Webdunia - Bharat's app for daily news and videos

Install App

Indian Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటారా?

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (16:06 IST)
రాష్ట్రపతి ఎన్నికలు వచ్చే జులైలో జరగనున్నాయి. 2017 జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం త్వరలో పూర్తి కానుంది. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతిని కూడా ఒకేసారి ఎన్నుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్‌లు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. అలాగే మద్దతు కోసం ఆయా ప్రాంతీయ పార్టీలతో చర్చలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారో ఒకసారి చూద్దాం. భారత రాష్ట్రపతి పదవీ కాలం అయిదేళ్లు. అంటే ప్రతి అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది.

 
ఎలక్టోరల్ కాలేజీ అంటే ఏమిటి?
దేశంలోని పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉండేదే ఎలక్టోరల్ కాలేజీ. పార్లమెంటులోని రెండు సభలు లోక్‌సభ, రాజ్యసభల సభ్యులకు ఓటు వేసే హక్కు ఉంటుంది. అసెంబ్లీల విషయంలో ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది కానీ ఎమ్మెల్సీలకు ఉండదు. ఎలక్టోరల్ కాలేజీలో ఉండే సభ్యుల ఓటుకు ఒక విలువ ఉంటుంది. ఈ విలువ ఎంపీలకు ఒక విధంగా ఎమ్మెల్యేలకు మరో విధంగాను ఉంటుంది. 2017 నాటి లెక్కల ప్రకారం ఎలక్టోరల్ కాలేజీలో 4,896 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు.

 
ఎమ్మెల్యేల ఓటు విలువను ఎలా లెక్కిస్తారు?
మొదట ఒక రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించాలి. అలా వచ్చే విలువను 1000తో భాగించాలి. అప్పుడు వచ్చే సంఖ్యే ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఓటు విలువ. దీనికోసం 1971 జనాభా లెక్కలను పరిగనణలోకి తీసుకుంటారు.

 
ఆంధ్రప్రదేశ్‌లో....
1971 జనాభా లెక్కల ప్రకారం ఏపీ జనాభా 2,78,00,586. ఏపీ శాసనసభ సీట్ల సంఖ్య 175. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ= 2,78,00,586 ÷ 175 = 158860.491429 ⇒ 158860.491429÷1,000 = 158.86 ⇒ 159
 
ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ఎమ్మెల్యేల అందరి ఓటు విలువ = 159X175= 27,825
అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఓటు విలువ 27,825.

 
తెలంగాణలో..
తెలంగాణ జనాభా 1972 లెక్కల ప్రకారం 1,57,02,122.. ఆ రాష్ట్రంలోని మొత్తం శాసనసభ స్థానాలు 119.
తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ = 1,57,02,122 ÷ 119 = 131950.605042 ⇒ 131950.605042 ÷ 1000 = 131.95 ⇒ 132
తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 132.
ఈ లెక్కన తెలంగాణ మొత్తం ఓటు విలువ 132 X 119 = 15,708.

 
ఎంపీల ఓటు విలువను ఎలా లెక్కిస్తారు?
దేశంలోని అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్యతో భాగిస్తే ఎంపీల ఓటు విలువ వస్తుంది.
ఎంపీ ఓటు విలువ= అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ÷ ఎన్నికైన మొత్తం ఎంపీల సంఖ్య
2017 రాష్ట్రపతి ఎన్నికల నాటికి దేశంలో 4,120 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. వీరి మొత్తం ఓటు విలువ 5,49,495.
పార్లమెంటులో లోక్‌సభ ఎంపీల సంఖ్య 543. రాజ్యసభ ఎంపీల సంఖ్య 233. రెండూ కలుపుకొని మొత్తం ఎంపీల సంఖ్య 776.
ఎంపీల ఓటు విలువ= 5,49,495 ÷ 776 = 708
 
(ఇది 2017 నాటి ఎంపీల సంఖ్య ప్రకారం వేసిన లెక్క. ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓటు విలువ కాస్త తగ్గే అవకాశం ఉంది. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్‌లో ఇంకా ఎన్నికలు జరగకపోవడమే ఇందుకు కారణం)

 
ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఓటు విలువ..
ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ స్థానాలు 25. రాజ్యసభ స్థానాలు 11.
ఈ లెక్కన ఏపీలో మొత్తం ఎంపీల సంఖ్య 36. అంటే వీరందరి ఓటు విలువ మొత్తం = 25,488
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ: 27,825 + 25,488 = 53,313

 
తెలంగాణ ఎంపీల ఓటు విలువ
తెలంగాణ లోక్‌సభ స్థానాలు 17. రాజ్యసభ స్థానాలు 7.
ఈ లెక్కన తెలంగాణలో మొత్తం ఎంపీల సంఖ్య 24.
వీరందరి ఓటు విలువ 24 X 708 = 16,992
తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ: 15,708 + 16,992 = 32,700

 
రాష్ట్రపతి ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు?
రాజ్యాంగంలోని ఆర్టికల్-324 ప్రకారం ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంది.

 
ఎన్నికల పద్ధతి ఎలా ఉంటుంది?
రాష్ట్రపతి ఎన్నికలు ప్రపోషనల్ రిప్రెజంటేషన్ పద్ధతిలో సింగిల్ ట్రాన్సఫరబుల్ ఓటింగ్ విధానంలో జరుగుతాయి. అంటే ఎన్నికలో ఓటర్ల అందరికీ ప్రాతినిధ్యం ఉండేలా చూస్తారు. సింగిల్ ట్రాన్సఫరబుల్ ఓటింగ్ విధానంలో ఒకరికంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్థులకు ఓటు వేస్తారు. ఉదాహరణకు A,B,C,D అనే నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని అనుకుందాం. అప్పుడు X అనే ఓటరు, ఆ నలుగురిలో ఒకరికి తొలి ప్రాధాన్యత ఓటు వేయాల్సి ఉంటుంది. X ఒకవేళ Cకి తొలి ప్రాధాన్యత ఓటు వేశారనుకుంటే A,B,Dలలో ఒకరికి రెండో ప్రాధాన్యతా ఓటు వేయాల్సి ఉంటుంది. Aకి రెండో ప్రాధాన్యత ఓటు వేస్తే B,Dలలో ఒకరికి మూడో ప్రాధాన్యత ఓటు వేస్తారు. Bకి మూడో ప్రాధాన్యత ఓటు పడితే Dకి నాలుగో ప్రాధాన్యత ఓటు లభిస్తుంది. ఇలా ప్రతి ఓటరూ తన ప్రయారిటీస్ ప్రకారం ఓటు వేస్తూ పోతారు.

 
విజేతను ఎలా నిర్ణయిస్తారు?
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలిచినట్లు కాదు. ఒక నిర్దేశిత కోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఈ కోటాను నిర్ణయించేందుకు పోలైన వ్యాలిడ్ ఓట్లను 2తో భాగిస్తారు. ఫలితంగా వచ్చే సంఖ్యకు ఒకటి యాడ్ చేస్తారు.
 
ఉదాహరణకు 1,00,000 వ్యాలిడ్ ఓట్లు పోలయ్యాయని అనుకుందాం.
కోటా= 1,00,000 ÷ 2 = 50,000 ⇒ 50,000+1 =50,001
అంటే ఈ ఉదాహరణలో ఒక అభ్యర్థి గెలవాలంటే 50,001 కన్నా ఎక్కువ ఓట్లు సాధించాలి.
ఒక అభ్యర్థికి తొలి ప్రాధాన్య ఓట్లు, కోటా కంటే ఎక్కువ వస్తే ఆ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి విజేతగా ప్రకటిస్తారు. లేదంటే మళ్లీ లెక్కింపు మొదలుపెడతారు.
తొలి ప్రాధాన్య ఓట్లు అత్యంత తక్కువ పొందిన అభ్యర్థిని తొలగించి, ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతారు. అప్పుడు ఎవరైతే కోటా కంటే ఎక్కువ ఓట్లు పొందుతారో వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. లేదంటే ఇంతకు ముందు చెప్పిన పద్ధతిలో మళ్లీ కౌంటింగ్ చేపడతారు. ఇలా ఎవరో ఒక అభ్యర్థి గెలిచే వరకు లెక్కింపు జరుగుతుంది.

 
రాష్ట్రపతి పదవికి ఎవరు అర్హులు?
రాజ్యాంగంలోని ఆర్టికల్-58 ప్రకారం రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి ఈ కింది అర్హతలుండాలి...
•భారతీయ పౌరులై ఉండాలి.
•35 సంవత్సరాలు వయసు పూర్తయ్యి ఉండాలి.
•లోక్‌సభకు ఎన్నిక కాగల అర్హతలుండాలి.
•కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో లేదా వాటి ఆధ్వర్యంలో నడిచే ఎటువంటి సంస్థల్లో కూడా లాభాదాయక పదవుల్లో నిర్వహిస్తూ ఉండకూడదు.

 
నామినేషన్ ఎలా వేస్తారు?
పోటీ చేసే అభ్యర్థులను ఎలక్టోరల్ సభ్యుల్లో 50 మంది ప్రతిపాదించాలి. ఆ ప్రతిపాదనను మరొక 50 మంది ఆమోదించాలి. ఈ జాబితాను అభ్యర్థులు ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. డిపాజిట్ కింద రూ.15,000 కట్టాలి.

 
పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుందా?
రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. సభ్యులు వారిక నచ్చినట్లు ఓటు వేయొచ్చు. పార్టీలు విప్ జారీ చేయడానికి లేదు.

 
నోటా ఉంటుందా?
లేదు.

 
ఈసారి ఆదివాసీ రాష్ట్రపతి వస్తారా?
ప్రస్తుతం పదవిలో ఉన్న ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ వయసు 76 ఏళ్లు. కాబట్టి ఆయనకు మరొకసారి బీజేపీ అవకాశం ఇవ్వకపోవచ్చు. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత కార్డు వాడిన బీజేపీ ఈసారి ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందో చూడాలి. ఆదివాసీ సముదాయానికి చెందిన వ్యక్తిని ఈసారి రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది గుజరాత్‌తో పాటు వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లో సుమారు 15శాతం, మధ్యప్రదేశ్‌లో 21శాతం, చత్తీస్‌గఢ్‌లో 30శాతం, రాజస్థాన్‌లో 13.5శాతం ఆదివాసీలున్నారు. భారత్‌లోని మొత్తం ఆదివాసీల జనాభాలో సుమారు 40 శాతం జనాభా ఈ అయిదు రాష్ట్రాలలోనే నివసిస్తోంది.

 
వెంకయ్యనాయుడుకి ప్రమోషన్ లభిస్తుందా?
దక్షిణ భారత్‌లో విస్తరించాలని కూడా బీజేపీ కోరుకుంటోంది. 2008లో తొలిసారి కర్నాటకలో అధికారం చేపట్టినా ఇంతవరకు దక్షిణ భారత్‌లోని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం చూపలేక పోతోంది. ఒకప్పుడు కేరళ మీద ప్రధానంగా దృష్టి పెట్టిన బీజేపీ, ఇప్పుడు తెలంగాణలో పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. వచ్చే ఏడాది తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ దక్షిణ భారత్‌లోని రాష్ట్రాలకు బీజేపీ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటే వెంకయ్యనాయుడుని రాష్ట్రపతిని చేసే అవకాశాలున్నాయి.

 
టీఆర్‌ఎస్ మళ్లీ సపోర్ట్ చేస్తుందా?
రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించాలంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకి కనీసం 549,452 ఓట్లు కావాలి. పార్లమెంటులో ఎన్‌డీఏకి 3.20 లక్షల ఓట్లు ఉండగా ప్రతిపక్షాలకు ఉన్నట్లు ఓట్లు 1.72 లక్షలు మాత్రమే. కానీ ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి ఎన్‌డీఏకు 2.22 లక్షల ఓట్లు ఉండగా ప్రతిపక్షాలకు 2.77 లక్షల ఓట్లు ఉన్నాయి. అంటే బీజేపీ మెజారిటీ సాధించాలంటే కొన్ని ఓట్లు అవసరమవుతాయి. గతంలో 2017లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎన్‌డీఏకు ఆధిక్యం లేదు. అప్పట్లో టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ, శివసేన, జేడీయూ వంటి పార్టీల మద్దతుతో రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి కాగలిగారు.

 
కానీ ఇప్పుడు బీజేపీ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భగ్గుమంటున్నారు. శివసేన బీజేపీకి దూరమైంది. బిహార్‌లో నితీశ్ కుమార్‌కు బీజేపీకి మధ్య దూరం పెరుగుతోందనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్‌డీఏ గెలవాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లేదా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అవసరం బీజేపీకి ఉంటుంది.

 
బీజేపీని జగన్ ఆదుకుంటారా?
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్‌డీఏ ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు జగన్. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సహకరించారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన అనేక బిల్లులకు కూడా వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు ఇస్తూ వచ్చింది. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడంలోనూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసినప్పుడు, వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు పార్లమెంటులో బీజేపీకి జగన్ అండగా నిలబడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ స్పష్టమైన వైఖరి తీసుకున్నట్లుగా కనిపిస్తోందని సీనియర్ జర్నలిస్టు భండారు శ్రీనివాసరావు అన్నారు.

 
‘కాంగ్రెస్‌కు బద్ధవ్యతిరేకి అయిన జగన్, 2012లో ఆ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చారు. ఆ తరువాత 2017లో రామ్ నాథ్ కోవింద్‌ను సపోర్ట్ చేశారు. అంటే కేంద్రంలో అధికారంలో ఎవరు ఉంటే వారికి మద్దతు ఇవ్వాలనే వైఖరిని జగన్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కాబట్టి ఈ సారి కూడా ఆయన ఎన్‌డీఏ‌కు మద్దతు ఇవ్వొచ్చు.’ అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రింట్ కథనం ప్రకారం ప్రస్తుతం ఎన్‌డీఏ మెజారిటీ సాధించాలంటే సుమారు 13,000 ఓట్లు కావాలి. జగన్ వద్ద సుమారు 27,825 ఎమ్మెల్యే ఓట్లు ఉన్నాయి. కాబట్టి జగన్ మద్దతు ఇస్తే బీజేపీ సులభంగా గట్టు ఎక్కుతుంది.

 
రాష్ట్రపతి ఎన్నికలను కేసీఆర్‌ వేదికగా ఉపయోగించుకుంటారా?
గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా తిరుగుతూ తనను తాను జాతీయ నాయకునిగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో చనిపోయిన పంజాబ్ రైతుల కుటుంబాలకు కేసీఆర్ పరిహారం ఇవ్వడం కూడా ఇందులో భాగమే. ఈ విధంగా చూస్తే జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు రాష్ట్రపతి ఎన్నికలను ఆయన ఒక వేదికగా ఉపయోగించుకోవచ్చు.

 
ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, మాజీ ప్రధాని దేవెగౌడ వంటి వారిని ఆయన కలిశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌లను కూడా త్వరలోనే కలిసే అవకాశం ఉంది. ‘ఫెడరల్ ఫ్రంట్ నేతగా ఉన్న కేసీఆర్‌, బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దుతు ఇచ్చే అవకాశాలు లేవు. అలా ఇస్తే ఫెడరల్ ఫ్రంట్‌లోని ఇతర పార్టీల నుంచి ఆయన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల్లో బీజేపీని వ్యతిరేకించడం లేదా గైర్హాజరు కావడమో టీఆర్‌ఎస్ చేయాల్సి ఉంటుంది.’ అని భండారు శ్రీనివాసరావు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments