తెలంగాణలో పెళ్లయిన నెల రోజులకే తన భర్తను భార్య హత్య చేసిందని పోలీసులు తెలిపారు. పోలీసులు, బాధిత కుటుంబం, వారి బంధువులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్యామల, చంద్రశేఖర్‌లకు పెళ్లయి నెల అవుతోంది. పేరుకు నెల గడిచింది కానీ వాళ్ల కొత్త సంసారంలో కొత్తదనం ఇంకాపోలేదు. వాళ్ల పెళ్లయినప్పటి నుంచీ వరుసగా ఏదో ఒక పండుగో, చుట్టాల ఇళ్లల్లో పెళ్లిళ్లో వస్తూనే ఉన్నాయి. దీంతో కొత్త జంటకు ఏకాంతమే దొరకలేదు. అత్తమామలు, బావ-యారాలు (తోడి కోడలు), అందరూ కలసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. కొత్త కోడలు అత్తమామలను కూడా బాగానే చూసుకుంటోంది.
పండుగలు, పెళ్లిళ్ల సందడి తగ్గిందనుకునేలోపు భర్తకు ఫుడ్ పాయిజనింగ్ అవడంతో నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. అతను డిశ్చార్జి అయ్యేసరికి మళ్లీ బంధువుల పెళ్లి. భార్య వెళ్ళక తప్పదు. ఇవన్నీ గడిచాక, ఒకరోజు సరాదాగా భర్తతో కలసి బయటకు వెళ్లాలనుకుంది కొత్త కోడలు. భార్యాభర్తలిద్దరూ బండెక్కి ఊరికి దూరంగా ఉండే గుడికి బయల్దేరారు.
సిద్దిపేట జిల్లా చిన్ననిజాంపేటలోని అత్తగారి ఇంటి నుంచి దూరంగా ఉన్న అనంతసాగర్ వైపు వెళ్లారు. అక్కడ శివార్లలో కాస్త దూరం వెళ్లేక మరో రోడ్డులోకి మళ్లారు. అలా కొంచెం దూరం వెళ్లే సరికి బండికి సడెన్‌గా బ్రేక్ వేశాడు చంద్రశేఖర్. బండికి అడ్డంగా కారులో వచ్చిన ఐదుగురు కుర్రాళ్లు నిల్చున్నారు.
వాళ్లు చంద్రశేఖర్‌ను చూస్తూనే.. వెంటనే బండి మీద నుంచి కిందకు లాగారు. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే అతని పీక మీద కాలు వేసి తొక్కారు ఒకరు. అతనెంత గింజుకున్నా ఆ కాలును తీయలేకపోయాడు. రెండు చేతులూ, రెండు కాళ్లనూ ఆ కుర్రాళ్లు కదలకుండా పట్టుకున్నారు. అతని పీక మీద కాలు ఇంకా అలానే ఉంది.
అతని మెడను తొక్కుతోన్న ఆ కాలు అతని భార్య శ్యామలది. కాలితో కంఠంపై తొక్కినా అతను బతికే ఉన్నాడు. వాళ్లకేం కావాలో తీసుకోమని, తనను వదిలేయమని ప్రాధేయపడ్డాడు. వాళ్లు కనికరించలేదు. చేతితో పీక పట్టుకుని నొక్కారు. ఎంతబలంగా నొక్కారంటే చంద్రశేఖర్ మెడ నిండా గోళ్ల గాట్లే. అయినా చావలేదు. దీంతో తన పైట (చున్నీ) తీసి భర్త పీక చుట్టూ బిగించి, అక్కడున్నవారి సహాయంతో బలంగా లాగి భర్తను చంపేసింది శ్యామల.
2022 మార్చి 25న వారి పెళ్లి అయింది.
2022 ఏప్రిల్ 28న భర్తను చంపింది భార్య.
భర్తకు గుండె నొప్పి అంటూ ఇంటికి ఫోన్..
శ్యామల తన స్నేహితులతో భర్తను చంపేశాక వాళ్లు వచ్చిన కారులో డెడ్ బాడీని కొంచెం దూరం తీసుకుని వెళ్లారు. సిద్దిపేటలో అద్దెకు తీసుకున్నకారు అది. రాజీవ్ రహదారి పక్కన చెట్ల కింద భర్తను పడేసి, అక్కడే ఉండి ఇంట్లో వారికి కాల్ చేసింది శ్యామల. భర్తకు అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చిందనీ, చిత్ర విచిత్రంగా చేస్తున్నాడనీ చెబుతూ భర్త అన్నకు కాల్ చేసింది. తన పుట్టింటి వారికీ చెప్పింది. భర్త తరపు వారు వచ్చేలోపు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని నిర్ధరించారు. పోస్టుమార్టం చేసి ఇంటికి తీసుకెళ్లడమే తరువాయి.
అప్పటికి భర్త తరపు వారు ఆ మృతదేహాన్ని సరిగా చూడలేదు. పోలీసులు తీసిన ఒక ఫోటో చూసిన చంద్రశేఖర్ బంధువులకు మెడపై గాట్లు చూసి అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు వాళ్లు. మరునాడు అంత్యక్రియలు యధావిధిగా జరిగాయి. అప్పటికే రెండు పక్షాల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. భర్త చనిపోయిన రోజు అత్తవారింటికి వచ్చిన శ్యామల, తరువాత అంత్యక్రియల రోజే పుట్టింటికి వెళ్లిపోయింది. సిద్దిపేట టూ టౌన్ పోలీసులు కేసు విచారణ ప్రారంభించారు. భార్యే హంతకురాలని తేల్చారు పోలీసులు.
భర్త ఇష్టం లేదు.. కానీ బయట పడలేదు..
శ్యామలకు పెళ్లికి ముందు ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా అన్న విషయంపై ఎవరికీ పెద్ద సమాచారం తెలియదు. పెళ్లి ఇష్టపూర్వకంగానే చేసుకున్నట్టు కనిపించింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి భారీగా పెళ్లిచేశారు. పైకి తనకు పెళ్లి ఇష్టమేనని చెప్పింది శ్యామల. వాస్తవానికి ఆమెకు ఇష్టం లేదని పోలీసు విచారణలో తేలింది.
తన సొంతూరికి చెందిన క్లాస్‌మేట్ శివ అనే వ్యక్తిని శ్యామల ఇష్టపడినట్టు పోలీసు విచారణలో తేలింది. వారి మధ్య పరిచయం పూర్వం నుంచీ ఉన్నప్పటికీ, ప్రేమ కొన్ని నెలల క్రితమే మొదలైనట్టు తెలిసింది. ఎవరికీ తెలియని ఫోన్ నంబర్ల ద్వారా వారు మాట్లాడుకునే వారు. పెళ్లి అయిన తరువాత ఎలా అయినా భర్తను వదిలించుకోవాలనుకున్న శ్యామల శివతో కలసి భర్త హత్యకు ప్రణాళిక వేసింది. ముందుగా ఎటైనా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని ఆ వ్యక్తి ప్రతిపాదించినా శ్యామల అంగీకరించలేదు. తనను మళ్లీ తీసుకువచ్చి భర్తకే అప్పజెబుతారని భయపడింది. దీంతో చంపేయాలనుకుంది.
శ్యామల పథకం ప్రకారం చంద్రశేఖర్‌ను హత్య చేయడానికి తన స్నేహితుల సహకారం అడిగాడు శివ. కజిన్స్, స్నేహితులు మొదట్లో వద్దన్నారు. కానీ, శివ వారిని ఒప్పించాడు. వారంతా రంగంలోకి దిగి, ముందుగా ఎంపిక చేసిన చోటుకు పిలిపించారు. శివ పెట్టిన లొకేషన్‌కు భర్తను తీసుకెళ్లింది శ్యామల. అక్కడ అందరూ కలసి హత్యచేశారు.
పెళ్లయినప్పటికీ వారి మధ్య శారీరక సంబంధం మొదలు కాలేదనీ, కొంతకాలం ఎదురు చూసి విసిగిపోయిన భర్త తనను ఇష్టం లేకుండా బలవంతంగా శారీరకంగా కలిసినందుకే అతడిని చంపేయాలనుకున్నట్టు శ్యామల పోలీసులతో చెప్పినట్టు తెలిసింది. హత్య విషయంలో ఎవరికీ అనుమానం రాకుండా గుండెల్లో నొప్పి వచ్చి చనిపోయాడు అని నమ్మించాలనుకుంంది. అంతేకాదు, ఒకవేళ పోలీసు కేసు అయితే మిగతా వారికి ఇబ్బంది లేకుండా తాను మొత్తం బాధ్యత తీసుకుంటానని కూడా శ్యామల తన స్నేహితుడి బృందానికి హామీ ఇచ్చినట్టు తెలిసింది.
గతంలో ఎలుకలమందుతో ప్రయోగం..
నిజానికి శ్యామల గతంలో కూడా చంద్రశేఖర్‌ను చంపడానికి ప్రయత్నం చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు చంద్రశేఖర్ సోదరుడు. గతంలో చంద్రశేఖర్‌కి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు భార్య ఎలుకల మందు పెట్టిందని వారి ఆరోపణ. ఆరోజు ఇంట్లో అందరూ తిన్న కోడిగుడ్ల కూర ఎవరికీ హాని చేయలేదు కానీ చంద్రశేఖర్ ఏకంగా నాలుగు రోజులు హైదరాబాద్ లోని పెద్ద ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. చంద్రశేఖర్ నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉండి డిశ్చార్జి అయిన మరునాడే మళ్లీ పెళ్లికి వెళ్లిపోయింది శ్యామల. గతంలో ఎప్పుడూ శ్యామల ప్రవర్తనపై అనుమానం రాలేదని వాపోతున్నారు చంద్రశేఖర్ తల్లితండ్రులు.
ప్రస్తుతం శ్యామల, ఆమె స్నేహితుడు, ఈ పనికి సాయం చేసిన అతని స్నేహితులూ.. అందరూ జైల్లో ఉన్నారు. శ్యామల ఏ1, శివ ఏ2 కాగా మిగతా వారిపై కూడా హత్య కేసులు నమోదయ్యాయి. త్వరలోనే పోలీసులు చార్జిషీటు వేయబోతున్నారు.