్ విడుదల

నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్

రవితేజ 75వ చిత్రానికి మాస్ జాతర టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

ప్రియా.... నను క్షమించవా ఈ జన్మకి ఈ ఎడబాటుకి

తర్వాతి కథనం
Show comments