Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక వేధింపులు: బస్సులు, రైళ్ళలో అసభ్యంగా వేధించే వాళ్ళను పట్టిచ్చే పరికరం రెడీ....

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (20:10 IST)
బస్సులు, రైళ్లు వంటి ప్రజా రవాణాలో మహిళల శరీరాన్ని అసభ్యంగా తాకుతూ చేసే లైంగిక వేధింపులను అరికట్టటానికి జపాన్ వినూత్న పరికరాన్ని ఆవిష్కరించింది. మహిళలు తమపై దాడిచేసిన వారి మీద ఈ పరికరం ద్వారా బయటకు కనిపించని ఒక గుర్తును ముద్రించవచ్చు. ఆ గుర్తు ఓ చిన్న హస్తం ఆకారంలో ఉంటుంది. ఆ హస్తం ముద్ర ఉన్నవారిని తర్వాత ఇదే పరికరంలోని నల్లని వెలుగును ఉపయోగించి గుర్తించవచ్చు.

 
లైంగిక వేధింపుల నేరాలను అరికట్టటానికి సాయం చేయటం కోసం ఈ పరికరాన్ని రూపొందించామని తయారీ సంస్థ సాచిహతా చెప్తోంది. అయితే, ఇది బాధితుల మీద అదనపు భారం మోపుతుందని లైంగిక వేధింపుల అంశంపై పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ఆందోళన వ్యక్తంచేస్తోంది.

 
గత మే నెలలో జపాన్‌లోని ఒక రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం మీద తమ శరీరాలను తాకుతూ లైంగిక వేధింపులకు (గ్రోపింగ్) పాల్పడిన అనుమానితుడిని ఇద్దరు స్కూలు విద్యార్థినులు తరుముతున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ నేపథ్యంలో ఈ యాంటీ-గ్రోపింగ్ ఒక స్టాంప్‌ను తయారు చేస్తున్నట్లు సాచిహతా ప్రకటించింది. ''లైంగిక వేధింపులు లేని ప్రపంచం దిశగా ఈ పరికరం ఓ చిన్న ముందడుగు'' అని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు ట్వీట్ చేశారు.

 
అత్యాచారం, లైంగిక హింస భయాలను సొమ్ము చేసుకోవటానికి ప్రైవేటు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని, ఈ దాడులకు పాల్పడేవారిని ఎదుర్కొనే భారం బాధితులపైనే మోపుతున్నారని రేప్ క్రైసిస్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీతో పేర్కొన్నారు. ''ఇటువంటి ఉత్పత్తులను ఆవిష్కరించి తయారు చేస్తున్న వారివి సదుద్దేశాలే అనటంలో సందేహం లేదు. అయితే, ప్రజలు, ప్రధానంగా మహిళలు, బాలికల్లోని లైంగిక హింస, అత్యాచారాల భయాన్ని సొమ్ము చేసుకోవటమనేది ఒక సమస్య'' అని కేటీ రసెల్ వ్యాఖ్యానించారు.

 
''ఇటువంటి 'నిరోధ' ఉత్పత్తులు లైంగిక హింస నుంచి కాపాడుకునే భారాన్ని బాధితులు, బాధితులు కాగలవాళ్ల మీదే మోపుతున్నాయి. నిజానికి ఆ బాధ్యత మొత్తం ఈ నేరాలకు పాల్పడే వారి మీదే ఉంటుంది. ఈ నేరాలను అరికట్టే శక్తి కూడా వారికే ఉంటుంది'' అని ఆమె అభిప్రాయపడ్డారు.

 
టోక్యో నగరంలో 2017లో 2,620 లైంగిక నేరాల ఫిర్యాదులు అందాయని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. అందులో గ్రోపింగ్ నేరాల కేసులు 1,750 ఉన్నాయని.. అవి ఎక్కువగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో జరిగాయని చెప్పారు. యాంటీ-గ్రోపింగ్ స్టాంప్ పరికరం ధర ఒక్కొక్కటి 2,500 యెన్లు (సుమారు రూ. 1,700) నిర్ణయించారు. మంగళవారం పరిమిత సంఖ్యలో 500 విడుదల చేయగా.. మొత్తం 30 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయని సంస్థ అధికార ప్రతినిధి సీఎన్ఎన్ వార్తా సంస్థకు చెప్పారు.

 
జపాన్‌లో గ్రోపింగ్ దాడులను అరికట్టటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని నెలల కిందట 'డిజి పోలీస్' అనే యాప్ విడుదలైంది. బాధితులు ఈ యాప్ ద్వారా ''ఇక్కడ ఒక గ్రోపర్ ఉన్నాడు.. దయచేసి సాయం చేయండి'' అనే మెసేజ్‌ను డిస్‌ప్లే చేయటం ద్వారా సహ ప్రయాణికులను అప్రమత్తం చేయటానికి వీలు కల్పిస్తుంది.

 
లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించటానికి టోక్యో రైళ్లలో 2009లోనే యాంటీ-గ్రోపింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం.. ఇటువంటి లైంగిక దాడులకు పాల్పడుతున్నారని, అనుమతి లేకుండా మహిళలు, బాలికల ఫొటోలు తీస్తున్నారని 6,000 మందికి పైగా అనుమానితులను అరెస్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులను బయటపెడుతూ చర్చలోకి తెచ్చిన #MeToo ఉద్యమం.. జపాన్‌లో బలంగా విస్తరించలేదు. ప్రపంచ ఆర్థిక వేదిక 149 దేశాలతో రూపొందించిన లైంగిక సమానత్వ సూచీలో జపాన్‌ 110వ స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి

బాలీవుడ్‌ సినిమా వెల్‌కమ్‌ టు ఆగ్రా లో అలీ

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలతో వరుణ్ తేజ్

రమణ గోగుల, మధు ప్రియ ఆలపించిన గోదారి గట్టు పాట రిలీజ్

ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ చూసి రశ్మిక మందన్నను మెచ్చుకున్న సుకుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం