Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇమ్రాన్ ఖాన్: ప్లేబాయ్ నుంచి పాకిస్తాన్ ప్రధాని వరకూ...

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (14:09 IST)
మాజీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానమంత్రిగా తన పదవిని కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అవినీతిపై పోరాడతానని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని చెబుతూ 2018లో ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ, ఆయన హామీలన్నీ హామీలుగానే ఉండిపోయాయి. ప్రస్తుతం పాకిస్తాన్‌ను ఆర్థిక సంక్షోభంతోపాటు రాజకీయ సంక్షోభం కూడా ముంచెత్తింది.

 
గత మార్చిలో పాకిస్తాన్‌లో వరుస పరిణామాల నడుమ పార్లమెంటులో ఆయన ఆధిక్యాన్ని కోల్పోయారు. తన పార్టీ పాకిస్తాన్ తహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన కొందరు సభ్యులపై అనర్హత వేటుతోపాటు కొన్ని పార్టీలు తమ కూటమి నుంచి వెళ్లిపోవడంతో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు అవసరమైన ఆధిక్యం కోల్పోయారు. దీంతో శనివారం జరిగే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నుంచి ఆయన గట్టెక్కడం కష్టమే. మరోవైపు సైన్యం మద్దతును కూడా ఆయన కోల్పోయారని వార్తలు వస్తున్నాయి. అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్‌లో అధికారంలో కొనసాగాలంటే సైన్యం మద్దతు చాలా కీలకం.

 
కొత్త పాకిస్తాన్‌ను నిర్మిస్తానని..
2018లో ‘‘కొత్త పాకిస్తాన్‌’’ను నిర్మిస్తానని చెబుతూ ఇమ్రాన్ ఖాన్ ఎన్నికలకు వెళ్లారు. అంతకుముందు వరకు అక్కడ బలంగా వేళ్లూనుకున్న పార్టీలదే అక్కడ అధికారం. అయితే, తనను తాను పేదరిక నిర్మూలన ఉద్యమకారుడిగా ఇమ్రాన్ ఖాన్ పరిచయం చేసుకున్నారు. ‘‘ఇస్లామిక్ వెల్ఫేర్ స్టేట్’’ను నిర్మిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దేశంలోని పన్ను వ్యవస్థ, అధికార యంత్రాంగంలలో సమూల మార్పులు తీసుకొస్తానని ఆయన అన్నారు.

 
అయితే, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. పాకిస్తానీ రూపాయి ఘోరంగా పతనమైంది. దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను ఇమ్రాన్ సరిగ్గా నడపలేకపోయారని నేడు ఇమ్రాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సాయం ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోనని ఆయన అన్నారు. కానీ, ఆర్థిక సంక్షోభం నడుమ ఐఎంఎఫ్‌తో ఆరు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీకి చర్చలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది.

 
ప్రజాదరణ ఎక్కువగా ఉన్న నాయకుల్లో ఒకరు
పాకిస్తాన్‌తోపాటు అంతర్జాతీయంగానూ ప్రజాదరణ ఎక్కువగానున్న నాయకుల్లో 69ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఒకరు. అయితే, ప్రజాదరణను ఎన్నికల ఫలితాల రూపంలో మార్చుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. 1996లోనే ఆయన పీటీఐను స్థాపించారు. అయితే, 2013 తర్వాతే పాకిస్తాన్‌లో ప్రధాన పార్టీల్లో ఒకటిగా దీనికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఐదేళ్లకు ఆయనకు ప్రధాన మంత్రయ్యే అవకాశం దక్కింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కంచుకోటైన పంజాబ్ ప్రావిన్స్‌లో పీటీఐ భారీగా సీట్లు దక్కించుకుంది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలోని 272 సీట్లలో సగం కంటే ఎక్కువ ఇక్కడ ఉన్నాయి.

 
ఇమ్రాన్ ఖాన్‌ను అక్కడి ప్రజలు మార్పుకు ప్రతీకగా భావించారని, రాజకీయాల్లో మార్పుకు ఆయనతో నాంది పడుతుందని విశ్లేషణలు కూడా వచ్చాయి. మరోవైపు సైన్యం మెచ్చిన నాయకుడనే ముద్ర కూడా ఇమ్రాన్ ఖాన్‌పై ఉండేది. అయితే, ఇప్పుడు సైన్యంతో ఆయనకు విభేదాలు వచ్చాయనే వార్తలు బలంగా వినిపించాయి. కానీ, ఇటు సైన్యం, అటు పీటీఐ ఈ వార్తలను ఖండించాయి. కానీ, సైన్యంలోని ప్రధాన యంత్రాంగం మద్దతు కోల్పోవడంతోనే ప్రస్తుతం ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇక్కడ సైన్యం ఆధిపత్యమే ఎక్కువ.

 
ఇదివరకు పాకిస్తాన్‌లో వేళ్లూనుకున్న సమస్యలకు పరిష్కరిస్తామని ముందుకు వచ్చిన కొందరు రాజకీయ నాయకులు సైన్యానికి ఎదురెళ్లారు. ఫలితంగా వారి ప్రభుత్వాలు కుప్పకూలాయి. ఇప్పటివరకు ఇక్కడ ఒక్క ప్రభుత్వం కూడా తమ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేదు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్‌ పార్టీకి మిత్ర పక్షాలు కూడా తక్కువే. వంశపారంపర్య రాజకీయాలను పారద్రోలుతానని హామీ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్.. అవినీతి ఆరోపణలతో జైలు పాలైన చాలా మంది నాయకులతో దోస్తీ చేశారు. ఇప్పుడు ఆయన్ను అధికారం నుంచి దించేందుకు ఆయన ప్రత్యర్థులంతా ఏకమయ్యారు.

 
ప్లేబాయ్‌గా...
ఇమ్రాన్ ఖాన్ 1952లో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ ఇంజినీర్. ఇమ్రాన్‌కు నలుగు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఇమ్రాన్ ప్రాథమిక విద్యాభ్యాసం లాహోర్‌లో జరిగింది. ఆ తర్వాత ఆయన ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు. కాలేజీ రోజుల్లోనే తనకు క్రికెట్‌పైనున్న ఇష్టాన్ని ఇమ్రాన్ గుర్తించారు. రెండు దశాబ్దాల క్రికెట్ ప్రస్థానంలో ఆయన ఎన్నో విజయాలు సాధించారు. 1992 వరల్డ్ కప్ విజయం వీటిలో ప్రధానమైనది. వయసులో ఉన్నప్పుడు ప్లేబాయ్‌గా ఇమ్రాన్ పేరు గడించారు. ఆల్కహాల్ తాగుతారనే ఆరోపణలను ఆయన ఎప్పుడూ ఖండించలేదు. 1992లో వరల్డ్ కప్ విజయం తర్వాత, క్రికెట్ నుంచి ఆయన రిటైర్ అయ్యారు. ఆ తర్వాత మిలియన్ డాలర్లతో తన తల్లి జ్ఞాపకార్థం ఓ క్సాన్సర్ ఆసుపత్రిని కూడా నిర్మించారు. ఆయన సేవా కార్యక్రమాల నుంచి క్రమంగా రాజకీయాలవైపు అడుగులు వేశారు.

 
ముగ్గురు భార్యలు
1995లో 43ఏళ్ల వయసులో 21ఏళ్ల బ్రిటిష్ యువతి జెమీమా గోల్డ్‌స్మిత్‌ను ఇమ్రాన్ వివాహం చేసుకున్నారు. ఆనాటి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన సర్ జేమ్స్ గోల్డ్‌స్మిత్ కుమార్తె జెమీమా. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, 2004లో జెమీమా నుంచి ఇమ్రాన్ విడాకులు తీసుకున్నారు. 2015లో ఇమ్రాన్‌కు రెండో వివాహమైంది. బీబీసీ ప్రెజెంటర్ రెహం ఖాన్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి కథ ఏడాది పూర్తవ్వకముందే ముగిసిపోయింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు తనను చాలా కష్టాలపాలు చేశారని ఆ తర్వాత ఆమె వెల్లడించారు. 

 
2018లో పరిమిత అతిథుల నడుమ బుష్రా వట్టోను ఇమ్రాన్ మూడో పెళ్లి చేసుకున్నారు. బుష్రాకు అంతకుముందే, ఐదుగురు సంతానం ఉన్నారు. ఇస్లాం మతానికి సంబంధించిన అంశాల్లో ఇమ్రాన్‌కు బుష్రా మార్గదర్శిగా ఉండేవారు. ఇస్లాం పట్ల తన విధేయత గురించి ప్రజలకు తెలియజేయడంలో ఈ వివాహం ప్రధాన పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.

 
‘‘తాలిబాన్ ఖాన్’’
ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగా లిబరలిజానికి మద్దతు పలుకుతారు. అదే సమయంలో ఇస్లాం అనుకూల, పశ్చిమ దేశాల వ్యతిరేక విధానాలనూ ఆయన ప్రోత్సహిస్తారు. తాలిబాన్లకు అనుకూలంగా పనిచేస్తారనే ముద్ర ఇమ్రాన్‌పై ఉంది. ఆయన్ను ప్రత్యర్థులు ‘‘తాలిబాన్ ఖాన్’’అని పిలుస్తుంటారు. 2020లో ఒసామా బిన్ లాడెన్‌ను అమరుడని ఇమ్రాన్ అభివర్ణించారు. దీంతో రాజకీయ దుమారమే చెలరేగింది. పశ్చిమ దేశాలతో మంచి సంబంధాలుండే పాకిస్తాన్‌ను ఇమ్రాన్ ఖాన్ చైనాకు చేరువగా తీసుకెళ్లారు. ఉగ్రవాదంపై ఇమ్రాన్ సరైన చర్యలు తీసుకోలేదని కూడా చెబుతుంటారు. మరోవైపు యుక్రెయిన్‌పై దాడి విషయంలో రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటు వేసేందుకు కూడా పాకిస్తాన్ నిరాకరించింది.

 
తమకు ప్రత్యర్థిగా భావించే భారత్‌తో సంబంధాలు ఇమ్రాన్ హయాంలో మెరుగుపడలేదు. అయితే, కోవిడ్-19కు కళ్లెం వేయడంలో తాము విజయం సాధించామని ఇమ్రాన్ ఖాన్ చెబుతుంటారు. దక్షిణాసియాలో తామే మెరుగ్గా కరోనావైరస్‌ను తట్టుకుని నిలబడగలిగామని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు తమ పేదరిక నిర్మూలన పథకాలు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన చెబుతుంటారు. పాకిస్తాన్‌లోని రెండు ప్రావిన్సుల్లో అందరికీ ఆరోగ్య సంరక్షణ పథకాలు ఆయన విజయంగా చెప్పుకోవచ్చు. త్వరలో ఎన్నికలు జరిగితే ఈ పథకాలతో ఆయనకు కొంతవరకు మేలు జరిగే అవకాశముంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments