Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో వరి సాగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి? చేస్తోంది ఏంటి?- అభిప్రాయం

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (22:10 IST)
దిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేపట్టిన దీక్షతో మళ్లీ రైతులు, ఎంఎస్‌పీ, ధాన్యం సేకరణపై చర్చ మొదలైంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత గత ఏడేళ్లలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో దిగుబడి కూడా పెరిగింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలు, సమృద్ధిగా లభిస్తున్న నీళ్లు ఒకవైపు, కేంద్ర పూల్‌కి పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హద్దూ లేకుండా చేస్తున్న ధాన్యం సేకరణ మరోవైపు కూడా రైతులు ధాన్యం వైపు మొగ్గు చూపేందుకు ఊతమిస్తున్నాయి.

 
సహజ వనరులు, స్థానిక మార్కెట్ డిమాండ్ ఆధారంగా రాష్ట్రంలో 'నియంత్రిత సాగు పద్ధతి'ని అమల్లోకి తీసుకువస్తామని 2020లో ముఖ్యమంత్రి ప్రకటించడంతో సమస్య ప్రారంభమైంది. అయితే, తుది నిర్ణయం తీసుకునే సమయానికే చాలామంది రైతులు ధాన్యం, పత్తి సాగు మొదలుపెట్టారు. అయితే, ప్రభుత్వం మాత్రం మొక్కజొన్న వంటి ఇతర పంటలు వేయాలని అధికార యంత్రాంగం ద్వారా రైతులపై ఒత్తిడి తీసుకురావటం మొదలు పెట్టింది. దీంతో ధాన్యం సాగు విస్తీర్ణం ఖరీఫ్ (వానాకాలం)లో 53.33 లక్షల ఎకరాలకు, రబీ (యాసంగి)లో 52.78 లక్షల ఎకరాలకు పెరిగింది. 2013-14తో పోలిస్తే వానాకాలంలో 238 శాతం పెరుగుదల, యాసంగిలో 450 శాతం పెరుగుదల నమోదైంది.

 
2020లో నిర్ణయం తర్వాత వరుసగా మూడు పంట కాలాల్లో వరిసాగు విస్తీర్ణం పెరిగి, నాలుగో పంట కాలంలో మాత్రం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుత రాజకీయ వివాదం నేపథ్యంలో మళ్లీ పెరిగే అవకాశం లేకపోలేదు. ఇలా కాకుండా దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. సీజన్ ముగిసే సరికి పెరిగిన ధాన్యం విస్తీర్ణంతో రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలు తెలిశాయి. దీంతో మొత్తం విధానాన్నే ఉపసంహరించుకుంది. ఏఏ పంటలు వేయాలనేది తాము నిర్ణయించమని, రైతులకే దీనిని వదిలిపెడుతున్నామని ప్రకటించింది. కానీ, అప్పటికే రాజకీయాలు మొదలయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రంగంలోకి దిగి రైతులు ధాన్యం పండించాలని, మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.

 
సాగు విస్తీర్ణం పెరుగుదల 2021లో కూడా కొనసాగింది. కొంతమంది కేంద్ర మంత్రులు కూడా తొలుత ఈ సమస్యపై స్పందించారు. బాయిల్డ్ రైస్ అయితే కొనుగోలు చేయమని, ముడి ధాన్యాన్ని మాత్రం ఎంతైనా కొనుగోలు చేస్తామంటూ ప్రకటనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ముడి ధాన్యాన్నే సరఫరా చేస్తామని లిఖితపూర్వకంగా రాసిచ్చిందని కూడా తెలిపారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న పార్టీలు 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశంపై వాదనలకు దిగాయి.

 
ధాన్యం సాగు, సేకరణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తవాలు:
కేంద్ర ప్రభుత్వ ధాన్యం సేకరణ విధానం పంటలు, రాష్ట్రాల వారీగా తీవ్రలోపభూయిష్టంగా ఉంది. 24 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ కేంద్రం కేవలం ధాన్యం, గోధుమలను మాత్రమే సేకరిస్తుంది. పంజాబ్‌లో 89 శాతం పంటను, హరియాణాలో 85 శాతం పంటను సేకరించే కేంద్రం ధాన్యాన్ని విస్తారంగా సాగు చేసే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి 18 శాతం, పశ్చిమ బెంగాల్ నుంచి 11 శాతం మాత్రమే సేకరిస్తుంది. తెలంగాణలో పండే ధాన్యంలో కేంద్రం 62 శాతం సేకరిస్తోంది. ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు సేకరించి, మిల్లులో బియ్యం ఆడిస్తే టన్నుకు రూ.37 వేలు ఖర్చవుతుంది. అయితే, దీనిని సబ్సిడీ కింద రూ.3 వేల నుంచి రూ.8300లకు పంపిణీ చేస్తుంది.

 
రాష్ట్రాలు ధాన్యం సేకరిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. రైసు మిల్లర్స్ ద్వారా బియ్యం ఆడించి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పంపిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలో భారీగా రైస్ మిల్లుల వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఉప్పుడు బియ్యంగా పిలిచే బాయిల్డ్ రైస్‌ విధానంలో అయితే ధాన్యం నుంచి ఎక్కువ బియ్యం వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది రైస్ మిల్లర్లు బాయిల్డ్ రైస్ మిల్లుల్ని పెట్టారు. 2015 నాటికి తెలంగాణలో 1500 కొత్త రైస్ మిల్లులు నెలకొల్పినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ తగ్గిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ముడి బియ్యం మాత్రమే పంపించాలని రాష్ట్రాన్ని కోరింది. అయితే, మిల్లర్స్ లాబీ మాత్రం బాయిల్డ్ రైస్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తోంది. ముడి బియ్యంతో పోలిస్తే బాయిల్డ్ రైస్ వల్ల మిల్లర్లకు 5 శాతం అదనంగా బియ్యం లభిస్తుంది.

 
1995 నుంచి వికేంద్రీకృత సేకరణ విధానం ప్రకారం రాష్ట్రాలన్నీ పీడీఎస్(ప్రజా పంపిణీ వ్యవస్థ) అవసరాలకు తగ్గట్టుగా స్థానికంగా ధాన్యం సేకరించొచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి అవసరమైతే అదనంగా కూడా సరఫరా చేయొచ్చు. అప్పటి నుంచి చాలా రాష్ట్రాలు స్థానికంగా ధాన్యం సేకరించి, రాష్ట్రంలోనే పంపిణీ చేస్తున్నాయి. కానీ, కేంద్రం మాత్రం పంజాబ్, హరియాణాల నుంచి మాత్రం అదే మొత్తంలో ధాన్యాన్ని సేకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ఖరీఫ్‌లో మూడో అతిపెద్ద ధాన్యం పంపిణీదారుగా, రబీలో అయితే అతిపెద్ద ధాన్యం పంపిణీదారుగా అవతరించింది. మరోపక్క కేంద్రం వద్ద బియ్యం రాశులు పెరుగుతూపోతున్నాయి. ఎఫ్‌సీఐపై రుణ బారం కూడా పేరుకుపోతోంది. టన్నుకు రూ.37 వేలు పెట్టి బియ్యం సేకరించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ బియ్యాన్ని సబ్సిడీ రూపంలో దేశీయంగా అయితే రూ.22 వేలకు, అంతర్జాతీయంగా అయితే రూ.28 వేలకు అమ్మాల్సిన పరిస్థితి.

 
ధాన్యాన్ని నిల్వ చేయడం సులభమే, కానీ, బియ్యం మాత్రం ముక్కిపోతుంటాయి. ఎఫ్‌సీఐ మాత్రం ధాన్యాన్ని యధాతథంగా కొనుగోలు చేయకుండా బిల్లర్ల ద్వారా బియ్యం ఆడించి, ఆ బియ్యాన్ని సేకరించే అలవాటును కొనసాగిస్తోంది. ఇవన్నీ ధాన్యం సేకరణ, పంపిణీకి సంబంధించి అంశాలు కాగా.. సాగుకు సంబంధించిన, పట్టించుకోని సమస్యలూ ఉన్నాయి. వరి సాగుకు ప్రాధాన్యం ఇవ్వడంతో తెలంగాణలో ఇతర పంటల సాగు నిర్లక్ష్యానికి గురైంది. ప్రస్తుతం తెలంగాణలో ఖరీఫ్‌లో 85 శాతం వరి, పత్తి పంటలనే సాగు చేస్తున్నారు. రబీలో అయితే వరిదే పైచేయి.

 
తెలంగాణ అన్ని రకాల వంటనూనెలనూ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. కూరగాయల్లో 60 శాతం దిగుమతి చేసుకుంటోంది. కొన్ని రకాల పప్పులు, తృణ ధాన్యాలను కూడా దిగుమతి చేసుకుంటోంది. వరి సాగుకు ఎకరాకు 60 లక్షల లీటర్ల నీరు అవసరం. ఒక కేజీ బియ్యానికి సగటున 5000 లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఇది ఒక ట్యాంకర్ నీటితో సమానం. ఇతర పంటలనైతే తక్కువ నీటితో కూడా పండించొచ్చు. నాబార్డు సహకారంతో నిర్వహించిన, 2018లో ప్రచురించిన 'ప్రధాన భారతీయ పంటల నీరు ఉత్పత్తి మ్యాపింగ్' అనే అథ్యయనంలో.. అదనంగా నీటి లభ్యత ఉంటే తప్ప అధికంగా నీటిని తాగేసే ధాన్యం, పత్తి వంటి పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచకూడదని రచయితలు సూచించారు. అయితే, వాస్తవంలో మాత్రం ఈ రెండు పంటలే పెరిగాయి.

 
తెలంగాణ పీఠభూమిలో గ్రావిటీతో నీళ్లు అందించే జలాశయాలపై ఆధారపడే అవకాశం లేదు. దీంతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలపైనే ప్రధానంగా ఆధారపడాల్సి వస్తోంది. దీనివల్ల ఎకరం పొలంలో ధాన్యం సాగు చేసేందుకు అవసరమైన నీటి విలువ రూ.50 వేలకు చేరుతోంది. (వర్షాకాలంలో వర్షాల వల్ల ఈ విలువ కొంత తక్కువగా ఉండొచ్చు). అదనంగా విద్యుత్ ఉత్పత్తి వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు పర్యావరణానికి హానికరం. నీటి నిల్వ కారణంగా మిథేన్ వాయువు వెలువడుతుంది. ఇది కూడా పర్యావరణానికి హానికరం. వరిసాగు పెరుగుదలతో రసాయన ఎరువుల వినియోగం, అందులోనూ యూరియా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో సగటున ఎకరానికి 51.2 కేజీల ఎన్‌పీకే వినియోగిస్తుంటే తెలంగాణలో మాత్రం 178 కేజీలు వినియోగిస్తున్నారు.

 
నత్రజని ఎరువులు 25 శాతం కంటే తక్కువ మాత్రమే పంటకు ఉపయోగపడతాయి. మిగతా ఎరువంతా నైట్రస్ ఆక్సైడ్ రూపంలో గాల్లో, నీటిలో కలిసిపోతుంది. దీనివల్ల కూడా పర్యావరణానికి హానికరం. రాష్ట్రంలో 45 శాతం నీటివనరులు నైట్రేట్ కాలుష్యం బారిన పడ్డాయని అంచనాలు చెబుతున్నాయి. వరి సాగుకోసం పంట పొలాలను దుక్కి దున్నాల్ని వస్తుంది. దీనివల్ల నేల పటుత్వం దెబ్బతింటుంది.

 
ప్రతి ఎకరం వరి సాగు నుంచి 10 టన్నుల కర్బనాలకు సరిపడా గ్రీన్ హౌస్ గ్యాస్ (జీహెచ్‌జీ) ఉద్గారకాలైన మిథేన్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఒక కోటి ఎకరాల నుంచి 10 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడతాయి. దీనివల్ల పర్యావరణానికి తీవ్రంగా నష్టం జరుగుతోంది. భారతదేశం తన కర్బన ఉద్గారాలను 2030 నాటికి సగానికి తగ్గించుకుంటానని, 2050 నాటికి పూర్తిగా లేకుండా చేస్తానని హామీ ఇచ్చింది. అధిక నీటిని, ఎరువులను, విద్యుత్‌ను ఉపయోగిస్తూ ధాన్యాన్ని సాగు చేయడం తగ్గిస్తే భారతదేశం తన హామీవైపు గణనీయమైన పురోగతి సాధిస్తుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని కేంద్ర, రాష్ట్రాలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి.

 
ప్రస్తుతానికి ధాన్యం సేకరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరించి, ముడి బియ్యాన్ని కేంద్రానికి సరఫరా చేయాలి. రాష్ట్రం ఎంత ముడిబియ్యాన్ని సరఫరా చేసినా కేంద్రం ఆమోదించాలి. రాష్ట్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్‌ కొనుగులును, మార్కెటింగ్‌ను ప్రోత్సహించకూడదు. బాయిల్డ్ రైస్ వర్తకులు, ఎగుమతిదారులకు రాయితీలు ఇవ్వకూడదు.

 
దీర్ఘకాలికంగా..
అన్ని రాష్ట్రాలూ, అన్ని పంటలకూ న్యాయమైన పంట సేకరణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. ఆహార భద్రత నిధులను రాష్ట్ర ప్రభుత్వాలను బదిలీ చేయాలి. రాష్ట్రాలు తమ అవసరాలకు తగ్గట్టుగా ఆహార (పంటల) సేకరణ, పంపిణీకి ఈ నిధులు వినియోగించాలి. రైతు ఉత్పాదక కంపెనీలను బలోపేతం చేసి, రుణాల సేకరణ, పంపిణీలో వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం రెండు సీజన్లలోనూ కలిపి కోటి ఎకరాలుగా ఉన్న వరి సాగును తెలంగాణ 25 లక్షల ఎకరాలకు తగ్గించుకోవాలి. రాష్ట్ర జనాభా అవసరాలకు తగినంత బియ్యం ఉత్పత్తి చేసుకునేందుకు ఆ మొత్తంలో సాగు సరిపోతుంది. పప్పులు, నూనె గింజలు, కూరగాయల వంటి ఇతర పంటలకు కూడా రాష్ట్రం సహాయం చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments