Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేంద్ర సింగ్ ధోనీ: చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ మంత్రం ఏమిటి?

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (12:04 IST)
నిలకడైన ఆటకి నిలువెత్తు చిరునామా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే). మనం పొద్దున్న లేచి ఆఫీసు కెళ్ళినంత మామూలుగా ఈ టీమ్ దాదాపుగా ప్రతి సారీ ఐపీఎల్ ఫైనల్‌కి వెళ్తూ ఉంటుంది. పద్నాలుగు సీజన్లలో పది సార్లు ఫైనల్‌కి చేరడం - బహుశా ఇంత మంచి రికార్డు మరే ఇతర జట్టుకు, క్రికెట్‌లోనే కాదు వేరే క్రీడల్లో కూడా ఉండదేమో. ఆ మిగతా నాలుగు సీజన్లలో కూడా రెండు సార్లు ప్లేఆఫ్స్ దాకా చెన్నై రాగలిగింది. సీఎస్‌కే నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే, ముంబై ఇండియన్స్ వారి కన్నా ఒకటి ఎక్కువగా ఐదు టైటిల్స్ సాధించారు. కానీ పదహారు సీజన్లలో ముంబై జట్టు ఆరు సార్లు మాత్రమే ఫైనల్ చేరింది. ప్లేఆఫ్స్‌కు కూడా పదిసార్లు మాత్రమే క్వాలిఫై అయింది.
 
ఐపీఎల్ ప్రపంచంలోనే నంబర్ వన్ క్రికెట్ లీగ్. ఇక్కడ ఫైనల్ దాకా రావాలంటే లీగ్ దశలోని 14 మ్యాచెస్‌లో అగ్రశ్రేణి జట్లను దాటుకోవాలి. ప్లేఆఫ్స్‌లో నాకౌట్ కాకుండా తప్పించుకోవాలి. ఇంతటి క్లిష్టమైన మార్గం దాటుకుని సీఎస్‌కే జట్టు ఎలా దాదాపు ప్రతిసారీ ఫైనల్‌కు రాగలుగుతోంది? ఇందులో ఏదైనా మ్యాజిక్ ఉందా? అని మీరు ఎవరిని అడిగినా కూడా ఆ మ్యాజిక్ పేరు మహేంద్ర సింగ్ ధోనీ అని ఠక్కున సమాధానం వస్తుంది. సీఎస్‌కే అంటేనే ధోనీ, ధోనీ అంటేనే సీఎస్‌కే. మొదటి సీజన్ నుంచి ఆ జట్టుకు సూత్రధారి, ప్రధాన పాత్రధారి, సారథి, మహారథి - అన్నీ ఆయనే. ధోనీ క్రికెట్ జట్టును నడిపించే తీరును మాత్రం ఎంబీఏ పాఠ్యాంశంగా పెట్టుకోవచ్చు. మానవ సంబంధాల గురించి ఆయనకు తెలిసిన మర్మాలు మనకు మేనేజ్‌మెంట్ పుస్తకాలలో దొరకవు.
 
సాదా సీదాగా కనిపించే ఆటగాళ్ళ లోని ప్రతిభ వెలికితీసి వాళ్ళను చాంపియన్ ప్లేయర్లుగా తీర్చిదిద్దడం ధోనీకే చెల్లింది. ఇదంతా చూస్తుంటే ఆయన దగ్గర మంత్రదండం ఏదైనా ఉందా లేక మామూలు లోహాలను బంగారంగా మార్చే పరుసవేది విద్య తెలుసా అనిపిస్తుంది. రవిచంద్రన్ అశ్విన్, మురళీ విజయ్, మన్‌ప్రీత్ గోనీ, సుదీప్ త్యాగీ, మోహిత్ శర్మ మొదలుకొని తాజాగా దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్ వరకు చాలామంది కొత్త కుర్రాళ్ళ టాలెంట్‌కు సానబెట్టి వాళ్ళు ఇండియాకు ఆడేలా చేశాడు ధోనీ. సీనియర్ల విషయంలో కూడా డిటో. వేరే జట్ల తరఫున అంతంత మాత్రంగా ఆడిన కేదార్ జాదవ్, అంబటి రాయుడు, అజింక్య రహానే లాంటి ఆటగాళ్ళు ధోనీ చత్రఛాయలోకి వచ్చాక బ్రహ్మాండంగా రాణించి మళ్ళీ టీమిండియాలోకి రావడం కూడా మనం చూస్తూనే ఉన్నాం.
 
ధోనీ నాయకత్వ పద్ధతులు చాలా సింపుల్. ఒక్కసారి కమిటైతే... అన్న సినిమా డైలాగ్ లాగ తాను నమ్మి ఎలెవెన్‌లో ఆడించిన ఆటగాళ్లు వరసగా ఫెయిలైనా వాళ్ళని తీసేయడు. కెప్టెన్ తమ మీద ఉంచిన నమ్మకాన్ని వాళ్ళు కూడా వమ్ము చేయకుండా ఏదో ఒక దశలో అంది రావడం తరచుగా జరుగుతూనే ఉంది. జట్టు ఎంపికలో కూడా సూపర్ స్టార్ల కోసం వెళ్ళకుండా ఎక్కువగా సీనియర్ల అనుభవానికి పెద్ద పీట వేస్తాడు ధోనీ. "డాడ్స్ ఆర్మీ" అని కొందరు అవహేళన చేసినా సరే బ్రావో, తాహిర్ లాంటి వయసు మీరిన ప్లేయర్లు ఈ టీమ్‌కు మంచి విజయాలు అందించారు. ఇక ధోనీ కూల్ కెప్టెన్సీ గురించి, వ్యూహ రచన గురించి కొత్తగ చెప్పాల్సిన పని లేదు. అలాగే ఫినిషర్‌గా అతను తన బ్యాటింగ్‌తో అందించే కొస మెరుపులు కూడా మనకు తెలిసినవే.
 
అయితే చెన్నై సూపర్ కింగ్స్ విజయాలకు పూర్తి క్రెడిట్ ధోనీకే ఇవ్వడం కరెక్టు కాదు. ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి. టీంను నడిపించడంలో ధోనీకి పూర్తి స్వాతంత్రం ఇచ్చిన ఫ్రాంచైజ్ యజమాన్యాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ముంబై, చెన్నై ఇన్ని టైటిల్స్ గెలవడానికి ఆ రెండు జట్ల యజమాన్యం ఏర్పరిచిన ఆరోగ్యకరమైన వాతావరణం కూడా కారణమని దగ్గరనుంచి చూసిన వారు చెబుతుంటారు. 'తల' మహేంద్రుడిదైతే, ఆయనకు కుడిభుజంగా నిలిచిన 'చిన్న తల ' సురేశ్ రైనా పాత్ర కూడా ఇక్కడ చాలా ముఖ్యం. ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ ప్రతి సీజన్లో 300కి తక్కువ కాకుండా రన్స్ చేయడంతో పాటు టీమ్ అవసరానికి తగ్గట్టుగా ఆడేవాడు. అందుకే అతనికి 'మిస్టర్ ఐపీఎల్ 'అనే పేరొచ్చింది. రైనా నిష్క్రమణ తర్వాతే, గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎస్‌కే రెండు సందర్భాల్లో ప్లేఆఫ్స్ మిస్సవ్వడం కాకతాళీయం కాకపోవచ్చు.
 
ఈ జట్టుకు కలిసొచ్చిన మరో అంశం స్థాన బలం. చెన్నైలోని చెపాక్ స్టేడియం వారికి దుర్భేద్యమైన కంచుకోట లాంటిది. మరే జట్టుకు లేనట్టుగా తమ సొంత స్టేడియంలో 71 శాతం విజయాలు సీఎస్‌కే సాధించింది (62 మ్యాచుల్లో 44 విజయాలు). 2011 సీజన్లో అయితే చెన్నైలో ఆడిన అన్ని (7) మ్యాచ్‌లు ఈ జట్టు నెగ్గి రికార్డు సృష్టించింది. ఫ్రాంచైజ్ యజమానులు బెట్టింగ్‌కు పాల్పడ్డారని సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండేళ్ల పాటు ఐపీఎల్ నుంచి సస్పెండ్ ఆయ్యాయి.
 
సుప్రీం కోర్ట్ నియమించిన లోధా కమిషన్ ఈ సస్పెన్షన్ విధించింది. 2016, 2017 సీజన్లలో ఈ రెండు జట్లు ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాయి. అయితే 2018లో తిరిగి వస్తూనే చెన్నై జట్టు ఆ ఏడాది టైటిల్ గెలుచుకుని తన సత్తా చాటింది. ధోనీ రిటైర్మెంట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తన ఆఖరు ఐపీఎల్ మ్యాచ్ చెన్నైలో ఆడతానని మాత్రం అతను చెప్పాడు. ఈ సీజన్ తర్వాత ధోనీ రిటైర్ అవుతాడని చాలామంది భావించారు.
 
అందుకే ధోనీ ఈసారి ఆడిన ప్రతి స్టేడియంలో ప్రేక్షకులు అతనికి జేజేలు పలికారు. అయితే వచ్చే ఏడాది కూడా తాను ఆడే అవకాశం ఉందని ధోనీ అంటున్నాడు. ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు - ఆటగాడిగా రిటైరైనా కూడా మెంటార్ గానో, కోచ్ గానో అతను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తన అనుబంధం కొనసాగిస్తాడు. ఇలాంటి ఇతర కారణాలున్నా ప్రధానంగా ధోనీ మహేంద్రజాలమే సీఎస్‌కేను ముందుకు నడిపిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నిరుడు ఆయన కెప్టెన్సీ నుంచి తప్పుకోగానే జట్టుకు వరస పరాజయాలు ఎదురయ్యాయి. మళ్ళీ ఆయనే హడావుడిగా పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. అందుకే వయసు 41 దాటినా, శరీరం పూర్తిగా సహకరించకున్నా ధోనీ ఇంకా తన రంగభూమి వదల్లేదు.
(నోట్: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments