Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - చైనా ఉద్రిక్తతలు: చైనా మైక్రోవేవ్‌ ఆయుధాలను ఉపయోగించిందా? అసలీ మైక్రోవేవ్ ఆయుధాలేమిటి?

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (15:10 IST)
లద్ధాఖ్‌లో చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) మైక్రోవేవ్‌ ఆయుధాలను ఉపయోగించినట్లు ఆన్‌లైన్‌ మీడియాలో ప్రచారమవుతున్న కథనాలను భారత సైన్యం మంగళవారంనాడు తోసి పుచ్చింది. “తూర్పు లద్ధాఖ్‌లో చైనా మైక్రోవేవ్ ఆయుధాలను ప్రయోగించింది అన్న మీడియా రిపోర్టులు నిరాధారం. అవి ఫేక్‌న్యూస్‌’’ అని ఇండియన్‌ ఆర్మీ అదనపు డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ (ఏడీజీపీఐ) తన అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ప్రకటించింది.

 
ఈ విషయంలో చైనావైపు నుంచి జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని రక్షణ నిపుణుడు, ఇండియన్‌ డిఫెన్స్‌ రివ్యూ అసోసియేట్‌ ఎడిటర్‌ కల్నల్‌ దాన్‌వీర్‌ సింగ్‌ అన్నారు. “మైక్రోవేవ్‌ ఆయుధాలన్నీ సరళరేఖలో ప్రయాణిస్తాయి. భారత-చైనా సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల్లో వాటిని ఉపయోగించడం సాధ్యం కాదు. ఇందులో లాజిక్‌ లేదు. ఇది చైనా చేసుకుంటున్న ప్రచారం’’ అని ఆయన అన్నారు. రక్షణ వ్యవహరాలను కవర్‌ చేసే జర్నలిస్ట్‌ రాహుల్‌ బేదీ కూడా “ ఇది ఫేక్‌న్యూస్‌లాగా ఉంది. అంతా చైనా ప్రచారంలా కనిపిస్తోంది. ఇందులో విశ్వసనీయత లేదు” అని అన్నారు.

 
ఉద్రిక్తతలు
భారత, చైనాల మధ్య తూర్పు లద్ధాఖ్‌లో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల సమయంలో చైనా ఆర్మీ ఈ మైక్రోవేవ్‌ ఆయుధాలను ఉపయోగించిందని, కొన్ని పర్వత శిఖరాల మీద ఉన్న భారత సైన్యాన్ని వెనక్కి పంపడానికి వీటిని వాడిందని చైనా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. చైనాలోని రెన్‌మిన్‌ యూనివర్సిటీ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌ జిన్‌ కెన్రాంగ్‌ వ్యాఖ్యలను ఉటంకిస్తూ చైనా మీడియాలో ఈ మైక్రోవేవ్‌ ఆయుధ ప్రయోగం గురించి ప్రచారం జరిగింది.

 
ఈ ఆయుధాలను ఉపయోగించడం ద్వారా రెండు పర్వతాలను చైనా భారత సైన్యం నుంచి తిరిగి తీసుకోగలిగిందని, ఆ కొండలపై ఉన్న సైనికులపై డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్‌(డీఈడబ్ల్యూ)లను ప్రయోగించిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. జిన్‌ కెన్రాంగ్‌ చెప్పినదాని ప్రకారం ఈ ఆయుధాలు ప్రయోగించగానే, పర్వత శిఖరాల మీద ఉన్న సైనికులు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. వారు 15 నిమిషాలు కూడా అక్కడ ఉండలేకపోయారు. భారత సైనికులను వెనక్కి పంపి చైనా సైన్యం ఆ పర్వతాలను స్వాధీనం చేసుకుంది.

 
ఈ సమయంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సైనికులు తుపాకీ గుండ్లు పేల్చలేదని, భారత-చైనాలు పరస్పరం కాల్పులు జరపుకోరాదన్న నియమాన్ని వారు పాటించారని కెన్రాంగ్‌ అన్నారు. ఆగస్టు 29న ఈ సంఘటన జరిగిందని కెన్రాంగ్‌ పేర్కొన్నారు. వేర్వేరు కారణాల వల్ల రెండు దేశాలు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.

 
మైక్రోవేవ్ ఆయుధాలంటే ఏంటి ?
మైక్రోవేవ్‌ ఆయుధాలనే డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్‌ (డీఈడబ్ల్యూ) అని కూడా అంటారు. ఈ మైక్రోవేవ్‌లు విద్యుదయస్కాంత వికిరణ రూపాలు. వాటి వేవ్‌లెంగ్త్‌ (తరంగదైర్ఘ్యం) ఒక మి.మీ నుండి ఒక మీటర్ వరకు మారుతుంది. వాటి ఫ్రీక్వెన్సీ (పౌనఃపున్యం) 300 మెగాహెర్జ్‌ (100 సెం.మీ) నుంచి 300 మెగాహెర్జ్‌ (0.1 సెం.మీ) మధ్య ఉంటుంది. వీటిని హై-ఎనర్జీ రేడియో ఫ్రీక్వెన్సీలు అని కూడా అంటారు.

 
“మన ఇంట్లో మైక్రోవేవ్‌ అవెన్‌ పని చేసే తీరుగానే వీటి పని తీరు కూడా ఉంటుంది. వేడిని ఉత్పత్తి చేసే ఈ తరంగాలు ఆహారం గుండా వెళతాయి. ఈ ఆయుధాలు కూడా అదే సూత్రంపై పని చేస్తాయి” దాన్‌వీర్‌ సింగ్‌ వెల్లడించారు. అయితే అంత ఎత్తులో ఉన్న సైనికులపై దాడికి మైక్రోవేవ్‌లను తయారు చేసే మాగ్నెట్రాన్‌ ఏ సైజులో ఉండాలో ఎవరైనా ఊహించుకోవచ్చని దాన్‌వీర్‌ సింగ్‌ అన్నారు.

 
“అయినా మైక్రోవేవ్‌ తరంగాలను పంపి మనకు హాని చేస్తే మనం ఖాళీగా కూర్చుంటామా? మనం తీసుకునే చర్యలు మనకు ఉంటాయి” అని దాన్‌వీర్‌ సింగ్‌ అన్నారు. "ఇది ఖచ్చితంగా సాధ్యమయ్యే పని కాదు. చిన్నస్థాయిలో జరగొచ్చు. కానీ వారు చెప్పుకునే స్థాయిలో మాత్రం అసాధ్యం" అని సింగ్ చెప్పారు. మైక్రోవేవ్‌ ఆయుధాలు అర్ధంలేని మాటని, ఖర్చుపరంగా కూడా ఇది చాలా పెద్ద విషయమని దాన్‌వీర్‌ సింగ్‌ అన్నారు.

 
లేజర్ ఆధారిత ఆయుధాలు
చైనా ఆ ఆయుధాలను వాడిందా లేదా అన్నది పక్కనబెట్టినా, ఈ తరహా యుద్ధాలకు ఆస్కారముందని జర్నలిస్ట్‌ రాహుల్ బేదీ చెప్పారు. “దీన్నే నాన్‌-కాంటాక్ట్ వార్‌ఫేర్‌ అంటారు. ఇందులో ఫిరంగి గుండ్లు, బుల్లెట్లు, ట్యాంకులు ఉపయోగించరు. వాటికి బదులు అతినీలలోహిత కిరణాలను వాడతారు. అయితే చైనా వాటిని వాడిందనడం నిజం కాదు" అన్నారు. ఈ తరహా ఆయుధాల తయారీపై డీఆర్‌డీవో కూడా పని చేస్తుందని బేదీ చెప్పారు. “చైనా ఈ ఆయుధాలను ఏ దశలో డెవలప్‌ చేస్తోందో తెలియదు. కానీ భవిష్యత్తులో ఈ ఆయుధాలు వాస్తవరూపం దాల్చవచ్చు” అని బేదీ అన్నారు.

 
“లేజర్‌ బేస్డ్ ఆయుధాలు ఇప్పటికే ఉన్నాయి. అల్లర్లను నియంత్రించడంలాంటి పనులకు ఈ లేజర్‌ను ఉపయోగిస్తారు. అయితే భారీస్థాయిలో లేజర్‌ ఆయుధాలను వాడటం ఆచరణ సాధ్యం కాదు’’ అని దాన్‌వీర్‌ సింగ్‌ చెప్పారు. 19వ శతాబ్దం చివరలో ఈ డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్స్‌పై పరిశోధన ప్రారంభమైంది. 1930లో రాడార్‌ కనుగొనడంతో ఈ దిశగా గణనీయమైన పురోగతి సాధ్యమైంది. ఇలీన్‌ ఎం.వాలింగ్‌ రాసిన ‘హైపవర్‌ మైక్రోవేవ్స్‌: స్ట్రాటజిక్‌ అండ్‌ ఆపరేషనల్‌ ఇంప్లికేషన్స్‌ ఫర్‌ వార్‌ఫేర్‌’ అనే పుస్తకంలో ఈ ఆయుధాల గురించి సవివరంగా ఉంది.

 
ఇప్పుడు ఇంజినీర్లు, సైంటిస్టులు ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌పై పని చేస్తున్నారు. ఇందులో విద్యుత్‌ స్థాయిని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ‘డైరెక్టెడ్ ఎనర్జీ' అనేదాన్ని ఒకప్పుడు సైన్స్‌ఫిక్షన్‌గా భావించేవారు. ఇప్పుడది అది రియాలిటీగా మారింది. భారతదేశంలోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్స్‌ మీద కూడా పని చేస్తోంది. ఈ డైరెక్టెడ్‌ ఎనర్జీ ఆయుధాలు లక్ష్యాన్ని కేంద్రీకృత శక్తితో ఢీకొని నాశనం చేస్తాయి. సంప్రదాయ ఆయుధాలకంటే ఇవి శక్తివంతంగా పని చేస్తాయి. వీటి నుంచి వచ్చే రేడియేషన్‌ ఎవరికీ కనిపించదు. అలాగే ధ్వని ఉండదు. కాబట్టి వీటిని రహస్యంగా ప్రయోగించడం సులభం లేజర్ లేదా మైక్రోవేవ్ ఆధారిత హై-పవర్ డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాలు శత్రువుల డ్రోన్లు, క్షిపణులను కూడా నిలువరిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments