Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశంలో సెకండ్ వేవ్ పీక్‌ స్టేజ్‌కు చేరిందా? కేసులు తగ్గుముఖం పట్టడం దేనికి సూచిక?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (20:19 IST)
భారత్‌లో మే 28 వరకు మొత్తం 2.75 కోట్ల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత సెకండ్ వేవ్‌లో ఆసుపత్రులు మందులు, ఆక్సిజన్ కొరతతో తీవ్రంగా సతమతమయ్యాయి. ఈ పరిస్థితి భారతదేశ వైద్య రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. కానీ, ఇన్ఫెక్షన్లు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏప్రిల్ 14 తరువాత తొలిసారి సోమవారం(మే 24) కేసుల సంఖ్య 2,00,000 కంటే తగ్గింది. శుక్రవారం (మే 28) కూడా 1,86,364 కేసులు నమోదయ్యాయి. ఇది దేశంలో కోవిడ్ ఉద్ధృతి తగ్గుతోందనడానికి సూచన అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

 
సెకండ్ వేవ్ ముగుస్తోందా ?
జాతీయ స్థాయిలో సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. "సెకండ్ వేవ్‌లో నమోదైన కేసుల వారపు సగటు అత్యధికంగా 3,92,000 కాగా, గత రెండు వారాల నుంచి ఆ సగటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది" అని హెల్త్ ఎకనమిస్ట్ డాక్టర్ రిజో ఎం. జాన్ చెప్పారు. కానీ, ఇక్కడొక ముఖ్యమైన అంశం ఉంది.

 
దేశం మొత్తం మీద నమోదవుతున్న కేసుల ఆధారంగా సెకండ్ వేవ్ తగ్గుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలలో మాత్రం ఈ పరిస్థితి లేదు. దిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కేసులు తక్కువ అవుతున్నప్పటికీ తమిళనాడులో మాత్రం కేసులు పెరుగుతున్నాయి. తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితిపై స్పష్టత లేదు. "ఈ కేసుల తీవ్రత అన్ని చోట్లా ఒకే విధంగా లేదు. ఇంకా చాలా రాష్ట్రాలు రోజువారీ నమోదవుతున్న కేసుల్లో పీక్ స్థాయిని కనిపెట్టాల్సి ఉంది" అని డాక్టర్ జాన్ అన్నారు.

 
‘‘చాలా నగరాల్లో ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడి చర్యలు తగినంత లేకపోవడంతో మొత్తం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా కేసులు ఇంకా పీక్ స్థాయికి చేరి ఉండకపోవచ్చు కానీ, ప్రస్తుతం కేసులు గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపిస్తున్నాయి. ఇవి లెక్కలకు అందని కేసులు" అని లండన్‌లోని మిడిల్ సెక్స్ యూనివర్సిటీలో గణిత శాస్త్ర నిపుణులు డాక్టర్ మురాద్ బెనర్జీ చెప్పారు.

 
"ప్రస్తుతం దేశవ్యాప్తంగా తగ్గుతున్న కేసుల సంఖ్య తీరును పూర్తి స్థాయిలో అంచనా వేసి, ఇది ఇలాగే కొనసాగుతుందా లేదా అనేది చెప్పడం కష్టం" అని చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమటికల్ సైన్సెస్‌లో శాస్త్రవేత్త డాక్టర్ సితాభ్ర సిన్హా చెప్పారు. ఈ అభిప్రాయంతో మిషిగన్ యూనివర్సిటీ బయో స్టాటిస్టిషియన్ భ్రమర్ ముఖర్జీ ఏకీభవించారు. "కొన్ని రాష్ట్రాలు అసలైన ముప్పు స్థాయిలోకి ప్రవేశిస్తున్న సమయంలో పీక్ స్థాయి దాటిపోయిందనే ఆలోచన ఒక తప్పుడు భద్రత భావనను కలుగ చేస్తుంది" అని ఆమె అన్నారు. ఏ రాష్ట్రమూ పూర్తిగా సురక్షితం కాదనే విషయం స్పష్టంగా చెప్పాలి" అని ఆమె అన్నారు.

 
వైరస్ పునరుత్పత్తి సంఖ్య వల్ల ఏమన్నా తెలుస్తుందా?
ఆర్‌ఓ, ఆర్ నంబర్ అని పిలిచే వైరస్ పునరుత్పత్తి సంఖ్య ఆధారంగా ఆ రోగం వ్యాప్తి సామర్థ్యాన్ని.. అంటే, ఇన్ఫెక్షన్ సోకిన ఒక వ్యక్తి నుంచి సగటున ఎంత మందికి వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని అంచనా వేస్తారు. అయితే, ఆర్‌ఓని మహమ్మారి జనాభాలో కనిపించిన సమయంలో లెక్కించగా, ఆర్ విలువను మహమ్మారి బాగా వ్యాప్తి చెంది సగం మంది కోలుకున్న తర్వాత లెక్కిస్తారు.

 
"మే 9న భారతదేశంలో ఆర్ విలువ 1 కంటే కిందకు పడిపోయింది" అని డాక్టర్ సిన్హా చెప్పారు. "రానున్న వారాల్లోనూ ఇదే పంథా కొనసాగితే, కేసుల సంఖ్య బాగా పడిపోయే అవకాశం ఉంది" అని డాక్టర్ సిన్హా అన్నారు. కానీ, సెకండ్ వేవ్ అంతా ఆర్ విలువ దేశంలో ఎప్పుడూ 1కి దగ్గరగానే ఉంది. దాంతో, మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది" అని ఆయన అన్నారు. "ఆర్ సంఖ్య అధికంగా ఉండి, యాక్టివ్ కేసుల సంఖ్య తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడున్న కేసులను సరిగ్గా అరికట్టక పోతే కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉంది" అని అన్నారు.

 
మొదటి వేవ్‌లో కేసుల సంఖ్య తగ్గడం సెప్టెంబరు చివరి వారం నుంచి నెమ్మదిగా మొదలైంది. ఇదే పంథా ఫిబ్రవరిలో సెకండ్ వేవ్ మొదలయ్యే వరకు కొనసాగింది. కానీ, సెకండ్ వేవ్‌లో కేసులు తగ్గడం త్వరగా మొదలయింది. దీనికి గల కారణాల పై స్పష్టత లేదు. జనాభాలో ఎక్కువ మందికి వైరస్ వ్యాప్తి చెందడం వల్ల ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
కానీ, గతంలో ఇన్ఫెక్షన్ సోకిన వారికి కూడా తిరిగి సోకగలిగే వైరస్ స్ట్రెయిన్‌లు రెండో వేవ్‌లో కనిపించాయి.

 
మే చివరి నాటికి కేసులు 1,50,000 - 2,00,000 కి చేరుతాయని జులై చివరి నాటికి ఫిబ్రవరి నాటి పరిస్థితి నెలకొంటుందని తన నమూనాలు సూచిస్తున్నాయని డాక్టర్ ముఖర్జీ చెప్పారు. అయితే, వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్‌లను సడలించే విధానాలపైనా ఈ కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుందని అన్నారు. లాక్ డౌన్‌లను తొలగించటానికి కనీసం 14 రోజుల ముందు వరకు పాజిటివ్ రేటు 5, అంతకంటే తక్కువ శాతం ఉండాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. భారతదేశం విషయానికొస్తే ప్రతి రోజూ 18 లక్షల శాంపిళ్లను పరీక్షించగలిగినప్పుడు, రోజుకు 90,000 కేసులు నమోదైతే దానిని 5 శాతం పాజిటివ్ రేటు అనవచ్చు. "పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయి అని చెప్పడానికి అది ఆరోగ్యకరమైన సంకేతం" అని ఆమె అన్నారు.

 
పెరుగుతున్న మరణాల సంగతేంటి?
అమెరికా, బ్రెజిల్ తర్వాత 3,00,000 కు పైగా మరణాలు నమోదైన దేశాల్లో భారత్‌ది మూడో స్థానం. చాలా మరణాలను అధికారికంగా లెక్కించకపోవడంతో మరణాల సంఖ్య మరింత ఎక్కువ ఉండవచ్చని భావిస్తున్నారు. మరణాల సంఖ్య పీక్ స్థాయికి ఇంకా చేరలేదని డాక్టర్ బెనర్జీ చెప్పారు. కేసుల సంఖ్య లాగే, మరణాల సంఖ్య నమోదులోనూ రాష్ట్రాల మధ్య.. గ్రామీణ, నగర ప్రాంతాల మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. "గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో చోటు చేసుకుంటున్న మరణాల సంఖ్య తగ్గేవరకు కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది" అని డాక్టర్ బెనర్జీ అన్నారు. మే మధ్య నుంచి జూన్ లోపు మరిన్ని మరణాలు చోటు చేసుకుంటాయని డాక్టర్ ముఖర్జీ అన్నారు. ఈ సమయంలో 1,00,000 మరణాలు చోటు చేసుకోవచ్చని ఆమె భావిస్తున్నారు.

 
ఇతర దేశాలతో పోలిస్తే, ఇండియాలో సెకండ్ వేవ్ ఎలా ఉంది?
యూకే, అమెరికాలలో తలెత్తిన సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్‌లు వేగంగా పెరిగి, తగ్గాయి. రెండు దేశాల్లో జనవరి మొదట్లో కేసులు పెరిగాయి. "ఇతర దేశాల్లో సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన విధానంతో ఇక్కడ పరిస్థితిని పోల్చడం సరైన విధానం కాదు." అని డాక్టర్ సిన్హా అన్నారు. యూరప్‌లో చాలా చోట్ల సెకండ్ వేవ్ నవంబరు- జనవరి మధ్యలో వచ్చింది. ఇది సాధారణంగా ఆ దేశాల్లో ఫ్లూ వ్యాపించే కాలం.

 
సాధారణ సమయంలోనూ ఆ సీజన్‌లో ఆయా దేశాల్లో చాలా మంది శ్వాసకోశ సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. దాంతో అక్కడ కేసులు పెరగడం ఊహించని పరిణామం కాదు. సెకండ్ వేవ్‌లో వివిధ దేశాల్లో వివిధ విధాలుగా కేసులు తగ్గడం కనిపించింది. జర్మనీలో తొలి వేవ్‌లో పీక్‌తో పోల్చితే రెండో వేవ్‌లో పీక్ నుంచి కేసులు తగ్గడం నెమ్మదిగా సాగిందని డాక్టర్ సిన్హా చెప్పారు. ఫ్రాన్స్‌లో రెండు వేవ్‌లలోనూ కేసులు తగ్గుముఖం పట్టిన తీరు ఒకేలా ఉంది. "ప్రపంచంలో సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన ఏ సూత్రీకరణనూ భారత్ విషయంలో పోల్చడానికి వీలవుతుందని నేననుకోవడం లేదు" అని ఆయన అన్నారు.

 
భవిష్యత్తులో ఏమి జరగుతుంది ?
భారతదేశంలో సెకండ్ వేవ్ లాక్ డౌన్లను సడలించే ముందు వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇండోర్ డైనింగ్, కాఫీ షాపులు, పబ్‌లు, జిమ్‌లు, అధిక ముప్పు పొంచి ఉన్న ఇతర ప్రాంతాలను తెరవడం వాయిదా వేయాలి. "బహిరంగ స్థలాల్లో 10 మంది కంటే తక్కువ మందితో మాత్రమే సమావేశాలకు అనుమతి ఇవ్వాలి. ఏసీ హాళ్లలో జరిపే భారీ వివాహాలు వైరస్‌కి నివాసాలు" అని డాక్టర్ ముఖర్జీ అన్నారు.

 
అన్నిటి కంటే ముఖ్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పుంజుకుని, మొబైల్, మూకుమ్మడి వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టాలి. రియల్ టైం ఎపిడెమియాలాజికల్, సీక్వెన్సింగ్ డేటా సహాయంతో.. ఇన్ఫెక్షన్‌‌లో వచ్చే కొత్త వేరియంట్‌లను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి" అని నిపుణులు చెబుతున్నారు. శాంపిళ్లను పూల్ చేసి పరీక్షలు చేయడంతో పాటు మురికి నీటిని పరీక్ష చేసి వైరస్‌ను విశ్లేషించే అవకాశాలను కూడా పరిశీలించాలని చెబుతున్నారు.
వైరస్ ఇంధనం అయిపోతోందని అనుకోవడం తప్పని డాక్టర్ బెనర్జీ అన్నారు.

 
"రోగ నిరోధక శక్తి మాత్రమే సరిపోదు. గతంలో ఇన్ఫెక్షన్ సోకిన వారికి కూడా తిరిగి ఇన్ఫెక్షన్ సోకి వారి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంది" అని డాక్టర్ బెనర్జీ అన్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు కేవలం 10 శాతం జనాభాకు మాత్రమే వ్యాక్సీన్ ప్రక్రియ పూర్తయింది. "80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు సాధారణ స్థితిలోకి వెళ్లడం గురించి ఆలోచించకూడదు" అని డాక్టర్ జాన్ అన్నారు. అప్పటి వరకు మాస్కులు ధరించి, చేతులు శుభ్రపరుచుకుంటూ, భారీ సమావేశాలకు హాజరవడంలాంటి మానేస్తూ, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్‌ను అదుపులో ఉంచవచ్చు. "కోవిడ్‌పై విజయం సాధించాం అని తొందరపడి ప్రకటించుకోవడం విపత్కర పరిణామాలకు దారి తీస్తుంది. అది పునరావృతం కావాలని అనుకోవడం లేదు" అని డాక్టర్ సిన్హా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం