Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఎవరి అండా లేకుండా నింగికెగిసిన తార.. అర్థంతరంగా నేల రాలడానికి కారణాలు ఏమిటి? బాధ్యులు ఎవరు?

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (17:18 IST)
ప్రతి ఒక్కరికీ కలలుంటాయి. కొందరు వాటిని సాకారం చేసుకుంటే మరికొందరు కలల్లోనే జీవిస్తారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాత్రం కాస్త డిఫరెంట్. ఓ వైపు ఆకాశంలో తారలను లెక్కిస్తూ మరోవైపు బాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందాడు. బంధుప్రీతి రాజ్యం ఏలుతున్న బాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరొందడం కూడా బయటవాళ్లకు చాలా కష్టం. అలాంటిది స్టార్ కిడ్స్ సాధించలేని విజయాలను సొంతం చేసుకున్నాడు.

 
ఓ వైపు తనకు ఇష్టమైన ఆస్ట్రానమిని ఆస్వాదిస్తూ మరోవైపు ఎలాంటి మద్దతు లేకున్నా స్టార్ కిడ్స్‌ను వెనక్కి తోస్తూ అగ్రస్థానానికి ఎగబాకే ప్రయత్నం చేశారు. అయితే ఆకాశంలో విస్పోటనం జరిగి చుక్క రాలిపడినట్టు, బాలీవుడ్‌లో ఉన్న బంధు ప్రీతి వల్ల ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుని తారాజువ్వలా నింగికెగిసారు.

 
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న శని గ్రహం, దాని చుట్టూ ఆవరించి ఉన్న వలయాలను ఆసక్తిగా పరికిస్తూ ఉండేవారు. చంబల్ లోయలోని ధోలాపూర్ అనే కుగ్రామంలో భారీ టెలీ స్కోప్ సాయంతో చందమామను, నారింజ రంగులో ఆవరించి ఉన్న వలయాలను చూస్తూ ఎన్నో రాత్రులు గడిపారు. ఆ తారల మధ్యలో జూపిటర్ రావడాన్ని యాక్టర్ రణ్‌వీర్ షోరే గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ఆ వలయాలనూ అతను మర్చిపోలేదు. ఓ కుగ్రామం నుంచి అనంత విశ్వంలో సుశాంత్ గడిపిన ఎన్నో రాత్రులను రణ్‌వీర్ జ్ఞాపకం చేసుకున్నారు.

 
ధోలాపూర్‌లో సొంచారియా సినిమా షూటింగ్ జరుపుకుంటున్న టైమ్. ఆ షూటింగ్ విరామంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చిన్నపాటి గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. అందుకు కారణం మరికొన్ని గ్రహాలతో చంద్రుడి కలయికే. తనకేమాత్రం సంబంధంలేకపోయినా, అనంత విశ్వంలో జరిగే అద్భుతాలను ఆస్వాదించడం సుశాంత్‌కు ఇష్టం. అందుకే తన మిత్రులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అదీ సుశాంత్ అంటే. చాలా ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను రణ్‌వీర్ గుర్తు చేసుకున్నారు.

 
అప్పుడు కొన్ని గణిత సిద్ధాంతాలనూ రణ్‌వీర్‌కు పరిచయం చేశారు సుశాంత్. ఆయన మరణం తనకు ఎంతో విషాదాన్ని కలిగించిందన్నాడు. నిజమే బాలీవుడ్ ఓ క్రూరమైన ప్రదేశం. సుశాంత్‌ను తొక్కిపెట్టడం వాస్తవం, కానీ జీర్ణించుకోవాల్సిన నిజమేంటంటే అప్పటికే సుశాంత్ ఓ స్టార్.

 
బాలీవుడ్.. ఉన్నత స్థాయి రంగుల ప్రపంచం. విజయం వెనుక పరుగులు పెట్టించే లోకం. అంతేనా..? అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ప్రదేశం కూడా అంటాడు షోరే. మొత్తంగా చెప్పాలంటే బాలీవుడ్ ఓ మార్కెట్. ఆశ్రిత పక్షపాతంతో కళ్లు మూసుకుపోయిన, క్షమించేందుకు వీలులేని మీడియాతో కూడిన విచిత్రమైన మార్కెట్.

 
రంగుల ప్రపంచం వెనుక చీకటి ప్రపంచం...
''అతడికి అచంచలమైన శక్తి ఉంది. కాని సిగ్గరి, మితంగా మాట్లాడేవారు. ఎవరితోనూ కలిసేవారు కాదు. ఒంటరి. స్టార్ అవడానికి రెండు మార్గాలున్నాయి. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టడం ఒకటైతే, జాకీలు పెట్టి బలవంతంగా తయారు చేసేది రెండోది. ఎలాంటి ప్రతిభ లేకపోయినా బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతంతో స్టార్ కిడ్స్‌ను బలవతంగా నిలబెట్టేందుకు మీడియా ప్రయత్నిస్తూ ఉంటుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు బాలీవుడ్‌లో ఎలాంటి పరిచయాలు లేవు. అయినా అందరి గుర్తింపు పొందాడు. బాలీవుడ్ ఫ్యామిలీకి చెందని వారికి జీవితం అంత ఈజీ కాదు. తిరస్కరణలుంటాయి. అవమానాలు, అవహేళనలు, రాళ్ల దాడులు ఉంటాయి. బాలీవుడ్‌లో సర్వైవ్ కావడం అంత ఈజీ కాదు. బాలీవుడ్ అంటే రంగుల ప్రపంచం ఆవల ఉన్న మరో చీకటి ప్రపంచం'' అని షోరే బాలీవుడ్‌లో బంధుప్రీతి గురించి వివరించారు.

 
సుశాంత్ సింగ్ కొన్నిరోజులపాటు డిప్రెషన్ తగ్గేందుకు మందులు తీసుకున్నారు. అయితే జూన్ 14 ఆదివారం తన కలల ప్రపంచాన్ని, తనకెంతో ఇష్టమైన చుక్కలను, టెలీస్కోప్‌ను వదిలి.. తానెప్పుడూ కలలుగనే అనంత విశ్వంలో.. ఆకాశంలోని చుక్కల్లో కలిసి పోయాడు.

 
ఒక్కసారి సుశాంత్ గతాన్ని పరిశీలిస్తే, ఆయన పోతూ పోతూ ఎలాంటి సుసైడ్ నోట్ రాయనప్పటికీ, ఎన్నో పదాలను, చిత్రాలను, ముచ్చట్లను వదిలివెళ్లాడు. వాటిలో ఎక్కువ భాగం అంతరిక్షంలో తాను చూసిన అద్భుతాల గురించి. వాటిని కవితల రూపంలో దాచిపెట్టుకున్నాడు. అదీ తన స్వీయ సంగతులుగా. సుశాంత్‌కు సైన్స్ అంటే పిచ్చి. అంతేకాదు చక్కటి కవి కూడా. అతడి కవితల ద్వారానే అతడి ప్రతిభ వెలుగుచూసింది. అతడు చదివినదాని గురించి ప్రపంచానికి తెలిసింది. సుశాంత్‌కు విశ్వం అంటే మక్కువ, ఎప్పుడూ దాని గురిచే ఆలోచిస్తూ ఉండేవారు. శని గ్రహం చుట్టూ ఉన్న వలయాకారపు రింగులు, తోకచుక్క శకలాలు, గ్రహ శకలాలు, శని గ్రహం గురుత్వాకర్షణతో ముక్కలై వెలువడిన దుమ్మూ ధూళీ తెలుసు.

 
పులిట్జర్ అవార్డు గెలుచుకున్న ఫిలిప్ రోత్ పుస్తకాలను అవపోసన పట్టారు. రాల్ఫ్ వాల్డ్ ఎమర్సన్ బుక్స్‌ను చదివేశారు. ప్రేమ కవితల రచయిత ఈఈ కమింగ్స్‌ను కోట్ చేస్తూ ఉంటారు. ఓ రాత్రి ఆకస్మాత్తుగా అనంత విశ్వంలోకి తొంగి చూస్తూ ఉంటారు. అమితమైన ప్రేమతో తమలో తాము ఏకమయ్యే చుక్కల గురించి మాట్లాడుతుంటారు. అంతేనా అతనికి పీటర్ ప్రిన్సిపల్ సిద్ధాంతం గురించి కూడా తెలుసు. ఆకాశంలో అద్భుతాలను పరికించేందుకు, రెండు వందల కిలోల బరువున్న భారీ టెలిస్కోప్ సుశాంత్ ఇష్టపడి కొనుగోలు చేశారు.

 
ఆకాశాన్ని మ్యాప్ చేయడం తెలుసు. బ్లాక్ హోల్ గురించి కూడా తెలుసు. చంద్రుడిపై ఉన్న క్రేటర్స్ గురించి కూడా వివరించగలరు. చంద్రుడిపై వెనుక ఉన్న చీకటి కూడా తెలుసు. చుక్కలను చూసిన ప్రతిసారీ అతడు తన గత జీవితంలోకి వెళ్లిపోతుంటారు. ప్రఖ్యాత ఫిలాసపర్ నీషేను కూడా చదివారు. ఎక్కువ సమయం అగాధంలో ఉంటే, అగాధం కూడా మీ వైపు తిరిగి చూస్తుందన్న విషయం కూడా అతడికి తెలుసు. తన స్టార్ షిప్‌లో తాను ఒంటరి ప్రయాణికుడినని సుశాంత్ భావించారు.

 
బాలీవుడ్‌లో అతడు అవుట్ సైడర్...
సుశాంత్, స్పుత్నిక్ ఉపగ్రహం వంటివారు. ప్రయోగించిన మూడు నెలల తర్వాత ప్రతి 96 నిమిషాలకోసారి కక్ష్యలో పరిభ్రమిస్తూ స్పుత్నిక్ విచ్ఛిన్నమైంది. సుశాంత్ హాప్ మిస్సింగ్ పర్సన్. క్రాస్ ఓవర్ కథలలాంటి వారు. మనం కోల్పోయిన ఓ వ్యక్తి కథ. ఈ ఘటన తర్వాత ఆత్మహత్య ఎలా జరింగింది, చేసుకోవడానికి కారణాలేంటో వివరిస్తూ అనేకమంది ఎన్నో రాసుకొచ్చారు. కుట్ర సిద్ధాంతాలు, పోలీస్ విచారణ, డాక్టర్ల వివరణ గురించి పేర్కొన్నారు.

 
వివిధ లాబీలు రంగంలోకి దిగాయి. అయితే బాలీవుడ్‌లో రాజ్యం ఏలుతున్న బంధుప్రీతి మరోసారి తెరపైకి వచ్చింది. సుశాంత్ ఆత్మహత్యకు బంధుప్రీతే కారణమని ఆరోపిస్తూ బీహార్‌లోని ముజఫరాబాద్‌లో బాలీవుడ్ యాక్టర్లు, డైరెక్టర్ల మీద కేసులు కూడా నమోదయ్యాయి. అతడిపై ఒత్తిడి తెచ్చి ప్రాణం తీసుకునేలా చేశారని, ప్రేమలోకి దింపి మోసం చేశారని ఎన్నో కథనాలు. ప్రఖ్యాత పెయింటర్ వాన్‌గో పెయింటింగ్‌ను ట్విట్టర్ ప్రొఫైల్ ఖాతాలో పెట్టుకోవడం కూడా ఘటనకు కారణమని కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. అన్నింట్లో విశేషమేంటంటే ఓ మనో వ్యథ కథ కంచికి చేరింది. ఈ విషాద ఆత్మహత్య ఎపిసోడ్‌లో అదే ముఖ్యమైన అంశం కూడా అయి ఉండొచ్చు.

 
బాలీవుడ్‌లో అతడు కచ్చితంగా అవుట్ సైడరే. గతంలో ఎవరూ కూడా అతడి ఫ్యామిలీ నుంచి బాలీవుడ్‌లో నటించిన వారు లేరు. ఈ విషయం ప్రేక్షకులకు కూడా తెలుసు. అయినా కూడా అతడిని ఆదరించారు. కై పొ చే సినిమా బాలీవుడ్‌లో సుశాంత్ తొలి మూవీ. క్రికెట్ అంటే పడి చచ్చే యువకుడి పాత్రలో అతడు నటించారు. అంతేకాకుండా కోచ్‌గా ఓ ముస్లిం యువకుడికి ట్రైనింగ్ కూడా ఇస్తాడు. ఆ క్యారెక్టర్‌ను ఎవరూ మర్చిపోలేరు. బస్ టాప్ ఎక్కేందుకు కిటికీ నుంచి బయటకు వెళ్లే విధానం ఓ చిన్నపట్టణంనుంచి వచ్చిన యువకుడు ఆశలు, ఆకాంక్షల మధ్య ఎలా నలిగిపోతుంటాడో ఆ సినిమాలో చూపిస్తాడు. తల్లిదండ్రుల కఠినమైన ప్రేమ, తన జీవిత లక్ష్యం మధ్యలో స్వేచ్ఛను ఎలా కోల్పోయాడో సినిమా ద్వారా చూపెట్టాడు.

 
బిహార్ లాంటి రాష్ట్రాల్లో యువకుల ఆలోచనల్లో గొప్ప గొప్ప కలలు విహరిస్తూ ఉంటాయి. ఇంజినీర్, డాక్టర్, సివిల్ సర్వీసెస్, పెళ్లి, సెటిల్‌మెంట్ వంటి అంశాలు కదలాడుతూ ఉంటాయి. కోచింగ్ సెంటర్ల ప్రకటనలు గోడలకు వేలాడుతుంటాయి. దేశవ్యాప్త ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌లో సుశాంత్ ఏడో ర్యాంక్ సాధించి మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో చేరాడు. యాక్టింగ్‌పై ఆసక్తితో ముంబై వెళ్లేవరకు ఇంజినీరింగ్‌లో టాప్‌లో నిలిచాడు.

 
చిన్నప్పటి నుంచి ఒంటరి కుర్రాడే...
బిహార్ లోని మాల్దిహా జిల్లాలోని పుర్నియాలో 1986లో జన్మించారు సుశాంత్. అయిదుగురు పిల్లల్లో ఇతడే చిన్నవాడు. ఒక్కడే కొడుకు కావడంతో తల్లి కూడా ఎంతో గారాబం చేసింది. 2002లో తల్లి చనిపోయినప్పుడు సుశాంత్ చిన్నకుర్రాడు. ఎంతో ప్రేమగా చూసే తల్లి మరణం సుశాంత్‌ను ఎంతో కలిచివేసింది. చిన్నప్పటి నుంచి సుశాంత్ ఒంటరి కుర్రాడే. తల్లితో మాత్రమే ఎంతో సన్నిహితంగా ఉండేవాడని, ఆమె మరణంతో ఎంతో కోల్పోయాడని, సుశాంత్ మిత్రురాలు రంజితా ఓజా చెప్పారు.

 
ఆ తర్వాత చదువు కోసం సుశాంత్ దిల్లీలోని ముఖర్జీ నగర్ షిఫ్ట్ అయ్యి హన్స్‌రాజ్ కాలేజీలో చేరాడు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ, దిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న తన సోదరితో కలిసి జీవించాడు. సుశాంత్ ముఖం ఎప్పుడూ నవ్వుతో వెలిగిపోతూ ఉండేదని ఓజా గుర్తు చేసుకున్నారు. పార్కుల్లో ఒంటరిగా నడిచేవారు. అంతేకాదు ఎప్పుడూ స్టడీ టేబుల్ దగ్గరే కనిపిస్తుండేవారు. ఆ స్టడీ టేబుల్ కూడా చాలా విచిత్రంగా, ఆకట్టుకునేలా ఉండేది. పురాతన కారు నమూనాలు, చిన్నయంత్రాలు స్టడీ టేబుల్‌కు అసెంబుల్ చేసి ఉండేవి. ప్రఖ్యాత ఫిలాసఫర్లు రెనె డెస్కర్టేస్, సార్త్రేల గురించి ఎప్పుడూ చర్చిస్తూ ఉండేవారు. వెళ్లాల్సిన మార్గం అతడికి స్పష్టంగా తెలుసని ఓజా గుర్తు చేసుకున్నారు.

 
నెపొటిజమ్ లేదా బంధుప్రీతి కొత్త కాదు. అన్ని రంగాల్లోనూ కనిపిస్తుంది. అప్పటికే బాలీవుడ్‌ను ఏలుతున్న కుటుంబాల కోసం కీర్తి నిరీక్షిస్తూ ఉంటుంది. రిషి కపూర్ కుమారుడు రణ్‌బీర్ కపూర్, బాలీవుడ్‌లో నాలుగో తరం నటుడు. తన కుటుంబ ఖ్యాతీ కారణంగా తనకు సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు వచ్చిన విషయం వాస్తవమేనని రణ్‌బీర్ కపూర్ అంగీకరిస్తారు.

 
ప్రపంచ ప్రఖ్యాత షైమాక్ దావర్ డ్యాన్స్ ట్రూప్‌లో రాజ్‌పుత్ కూడా ఓ సభ్యుడు. ప్రఖ్యాత నదీరా బబ్బర్‌కు చెందిన ఏక్ జూటే థియేటర్ గ్రూప్‌లో బారీ జాన్‌తో కలిసి నటించిన వారిలో ఒకడు. ఓసారి కాలేజీలో ఉండగా, తన పెద్ద సోదరి సాయంతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాడు. అయితే డ్యాన్స్ కోసం సుశాంత్ ముంబయి వెళ్లిన విషయాన్ని తండ్రికి చెప్పలేదామె. ఇంటర్న్ షిప్ కోసం వెళ్లినట్టు చెబుతుంది. అయితే ఆ విషయాన్ని కూతురు చెప్పకపోయినా తండ్రి గ్రహించాడు. కిస్ దేశ్ మే హై మేరా దిల్‌తో టెలివిజన్ రంగంలో కెరీర్‌ను ప్రారంభించాడు సుశాంత్. ఏక్తా కపూర్ పవిత్ర రిస్తా సీరియల్‌లో లీడ్ రోల్ సుశాంత్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. అప్పటికే రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్, రణ్‌బీర్ కపూర్ వంటి వారసులతో నిండిన బాలీవుడ్‌పై 2011లో కన్నేశారు సుశాంత్.

 
బయటి వారికి తొలి అవకాశమే డూ ఆర్ డై...
తొలి సినిమా ఫ్లాప్ అయినా వారసులకు రెండు, మూడు అవకాశాలు వస్తాయి లభిస్తాయి. స్టార్ కిడ్ బ్రాండ్‌తో చాలా అవకాశాలు దక్కుతాయి. అయితే ఫీల్డ్‌తో ఎలాంటి సంబంధం లేని కుంటుంబం నుంచి వచ్చిన కుర్రాళ్లకు మాత్రం తొలి అవకాశమే డూ ఆర్ డై. అయితే సుశాంత్ తొలి సినిమానే సూపర్ సక్సెస్. ఆ తర్వాత మనీశ్ శర్మ ''శుద్ధ్ దేశీ రొమాన్స్(2013)'', రాజ్ కుమార్ హిరాణీ పీకే (2014) వంటి హిట్ సినిమాల్లో నటించాడు. పీకేలో సర్ఫరాజ్ పాత్ర ఎంతో హైలైట్. హీరో అమీర్ ఖాన్ అయినప్పటికీ, ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే పాత్ర ఇది. ఈ సినిమాల్లో నటనతో డిటెక్టివ్ బ్యొమేశ్ బక్షీ సినిమాకు సెలెక్టయ్యాడు.

 
డిటెక్టివ్ సినిమా టైమ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను కలిసిన వికాస్ చంద్ర అభిప్రాయం ప్రకారం, యువ హీరో ఆత్మహత్యకు బంధుప్రీతి మాత్రమే కారణం కాదు. బాలీవుడ్‌లో ఓ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. కొందరిని ఒంటరిని చేస్తుంది. ఒంటరి తనం ఎంతకు దారితీస్తుందో చాలామందికి తెలియదు. ముఖ్యంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిని మరింత కుంగదీస్తుంది. బంధుప్రీతి బాలీవుడ్‌లో రాజ్యం ఏలుతున్నప్పటికీ సుశాంత్ స్టార్‌గా ఎదిగారు. ఈ విషయం కూడా అతడికి తెలుసు. అయితే ఇక్కడో విషయాన్ని పరిశీలిస్తే, అందరిలోకి అతడో భిన్నమైన వ్యక్తి. ఏదైనా విషయం అవుటాఫ్ ఆర్డర్‌లో ఉంటే అది అనేక ఊహాగానాలకు దారి తీస్తుంది.

 
అంతేకాదు బంధుప్రీతి గురించి కథనాలు ఇండియన్ సొసైటీలో భాగమైపోయిందని ముంబైయేతర ప్రాంతం నుంచి వచ్చి ఫిల్మ్ డైరెక్టర్‌గా మారిన చంద్ర చెప్తారు. ''దేశంలో ఎవరిపైనా నమ్మకం అంతగా లేదు. అందుకే మనకు నచ్చిన మార్గంలో మనకు అందుబాటులో ఉన్న విధానంలోనే అభివృద్ధి చెందుతాం. రెఫరల్స్ కోసం ఎందుకు చూస్తాం. మనమంతా ద్వంద్వ జీవన విధానానికి అలవాటు పడ్డాం. బాలీవుడ్ దీనిపైనే జీవిస్తోంది. కొందరికి ఫ్యామిలీ బిజినెస్‌లున్నాయి. కానీ నిజమేంటంటే ఇది కాంపిటేటివ్ ఇండస్ట్రీ. పెర్ఫార్మన్స్ రివ్యూలను ప్రేక్షకులు ఇస్తారు. స్టార్ కిడ్స్ కొన్నిసార్లు మాత్రమే అవకాశాలను పొందగలుగుతారు. సహజమైన మనుగడ, సహజ క్రమంపైనే బాలీవుడ్ పనిచేస్తుంది'' అని చంద్ర వివరించారు.

 
బాలీవుడ్ ప్రభావం చాలా ఉన్నతమైనది. దేశవ్యాప్త ఖ్యాతి సాధించాలంటే బాలీవుడ్‌ను జయించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఆకర్షించే విభిన్నమైన ప్రపంచంలో మనమున్నాం. ఆ ఊబినుంచి బయటపడకుండా చేస్తుందీ బాలీవుడ్'' అని చంద్ర పేర్కొన్నారు. వాస్తవానికి డిటెక్టివ్ మూవీకి సుశాంత్ పేరును సూచించింది ఆదిత్య చోప్రానే. ఇందులో ప్రఖ్యాత డిటెక్టివ్ రోల్‌ను పోషించాడు. ''అతడు చాలా సిన్సియర్, అతడికి ఎలాంటి స్టార్ హోదాలేదు. వర్థమాన నటుడు. ఈ విషయం అతడికి కూడా తెలుసు'' అని చంద్ర చెప్పాడు.

 
''తాను బయటివాడినని ఫీలయ్యేవారు. నెట్ వర్కింగ్, పీఆర్ వంటివి సుశాంత్‌కు నచ్చేవి కావు. పార్టీలకు వెళ్లడం కూడా అతడికి ఇష్టం ఉండేది కాదు. ఇలాంటి విషయాలన్నింటిని సుశాంత్ పట్టించుకునే వారు కాదు. అయితే బాలీవుడ్‌లో ఇలాంటివే అవసరం. వాటిలో పాల్గొనకపోతే, రావాల్సినంత పేరు రాదు. అయితే సుశాంత్ స్టార్‌గా ఎదగకుండా ఇవేమీ ఆపలేకపోయాయి. నెక్ట్స్ జనరేషన్ కథానాయకుల్లో సుశాంత్‌ది ప్రత్యేకమైన బ్రాండ్. ఇప్పటికే పేరు సంపాదించుకున్నాడు'' అని చంద్ర వివరించారు.

 
అగ్రస్థానం ఎప్పుడూ ఒంటరితనమే...
పద్మావత్ సినిమా పేరు వివాదాస్పదంగా మారడంతో, కర్ణి సేన, ఇతర హిందుత్వ సంస్థలు సినిమాను బాయ్ కాట్ చేయాలనుకున్న సమయంలో తన ఇంటిపేరును మార్చుకోవాలనుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఇప్పుడు సుశాంత్ ఆత్మహత్యపై న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్న చాలామంది గతంలో సుశాంత్‌ను ట్రోల్ చేసిన వారే కావడం విశేషం. బంధుప్రీతి గురించి మాట్లాడి ఉపయోగం లేదన్నది చంద్ర అభిప్రాయం. బంధుప్రీతిపై చర్చించడం టైమ్ వేస్ట్ చేయడమే.

 
''బంధుప్రీతిపై వాదనలను సుశాంత్ కూడా తిరస్కరిస్తుండేవారు. ఎందుకంటే సుశాంత్ స్టార్‌గా ఎదిగేందుకు కరణ్ జోహార్ అవసరం లేదు. అయితే అగ్రస్థానం ఎప్పుడూ ఒంటరితనమే. ఇది ప్రతి ఒక్కరిని విచిత్ర లోకంలో విహరించేలా చేస్తుంది. సక్సెస్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో మనకు ఎవరూ నేర్పించలేదు'' అని చంద్ర చెప్పారు.

 
బాలీవుడ్‌లో రాణించాలంటే అవుట్ సైడర్స్ రెట్టింపు కష్టపడాల్సి ఉంటుందని దిబాకర్ బెనర్జీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. బాలీవుడ్‌లో రాణించాలంటే స్టార్ కిడ్స్ కూడా పోరాటం చేయకతప్పదన్న అనన్య పాండే అభిప్రాయంపై ''గల్లీ బాయ్స్'' ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది స్పందించారు. ''బయటి వ్యక్తుల కలలు ఎప్పుడు సాకరమవుతాయో, అక్కడే స్టార్ కిడ్స్ పోరాటం మొదలవుతుంది'' అని అన్నారు.

 
సుశాంత్ గురించి తెలిసిన అందరూ చెబుతారు అతడో భిన్నమైన వ్యక్తి అని. బాలీవుడ్లో బంధుప్రీతి ఉన్న విషయం బయటి ప్రపంచానికంతా తెలిసిన విషయమే. దాంతోనే వారు జీవించారు. పోరాటం చేశారు. దాంతోనే రాజీ పడ్డారు కూడా. తమ దురదృష్టానికి ఇతరులను నిందించడం అందరికీ అలవాటైందని పదేళ్ల క్రితం బెంగళూరు నుంచి ముంబయి వచ్చిన గుల్షన్ దేవయ్య అన్నారు.

 
'ఎక్కడా యోగ్యతల గురించి చర్చించరు...'
కొన్ని విషయాల్లో సుశాంత్, దేవయ్యలకు పోలికలున్నాయి. ఇద్దరూ సిగ్గరులే. అంతేకాదు తమలో తాము అంతర్మథనం చెందుతూ మౌనంగా ఉంటారు. చిన్నప్పుడు స్కూల్‌లో తన అందం గురించి అందరూ మాట్లాడుకునేవారని దేవయ్య గుర్తు చేసుకున్నారు. మరొకరి పాత్రలో తాను నటించడాన్ని తాను ఎంతో ఆస్వాదించానని, అందుకే స్టేజ్ పై స్వేచ్ఛగా నటించగలుగుతానని చెప్పాడు. బాలీవుడ్‌పై ప్రేమ దేవయ్యకు వారసత్వంగా వచ్చింది. దేవయ్య తండ్రికి కూడా బాలీవుడ్ మ్యూజిక్ అంటే ప్రాణం. వందలాది టేప్స్ దాచిపెట్టుకున్నాడు.

 
''హిందీ ఫిల్మ్ స్టార్ కావాలన్నది నా చినన్నాటి కల'' అని దేవయ్య చెప్పాడు. అయితే 1997లో నిఫ్ట్‌లో చేరి, బెంగళూరులో డిజైనర్‌గా మారిపోయాడు. 1998లో రామ్ గోపాల్ వర్మ సత్య సినిమా అతడి జీవితాన్ని మార్చివేసింది. సినిమా చూసిన వెంటనే బ్యాగు సర్దుకుని ముంబయి వచ్చేసారు. అప్పటి నుంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బాలీవుడ్ అంటే రంగుల కల, అందమైన ఆశల కలయిక అంటాడు దేవయ్య.

 
''మేమంతా ఇప్పుడు బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నామంటే అందుకు కారణం రామ్ గోపాల్ వర్మ, మనోజ్ బాజ్ పేయ్‌లే ఆదర్శం. నేను అందంగా ఉంటానని నాకు తెలుసు. కానీ డాషింగ్ మూవీ స్టార్ అయ్యేంత సరకు ఉందని నేనెప్పుడూ అనుకోలేదు'' అని దేవయ్య చెప్పుకొచ్చాడు. సుశాంత్ లాగే మొదట్లో రంగస్థల కథానాయకుడిగా నటించాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎన్నో అడిషన్స్‌కు వెళ్లి, కల్కి కొచ్లిన్‌తో కలిసి ''దట్ గర్ల్ ఇన్ యెల్లో బూట్స్'' మూవీలో నటించాడు.

 
చాలా అడిషన్స్‌కు వెళ్లినప్పటికీ తిరస్కరణలే ఎక్కువగా ఉండేవని, వాటినెప్పుడూ పర్సనల్‌గా తీసుకోలేదని అన్నారు. ఏడాదిలో 200 నుంచి 300 అడిషన్స్‌కు వెళ్లేవాడినని బాలీవుడ్‌లో తన ప్రస్థానం గురించి వివరించాడు. ''ఖ్యాతిని అనుభవించినప్పుడు అవమానాలను కూడా స్వీకరించాల్సిందే. పెర్ఫార్మెన్స్‌ను ఎప్పుడూ కొలవలేం. కేవలం అంచనా వేయగలం. నేనెప్పుడూ లోపలి వాడినని కానీ, బయటివాడినని కానీ భావించలేదు'' అని దేవయ్య వివరించాడు. ఈ ఇద్దరు యువ హీరోలు రెండు సార్లు కలుసుకుని, తమ కెరీర్‌ల గురించి చర్చించుకున్నారు.

 
''బాలీవుడ్‌లో బంధుప్రీతి, పవర్ పాలిటిక్స్, కోపం, హక్కుదారులు, స్టార్ కిడ్స్ గురించి ప్రచారాలు చాలా ఎక్కువే. ఎక్కడా యోగ్యతల గురించి చర్చించరు'' అని దేవయ్య చెప్పాడు. దమ్ మారో దమ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఘటనను ఆయన గుర్తు చేసుకున్నాడు. గోవాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు కొందరు అభిమానులు తనను రాజ్ బబ్బర్ వారసుడివా? అంటూ ప్రశ్నించడాన్ని ఆయన గుర్తు చేసుకున్నాడు. అలాగే రాజస్థాన్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో అమీర్ ఖాన్ కూతురు డైరెక్టర్‌కు సాయం చేస్తున్న సమయంలో చాలామంది అభిమానులు ఆమెను ఆసక్తిగా గమనించడాన్ని ఆయన గుర్తు చేశాడు. ఆమె ఎలా ఉందో ఎవరూ పట్టించుకోవడం లేదు, కానీ అమీర్ ఖాన్ కూతురు అన్న కుతూహలంతో వారంతా ఆ షూటింగ్‌ను ఆసక్తిగా గమనించారు. అదొక గొప్ప గుర్తింపు'' అని దేవయ్య చెప్పాడు.

 
'యాక్టర్ల ఫేట్‌ను నిర్ణయించేది మార్కెట్ మాత్రమే...'
ఏదేమైనా మార్కెట్ మాత్రమే యాక్టర్ల ఫేట్‌ను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు బాలీవుడ్ ఫ్యామిలీతో ఏమాత్రం సంబంధంలేని షారూఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్షాగా మారిపోయాడు. మరోవైపు స్టార్ కిడ్స్ తమ ఫ్యామిలీ పేరు చెప్పుకుని ఒకటి రెండు అవకాశాలు సంపాదించినా ఆ తర్వాత రాణించలేకపోయారు. అయితే వారెప్పుడూ బంధుప్రీతిని విమర్శించలేదు. మనమంతా నిందించడాన్ని ఆపేయాలి. సరైన మార్గంలో పయనించాలి'' అని దేవయ్య చెప్పుకొచ్చారు.

 
సుశాంత్ తొలి సినిమా కై పొ చే సినిమాకు దేవయ్య కూడా అడిషన్స్‌కు హాజరయ్యాడు. కానీ అవకాశం దక్కలేదు. ''సుశాంత్‌కు ఆ అవకాశం దక్కింది. మంచి నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. నాకు అవకాశం దక్కలేదు. బాలీవుడ్‌లో అందరూ యష్ రాజ్ ఫిల్మ్‌తో సంబంధాలు పెట్టుకోవాలనుకుంటారు. నాకు సినిమా ఆఫర్ రాలేదు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌తో కాంటాక్ట్ దొరకలేదు'' అని చెప్పారు.

 
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం బయటి నటులను పట్టించుకోకపోవడమే కాదు, వారు ఎగతాళికి గురవుతారు, అలాగే తీవ్రమైన బాధలను ఎదుర్కొటారు. అయితే ఇందులో నిజముంది. అబద్ధం కూడా ఉంది. నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్టయితే కెరీర్ దూసుకెళ్లేందుకు ఎవరికీ కూడా కరణ్ జోహార్ సాయం అవసరముండదు. బంధుప్రీతి లేకున్నా సుశాంత్ ఇది సాధించారు. టెలివిజన్ యాక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి బాలీవుడ్‌లో విజయవంతం కావడం చాలా అరుదు. కానీ సుశాంత్‌కు ఆ ఘనత దక్కింది. తనకు దక్కిన అన్ని అవకాశాలను సుశాంత్ అద్భుతంగా అందుకున్నారు'' అని దేవయ్య అన్నారు.

 
బంధుప్రీతి మధ్యలో ఎలా జీవించాలో ఇప్పుడు నేర్చుకుంటున్నారు, ఎంతో మంది స్టార్ కిడ్స్ లైమ్ లైట్‌లో ఉన్నప్పటికీ, అగ్రస్థానం చేరేందుకు అవుట్ సైడర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి రక్తసంబంధంలేకున్నా, పవర్ సెంటర్ అండలేకున్నా, ఎలాంటి సపోర్ట్ లేకున్నా వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

 
అయితే సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ కుటుంబాలపై విమర్శలు పెరుగుతున్నాయి. ఒక పద్ధతి ప్రకారం అవుట్ సైడర్లను తొక్కేసే ప్రక్రియ జరుగుతోందని దర్శకుడు అభిషేక్ కపూర్ విమర్శించారు. ఇలాంటి పరిస్థితులే ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని వివరించారు. కొత్త నటులను తొక్కేయడానికి బంధుప్రీతి ఒక్కటే కారణమని కూడా అనలేమన్నారు. వాస్తవానికి శేఖర్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన ''పానీ'' చిత్రంలో సుశాంత్ నటించాల్సింది. అదొక్కటే కాదు 12 చిత్రాలను అతడు వదులుకోవాల్సి వచ్చింది. అయితే 2019లో సొంచిరియాతో మంచి కమర్షియల్ హిట్ కొట్టారు.

 
అవుట్‌సైడర్ అవడం వల్లే బాధితుడయ్యాడన్న నిందలు కేవలం ఊరట కలిగించే మాటలు మాత్రమే. అన్ని ప్రతికూలాంశాలను తట్టుకుని సుశాంత్ సక్సెస్ కాగలిగారు. తనకెంతో ఇష్టమైన నటుడు నవాజుద్దీన్ సిద్ధఖీ మాదిరిగా కాకుండా సుశాంత్ మూస పాత్రలను దక్కించుకోలేదు. నవాజుద్దీన్ సిద్ధిఖి తొలి చిత్రం 1999లో వచ్చిన సర్ఫరోష్. అమీర్ ఖాన్ హీరోగా తెరపైకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్. ఆ చిత్రంలో నటించిన అందరికీ మంచి అవకాశాలు దక్కాయి.

 
నవాజుద్దీన్ ఆ తర్వాత నుంచి ఫిల్మ్ స్టూడియోల చుట్టూ, షూటింగ్స్ చుట్టూ తిరిగారు. అయితే చూసేందుకు నల్లగా, పల్చటి దవడలతో బక్క పలచగా ఉండటంతో అతడు పేదవాడి పాత్రకు సరిగ్గా సరిపోతాడు. దీంతో వరుసగా అలాంటి పాత్రలే వచ్చేవి. చాకలివారు, వాచ్ మన్ వంటి పేద పాత్రలకే నవాజుద్దీన్‌ను పరిమితం చేసేవారు. ''మూసపాత్రలు నాకు కోపం తెప్పించింది. ప్రతి అంశం నన్ను బాధించింది, ఎవరూ కూడా నన్నుసీరియస్‌గా తీసుకునే వారు కాదు. సినిమాల్లో లీడ్ రోల్ పోషించాలన్నది నా కల. కానీ నా ఫ్రెండ్స్ కూడా అనేవారు నాది హీరో మెటిరియల్ కాదని'' అని నవాజుద్దీన్ వివరించారు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా ఎదగాలనుకున్నానని సిద్ధిఖీ అన్నారు. బాలీవుడ్‌లో పోరాటాలు సహజమే. అయితే అవి కొందరికీ అనుకులంగా మారుతుంటాయి.

 
‘అనంతమైన కలలు.. అశాశ్వత జీవితం మధ్య...’
జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్బీ) ప్రకారం ఒక్క 2018లోనే 1,34,516 మంది దేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఏడాదిలో 3.6 శాతం పెరుగుదల. ఆత్మహత్యలు వైద్య పరంగా గ్రే ఏరియా. జీవితం చాలించాలనుకున్న వ్యక్తి మెదడులో ఎలాంటి ఆలోచనలు కదులుతున్నాయో అర్థం చేసుకుంటే, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం అవుతుంది. బైపొలారిటీ, డిప్రెషన్ ఈ రెండే ఆత్మహత్యలకు ఎక్కువ కారణం. డిప్రెషన్‌తో పోరాడుతున్న వ్యక్తి బాధతో ఉంటూ, ఎలాంటి రెమిడీ లేకపోవడంతోపాటు బాధ నుంచి మరో తీవ్రమైన మనోవ్యథకు పయనించడం ఆత్మహత్యలకు దారితీస్తుంది. డిప్రెషన్‌తో బాధపడుతున్నవారిని మిలిటరీ పరిభాషలో ''వాకింగ్ వూండెడ్'' అంటారు.

 
గొప్ప భవితవ్యం కలిగి ఉండి, విదేశీయుతో కలిసి పని చేసిన రాజ్‌పుత్ సూసైడ్ స్టోరీ అసంపూర్తిగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు అతడి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌ల రూపంలో జవాబులు దొరుకుతున్నాయి. ఇన్‌స్టాలో అతడు రాసుకున్న పొయెట్రీ అతనేంటో చెబుతోంది.

 
జూన్ 3న ఇన్‌స్టాలో తన తల్లి ఫోటోను పోస్ట్ చేయడంతోపాటు తన మనోవేదనను కూడా ప్రపంచానికి కవిత రూపంలో చెప్పాడు. ''మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు, చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్య బతుకుతున్నా'' అంటూ తన అమ్మను గుర్తుచేసుకుంటూ సుశాంత్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కవిత అందరినీ కదిలించింది.

 
ఆకాశంలో నక్షత్రాలను, బాలీవుడ్‌లో తారలను దగ్గరగా చూసిన ఓ హీరో అంతులేని కథ ఇంకా ముగింపుకు రాలేదు. ఈ కథలో ఇంకా ఎన్నో మలుపులను మనం చూస్తాం. కొన్ని సంవత్సరాల్లో ప్రపంచం పెద్దగా మార్పేమీ చెందదు. అలాగే స్వాప్నికులు కూడా పూర్తిగా తెరమరుగైపోరు.

 
- చింకి సిన్హా
బీబీసీ ప్రతినిధి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాతస్య మరణం ధ్రువం తో సీరత్ కపూర్ సక్సెస్ తెచ్చిపెడుతుందా

Pushpa 2: రూ.1799 కోట్లకు వసూలు చేసిన పుష్ప-2.. సరికొత్త రికార్డులు

రాజమండ్రి వేదికగా సినీరంగంపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన !

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments