Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టింగర్‌ మిసైల్‌: ఈ అమెరికా ఆయుధం అఫ్గానిస్తాన్‌లో రష్యాను ఎలా దెబ్బకొట్టింది

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (12:07 IST)
మూడు ఎటాకింగ్‌ టీమ్‌లను గఫ్ఫార్‌ సమాన దూరంలో నిలబెట్టారు. ట్రైనింగ్‌ సమయంలో ఆయన నేర్చుకున్న వ్యూహం ఇది. దాన్ని అమలులో పెట్టడానికి ఆయన చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కాసేపటి తర్వాత రష్యాకు చెందిన ఎమ్‌ఐ-24 హెలికాప్టర్లు అటుగా వస్తున్నట్లు కనిపించడంతో వారు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చినట్లు భావించారు.

 
గఫ్ఫార్‌ టీమ్‌లోని ఒక సభ్యుడు హెలికాప్టర్‌కు గురి పెట్టి ట్రిగ్గర్‌ను నొక్కారు. కానీ అది హెలికాప్టర్‌కు తగలకుండా భూమికి 300 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి తిరిగొచ్చింది. ముజాహిదీన్లకు శిక్షణ ఇచ్చిన పాకిస్తాన్‌ కల్నల్‌ మహమూద్‌ అహ్మద్‌ ఘాజీ ప్రకారం ఈ ఆపరేషన్ విఫలమైంది. అయితే ఈ క్షిపణి చేసిన సౌండ్‌ తాలూకు ప్రతిధ్వని అఫ్గానిస్తాన్‌ సైనిక స్థావరాలలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వినిపించింది.

 
ఎందుకు ఈ ఆయుధం?
యుద్ధంతో దెబ్బతిని ఉన్న అఫ్గానిస్తాన్‌లో సోవియట్‌ వైమానిక దళాన్ని టార్గెట్‌ చేసుకుని స్టింగర్‌ మిసైల్‌ను ప్రయోగించడం అదే మొదటిసారి. ఈ ఘటన తర్వాత జలాలాబాద్, కాబూల్‌ ప్రాంతాల్లో రష్యా, అఫ్గానిస్తాన్‌లు తమ ఎయిర్‌ ట్రాఫిక్‌ను నిలిపేశాయి. అమెరికా తయారీ స్టింగర్‌ మిసైళ్లను ప్రయోగించడానికి పాకిస్తాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ) ముందుగా ఇద్దరు మిలిటరీ కమాండర్లకు ట్రైనింగ్‌ ఇచ్చింది. కమాండర్ గఫ్ఫార్‌, దర్వేశ్‌లు ఇద్దరూ గుల్బుద్దీన్‌ హెక్మాత్యార్‌కు ఆధ్వర్యంలోని హిజ్బ్‌-ఎ-ఇస్లామి గ్రూపులో పని చేస్తున్నారు.

 
వీరిద్దరూ రష్యన్ భాషతో పాటు ఉర్దూ, పాష్టో భాషలలో నిష్ణాతులు. దేశ రాజధాని ఇస్లామాబాద్‌కు జంట నగరమైన రావల్పిండిని కలిపే ప్రాంతం ఫైజాబాద్‌లో ఉన్న ఓజ్డీ క్యాంప్‌ దగ్గరున్న స్టింగర్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో ఈ ఇద్దరు కమాండర్లకు ఐఎస్ఐ రెండు వారాలపాటు శిక్షణ ఇచ్చింది. ట్రైనింగ్‌ తర్వాత మొదటి ఆపరేషన్‌ కోసం వీరిని జలాలాబాద్‌ విమానాశ్రయానికి పంపారు. ఐఎస్ఐ స్టింగర్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ అప్పటి అధిపతి, చీఫ్ ట్రైనర్‌ రిటైర్డ్ కల్నల్‌ మహమూద్‌ అహ్మద్‌ ఘాజీ 'అఫ్గాన్‌ వార్‌ అండ్‌ స్టింగర్‌ సాగా' అనే పుస్తకం రాశారు. "సెప్టెంబర్ 25,1986. గఫ్ఫార్‌ తన బృందంతో కలిసి జలాలాబాద్ విమానాశ్రయానికి ఈశాన్య దిశలో ఉన్న కొంత దూరంలోని టెలీనుమా ప్రాంతానికి వెళ్లారు. కొండలు, గుట్టలు, పొదల మధ్య నుంచి దాడులు చేశారు" అని అందులో పేర్కొన్నారు.

 
ఏమిటీ స్టింగర్‌ క్షిపణి?
స్టింగర్‌ మిసైల్‌ను భుజం మీద నుంచి గాలిలోకి కాలుస్తారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి సులభంగా రవాణా చేయడానికి ఇది వీలుగా ఉంటుంది. ఈ మిసైల్‌ను అమెరికా రూపొందించింది. అఫ్గాన్‌ యుద్ధ సమయంలో ఈ మిసైల్ వాడటం మొదలు పెట్టడంతో రష్యా ఆ దేశం నుంచి వెళ్లిపోవాల్సిన వచ్చింది. స్టింగర్‌ రాక ముందు ముజాహిదీన్ల సైనిక బలం, ప్రభావం పెద్దగా ఉండేది కాదు. అఫ్గానిస్తాన్‌లో రష్యా సైన్యం ఓడిపోవడానికి ప్రధాన కారణం స్టింగర్‌ మిసైళ్లేనని నిపుణులు అంటున్నారు.

 
అఫ్గానిస్తాన్‌లో ముజాహిదీన్‌ల కోసం ఐఎస్‌ఐ నిర్వహిస్తున్న స్టింగర్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ అధిపతి రిటైర్డ్‌ కల్నల్ మహమూద్ అహ్మద్‌ ఘాజీ గతంలో పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ రెజిమెంట్‌లో అధికారిగా పని చేశారు. ఐఎస్‌ఐలో ఒక టీమ్‌కు అధిపతిగా ఉన్న ఆయన, స్టింగర్‌ ట్రైనింగ్‌ కోసం అమెరికా కూడా వెళ్లారు. ఆయనను అమెరికాకు పంపడంలో ఐఎస్‌ఐ ముఖ్య ఉద్దేశం అఫ్గానిస్తాన్‌లో రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముజాహిదీన్లకు స్టింగర్‌ మిసైళ్లను ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వడమే.

 
ఆ ఆయుధాల సాయంతో రష్యాను అఫ్గానిస్తాన్‌ నుంచి వెళ్లగొట్టాలన్నది ఐఎస్‌ఐ ప్లాన్. ఐఎస్‌ఐ ఊహించినట్లుగానే అఫ్గానిస్తాన్‌లో రష్యా వైమానిక దళానికి స్టింగర్‌ క్షిపణి తలనొప్పిగా మారింది. ఈ ఆయుధం వచ్చినప్పటి నుంచి రష్యన్‌ సైన్యం తమ పోరాటాన్ని జల, భూతల యుద్ధాల వైపు మరల్చింది.

 
ఐఎస్‌ఐకి అమెరికా సహకారం
స్టింగర్‌ రాక ముందు అఫ్గానిస్తాన్‌ యుద్ధంలో రష్యన్, అఫ్గాన్‌ దళాలు ప్రత్యర్ధుల నుంచి వైమానిక దాడులను ఎదుర్కోలేదు. రష్యన్‌ హెలికాప్టర్లు గ్రామీణ ప్రాంతాల్లోని ముజాహిదీన్‌ల లక్ష్యాలపై ఎక్కువగా దాడులకు దిగాయి.

 
"1986లో 36 లాంఛర్లు, 154 స్టింగర్‌ మిసైళ్లను అఫ్గానిస్తాన్‌కు పంపారు. వీటిలో 37 స్టింగర్లను ప్రయోగించగా, 26 రష్యన్‌ విమానాలు కూలిపోయాయి" అని రిటైర్డ్‌ కల్నల్‌ ఘాజీ తన పుస్తకంలో పేర్కొన్నారు. 1989 నాటికి అఫ్గాన్‌ యుద్ధంలో స్టింగర్ల దాడులు పెరిగి పోయాయి. చివరకు రష్యన్లు అఫ్గానిస్తాన్‌ యుద్ధం నుంచి వైదొలిగారు. 1993 వరకు ఐఎస్‌ఐ నిర్వహించిన స్టింగర్‌ స్కూల్ క్రియాశీలకంగా ఉండేది. అప్పట్లో పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం కూడా దీనిని శ్రద్ధగానే చూసుకుంది.

 
మాజీ ప్రధాని మహ్మద్‌ ఖాన్‌ జుంజో, బెనజీర్‌ భుట్టోలు ఈ స్కూల్‌ను సందర్శించడమే ఇందుకు నిదర్శనం. అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, సీఐఏ అధికారులు ఈ స్కూల్‌ను తరచూ సందర్శించే వారని రిటైర్డ్‌ కల్నల్‌ ఘాజీ తన పుస్తకంలో రాశారు. అఫ్గాన్‌ యుద్ధం జోరందుకుంది. పాకిస్తాన్ ఐఎస్ఐ, అమెరికా సీఐఏలు అఫ్గాన్‌ తిరుగుబాటు దారులకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ట్రైనింగ్‌, డబ్బు అందించాయి అని ఆయన రాశారు.

 
పెను ప్రమాదం
ఇస్లామాబాద్‌, రావల్పిండికి సమీపాన, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సేకరించే ప్రదేశంగా ఐఎస్ఐ ఓజ్డీ శిబిరాన్ని ఉపయోగిస్తోంది. అయితే 1988 ఏప్రిల్‌ 10న అక్కడ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రిటైర్డ్‌ కల్నల్‌ ఘాజీ తన పుస్తకంలో "అక్కడ 10 వేల టన్నుల గన్‌పౌడర్‌ నిల్వ ఉంది. అక్కడి ఆయుధాలు మంటల్లో పేలి గాల్లో ఎగురుతున్నాయి. స్టింగర్‌ క్షిపణులు కూడా గాలిలోకి దూసుకుపోయాయి. వేలాది రాకెట్లు, యాంటీ ట్యాంక్‌ గన్‌లు ఈ పేలిపోయిన ఆయుధాలలో ఉన్నాయి. రైఫిళ్లు, మందు గుండు, లక్షల సంఖ్యలో ఉన్న తేలికపాటి ఆయుధాలు నాశనమయ్యాయి" అని రాశారు.

 
ఈ పేలుడులో డజనుకు పైగా అఫ్గాన్‌ ముజాహిదీన్‌లు, కొందరు ఐఎస్ఐ అధికారులు మరణించారని కల్నల్‌ ఘాజీ తెలిపారు. ఆ సమయంలో స్టింగర్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ కూడా అదే క్యాంపస్‌లో ఉంది. ఓజ్డీ క్యాంప్‌ ప్రమాదంలో రష్యన్ల పాత్ర ఉందని ఆ రోజుల్లో ప్రచారం జరిగింది. ఈ ప్రమాదం వల్ల అఫ్గానిస్తాన్‌కు స్టింగర్‌ సరఫరా తగ్గిపోతుంది లేదంటే నిలిచి పోతుంది. కాబట్టి రష్యన్లే ఈ పని చేసి ఉంటారని చాలామంది నమ్మేవారు. కానీ రిటైర్డ్ కల్నల్ ఘాజీ వేరే కథ చెప్పారు.

 
స్టింగర్‌ మిసైళ్లు-కుట్ర సిద్ధాంతాలు-నిజాలు
పాకిస్తాన్‌ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ ( త్రివిధ దళాల చీఫ్‌ల కమిటీ) ఛైర్మన్‌ జనరల్‌ అక్తర్‌ అబ్దుల్ రెహమాన్‌ 1988 ఏప్రిల్ 10 సాయంత్రం ఓజ్డీ శిబిరాన్ని సందర్శించారు. అప్పటికే మంటలు అదుపులోకి వచ్చాయి. "ఈ చర్య కుట్ర పూర్వకంగానే జరిగిందని తాను భావిస్తున్నట్లు జనరల్‌ రెహమాన్‌ అధికారులకు చెప్పారు. ఇక్కడ ఎంత ఆయుధ సంపత్తి ఉందో అందరికీ తెలుసనీ, అందువల్ల దీనిపై కుట్ర జరిగి ఉంటుందని ఆయన అధికారులతో అన్నారు" అని కల్నల్‌ ఘాజీ తన పుస్తకంలో రాశారు.

 
"ఇక్కడ ఆయుధ గిడ్డంగి ఏర్పాటు ఆలోచన జనరల్ అక్తర్‌ రెహమాన్‌దే. అయితే పట్టణ ప్రాంతానికి సమీపంలో గన్‌ పౌడర్‌ గిడ్డంగి ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కాని జనరల్ అక్తర్ వాటిని కఠినంగా తిరస్కరించారు. అప్పటికే ఆర్మీకి, ఐఎస్‌ఐకి మధ్య విభేదాలున్నాయి. అందువల్ల ఈ ప్రమాదంలో కుట్ర ఉందని కొందరు వాదించగా, మరికొందరు ప్రమాదవశాత్తు జరిగిందని అన్నారు. ఇక్కడ గోడౌన్‌ నిర్మించాలన్న ఆలోచన ఆయనదే కాబట్టి అక్తర్‌పై విమర్శలు ఎక్కువగా వినిపించాయి" అని రిటైర్డ్‌ కల్నల్‌ ఘాజీ తన పుస్తకంలో రాశారు.

 
అయితే ఇక్కడ మరో కుట్ర సిద్ధాంతం కూడా ప్రచారంలో ఉండేది. కొందరు ముజాహిదీన్‌లు ఇందులోని స్టింగర్‌ మిసైళ్లను ఇరాన్‌కు దొంగతనంగా అమ్మారని, ఆ రోజుల్లో అమెరికా అధికారులు తనిఖీ ఉండటంతో ఇది బైటపడకుండా ఉండేందుకు ఈ అగ్నిప్రమాదాన్ని సృష్టించారని కూడా ప్రచారం జరిగింది. అయితే రిటైర్డ్‌ కల్నల్‌ ఘాజీ తన పుస్తకంలో ఈ సిద్ధాంతం గురించి ప్రత్యేకంగా ఏమీ రాయలేదు. కానీ ఆయన తన పుస్తకంలో కుట్ర సిద్ధాంతాలు, తనకు తెలిసిన కొన్ని విషయాలను పేర్కొన్నారు.

 
"పాకిస్తాన్‌ 487 లాంఛర్లు, 2288 స్టింగర్‌ క్షిపణులను అమెరికా నుంచి అందుకుంది. వీటిలో 122 లాంఛర్లు 281 స్టింగర్లు అగ్నిప్రమాదంలో ధ్వంసమయ్యాయి. 365 లాంఛర్లు, 2007 స్టింగర్‌ క్షిపణులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిలో 336 లాంచర్లు, 1969 స్టింగర్లను ముజాహిదీన్లు ఉపయోగించారు. మిగిలినవి అమెరికాకు తిరిగి పంపారు" అని వెల్లడించారు. ఈ ప్రకటనతో ఇరాన్‌కు ఆయుధాల అమ్మకం కుట్ర సిద్ధాంతాన్ని తిరస్కరించాలన్నది రిటైర్డ్‌ కల్నల్‌ ఘాజీ ఉద్దేశంలా కనిపించింది.

 
అఫ్గాన్ యుద్ధంలో నిర్ణయాత్మక ఆయుధం
స్టింగర్‌ క్షిపణుల వాడకం అఫ్గానిస్తాన్‌ యుద్ధంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిందని తాము భావిస్తున్నట్లు అమెరికా సైన్యం రూపొందించిన నివేదికను ఉటంకిస్తూ 1989 జూలై 5న వాషింగ్టన్‌ పోస్ట్ ఒక కథనం రాసింది. అమెరికా ఆర్మీ నివేదిక ప్రకారం అఫ్గానిస్తాన్‌లో రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న గెరిల్లాలకు అమెరికా తయారు చేసిన ఈ ఆయుధం ఎంతో ఉపయోగపడింది. యుద్ధ స్వభావాన్ని మార్చేసింది. ముజాహిదీన్లు 340 స్టింగర్‌ క్షిపణులను పేల్చారని, 269 రష్యా యుద్ధ విమానాలను కూల్చేశారని ఈ నివేదిక పేర్కొంది. వీటి పని తీరు అమెరికన్‌ ప్రమాణాలు నిర్దేశించిన దానికన్నా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.

 
ఈ క్షిపణులు లక్ష్యాన్ని చేరుకునే సామర్ధ్యం 79% వరకు ఉన్నట్లు వెల్లడించింది. ఈ క్షిపణులు రంగంలోకి దిగిన నెల రోజుల్లోనే సోవియట్‌ సేనలు అఫ్గాన్‌ వైమానిక దాడుల ఆపరేషన్‌ను నిలిపేశాయని కూడా ఈ రిపోర్ట్‌ పేర్కొంది. "స్టింగర్‌ రాక ముందు రష్యన్‌ విమానాలు యుద్ధంలో దూసుకు పోయాయి. అవే గెలిచాయి. 1986 వచ్చే సరికి యుద్ధ స్వభావం పూర్తిగా మారిపోయింది" అని ఆ రిపోర్టులో ఉంది. అయితే ఈ ఆయుధం సృష్టించిన విధ్వంసం, పేల్చిన స్టింగర్లు, కూల్చిన విమానాల సంఖ్య విషయంలో ముజాహిదీన్లు సరైన ఆధారాలు ఇచ్చి ఉండకపోవచ్చని కొందరు అమెరికా సైనికాధికారులు అనుమానించినట్లు కూడా వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక కథనం పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments