అమెరికా 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాన్ని 2016 ఎన్నికల్లో పోటీచేసిన విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ తోసిపుచ్చడం లేదు. ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నాయకుడు డోనల్డ్ ట్రంప్‌ను ఎదుర్కోవాలనే తీవ్రమైన ఒత్తిడి తనపై ఉందని ఆమె బీబీసీతో చెప్పారు.
ప్రస్తుతం హిల్లరీ వయసు 72 ఏళ్లు. కుమార్తె చెల్సియా క్లింటన్‌తో కలసి తాను రాసిన 'ద బుక్ ఆఫ్ గట్సీ విమెన్' ప్రచార కార్యక్రమం నిమిత్తం బ్రిటన్‌లో పర్యటిస్తున్న హిల్లరీని 'బీబీసీ రేడియో 5 లైవ్' కార్యక్రమంలో జర్నలిస్టు ఎమ్మా బార్నెట్ ఇంటర్వ్యూ చేశారు.
అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీచేస్తారా అని అడగ్గా- 2016 ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించి అధ్యక్ష పదవిని చేపట్టి ఉంటే, తన పరిపాలన ఎలా ఉండేది, అమెరికా కోసం, ప్రపంచం కోసం ఏం చేయగలిగేదాన్ని అనే విషయాలు ఎప్పుడూ ఆలోచిస్తుంటానని హిల్లరీ చెప్పారు.
మళ్లీ పోటీ చేయాలని, దీని గురించి ఆలోచించాలని చాలా మంది నుంచి ఒత్తిడి వస్తోందని తెలిపారు. వారు ఎవరనేది ఆమె వెల్లడించలేదు. మళ్లీ పోటీచేయడాన్ని కొట్టిపారేయలేననే అర్థంలో హిల్లరీ సమాధానం ఇచ్చారు.
అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో అన్నింటినీ అస్తవ్యస్తం చేశారని, వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచినా, వీటిని చక్కదిద్దడానికి చాలా శ్రమించాల్సి ఉంటుందని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాది ఉంది. అయితే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఇప్పటికే 17 మంది పోటీపడుతున్నారు. వీరిలో మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్, సెనేటర్లు బెర్నీ సాండర్స్, ఎలిజబెత్ వారెన్ ముందంజలో ఉన్నారు.
డెమొక్రటిక్ అభ్యర్థిత్వం కోసం న్యూయార్క్ మాజీ మేయర్ మైకేల్ బ్లూంబర్గ్ కూడా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించాలని తాము కోరుకొంటున్నామని, ప్రస్తుతం డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీపడుతున్నవారు ట్రంప్‌ను ఓడించేంత బలంగా లేరని మైకేల్ బ్లూంబర్గ్ ఆందోళన చెందుతున్నారని బ్లూంబర్గ్ సలహాదారుడు హోవర్డ్ వోల్ఫ్‌సన్ ఒక ప్రకటనలో చెప్పారు.
అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీచేయాలని హిల్లరీని గత నెల్లో అధ్యక్షుడు ట్రంప్ సవాల్ చేశారు. ఆమె స్పందిస్తూ- "నన్ను కవ్వించొద్దు, నీ పని నువ్వు చెయ్యి" అని బదులిచ్చారు.
హిల్లరీ భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ గత నెల్లో వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ- ఆమె పోటీచేయొచ్చు, పోటీచేయకపోవచ్చు అని చెప్పారు. అప్పుడు హిల్లరీ ఆయన పక్కనే ఉన్నారు.
హిల్లరీ పోటీపడతారా లేదా అనే అంశంపై అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. క్లింటన్ దంపతుల వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయి.