Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య: "ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్ కంపు కొడుతోంది"

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (19:05 IST)
ఫాతిమా లతీఫ్, పాయల్ తాడ్వి, రోహిత్ వేముల... ఇలా పేర్లు చెప్పుకుంటూ చాలానే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సముదాయాల నుంచి వచ్చిన వీళ్లు... ఎంతో కష్టపడి దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. కానీ, తమ లక్ష్యాలను చేరుకోక ముందే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విద్యార్థుల ఆత్మహత్యలకు పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం, చదువులో రాణించలేకపోవడం, హాజరు సరిగా లేకపోవడం, మానసిక ఒత్తిడి... కారణం అంటూ మీడియాకు సమాచారం అందుతుంది.

 
ఇటీవల ఐఐటీ - మద్రాసులో ఫాతిమా లతీఫ్‌ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. తన బిడ్డ బలన్మరణానికి ప్రొఫెసర్ వేధింపులే కారణమని, ఆయన్ను అరెస్టు చేయాలని ఆమె తండ్రి అబ్దుల్ లతీఫ్ డిమాండ్ చేశారు. తమ కూతురు ముస్లిం అన్న గుర్తింపును చూపించుకునేందుకు ఇష్టపడేది కాదని, అందుకే హిజాబ్ ధరించేది కాదని ఫాతిమా తల్లి మీడియాకు చెప్పారు.

 
‘‘మా బిడ్డ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు. సివిల్స్ సాధించాలన్న పట్టుదలతో ఉండేది. ఇది ఆత్మహత్యగా కనిపించడంలేదు. ఆమెకు తాడు ఎక్కడ దొరికింది? ఆమె మరణం తర్వాత హుటాహుటిన గదిని ఎందుకు శుభ్రం చేశారు? ఆమె మొబైల్ ఫోన్ పోలీసుల దగ్గర ఉంది. ఆమె ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పూర్తి విషయాలతో ఉత్తరం రాసి ఉండేది. మా ముందే ఆమె ఫోన్‌ను తెరవాలని మేము పోలీసులను అడిగాం" అని ఫాతిమా తండ్రి అబ్దుల్ బీబీసీతో చెప్పారు.

 
ఫాతిమా కేసు దర్యాప్తును నిర్ధిష్ట వ్యవధిలో పూర్తి చేయాలంటూ ఐఐటీ మద్రాస్ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఫాతిమాకు న్యాయం చేయాలంటూ ఇద్దరు సహచర విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్షలో ఉన్నారు. తమ పేర్లను బహిర్గతం చేయవద్దని ఆ విద్యార్థులు బీబీసీని కోరారు. కొందరు ఫోన్‌లో మాట్లాడారు, ఇంకొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 
"అది మానసిక ఒత్తిడి కాదు, చదువులో రాణించకపోవడం కాదు. మా క్యాంపస్‌లో కులతత్వం, మతత్వం, వర్గపోరు ఉంది. ఒక కులం వాళ్లు ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు" అని ఒక విద్యార్థి అన్నారు. ‘‘ఇటీవల ఐఐటీ మద్రాస్‌లోనే ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతికి మార్కులు తక్కువ వచ్చాయని, చదువులో రాణించలేకపోయారని కారణమని అనలేరు కదా?’’ అని ఒక విద్యార్థి ప్రశ్నించారు.

 
''మా క్యాంపస్ ఒక హింసాత్మక ప్రదేశం. అభిజాత్యం, కులతత్వం, వర్గపోరు, ముఖ్యంగా ఇస్లామోఫోబియాతో కంపు కొడుతోంది. ఈ క్యాంపస్‌లో నిర్లక్ష్యం, ఉదాసీనతను చూస్తే నాకు భయమేస్తోంది'' అనే అల్ఫియా జోస్ అనే మరో విద్యార్థి ఫేస్‌బుక్‌ పోస్టులో రాశారు. "ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మన కాలేజీలో ఒక విద్యార్థి చనిపోయారంటూ మాకు ఇమెయిల్ వస్తుంది.


కానీ, అందులో చనిపోయిన విద్యార్థి పేరు, వివరాలను కూడా మాకు చెప్పరు. అసలేం జరిగింది? ఎందుకు చనిపోయారు? కాలేజీ యాజమాన్యం ఏం చర్యలు తీసుకుంది? అన్న విషయాలేమీ మాకు తెలియవు. ఫాతిమా మరణం గురించి మీడియాలో వచ్చిన కథనాలను చదివాం. ఆమె తల్లిదండ్రులు కొందరు వ్యక్తుల పేర్లను వెల్లడించారు. కానీ, చాలా సందర్భాల్లో అధికారులు మాకు ఏ విషయమూ చెప్పరు'' అని కొందరు విద్యార్థులు అన్నారు.

 
మానసిక ఆరోగ్యం కోసం విద్యార్థులకు అవసరమైనప్పుడు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు నిపుణులను నియమించాలని విద్యార్థి సంఘం యాజమాన్యానికి ప్రతిపాదన చేసిందని, ఎలాంటి కారణం చెప్పకుండా యాజమాన్యం దానిని తిరస్కరించిందని కొందరు విద్యార్థులు చెప్పారు. ''విద్యార్థి సంఘం ఒక రాష్ట్ర శాసనసభను పోలి ఉంటుంది. విద్యార్థి సభ్యులను ఎన్నుకుంటాం. విద్యార్థుల మంచి కోసం పనిచేసే ఆ సంఘం ప్రతిపాదనలను కళాశాల యాజమాన్యం ఎలా అకారణంగా తిరస్కరిస్తుంది?" అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

 
ఐఐటీ మద్రాస్ విద్యార్థులలో తీవ్రమైన వేధింపులు, ఒత్తిడికి గురైన కొంతమందికి చికిత్స చేసినట్లు చెన్నైకి చెందిన మానసిక వైద్య నిపుణులు షాలిని తెలిపారు. ''తాము మాట్లాడే విధానం, తినే ఆహారం, వారి కులం వంటి కారణాలతో వేధింపులకు గురవుతున్నామని నా వద్దకు వచ్చిన విద్యార్థులు చెప్పేవారు. ఆ క్యాంపస్‌లో తమను బయటి వ్యక్తుల్లా చూస్తున్నారని, అక్కడ వివక్షకు గురవుతున్నామని కొందరు చెప్పేవారు. కొంతమంది విద్యార్థులు పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ, విద్యార్థులందరూ అలా సర్దుకుపోతారని చెప్పలేం'' అని శాలిని అన్నారు.

 
ఫాతిమా ఆత్మహత్యకు కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉన్నప్పటికీ, విద్యార్థులను ఆలోచనలను, సమస్యలను పంచుకునేందుకు, అవసరమైనప్పుడు సహాయం కోరేందుకు క్యాంపస్‌లో ఒక ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. "అక్కడ ఉన్న సమస్యలేంటి? ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అన్న విషయాలను తెలుసుకోల్సిన బాధ్యత మనకు ఉంది" అని శాలిని అన్నారు.

 
దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షపై గత పదేళ్లలో 72 ఫిర్యాదులు వస్తే, బాధ్యుల్లో ఒక్కరిని కూడా అరెస్టు చేసేందుకు ఉన్నత విద్యా శాఖ ఎందుకు చర్యలు తీసుకోలేదని డీఎంకే ఎంపీ కనిమొళి ప్రశ్నించారు. "గత పదేళ్లలో ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షపై 72 ఫిర్యాదులు వచ్చాయని ఉన్నత విద్యాశాఖ మంత్రి స్వయంగా అంగీకరించారు. కానీ, ఎలాంటి అరెస్టులూ జరగలేదు. మన యువ తరానికి మనం ఏం బోధిస్తున్నాం? మన సంస్థలు ఇలా నడిచేందుకు మనం అనుమతించకూడదు. ఫాతిమా తల్లిదండ్రులు సాక్ష్యాలు ఇచ్చి, వ్యక్తుల పేర్లు బయట పెట్టినప్పటికీ, ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు. ఎవరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు?' అని కనిమొళి ప్రశ్నించారు.

 
విద్యార్థుల ఆత్మహత్యలపై వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఆర్.సుబ్రమణ్యంను ప్రభుత్వం చెన్నైకి పంపినట్లు తెలిసింది. ఫాతిమా మృతిపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెన్నై నగర పోలీసు కమిషనర్ ఏకే. విశ్వనాథన్ మీడియాకు తెలిపారు. ‘‘గతంలో సీబీఐలో పనిచేసిన ఇద్దరు సీనియర్ అధికారులతో ఫాతిమా కేసు దర్యాప్తు జరిపిస్తున్నాం. దర్యాప్తు కొనసాగుతున్నందున, మేము ఇతర సమాచారం ఇవ్వలేం'' అని ఏకే. విశ్వనాథన్ అన్నారు.

 
విద్యార్థులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారన్న వివరాలు తెలుసుకునేందుకు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ భాస్కర్ రామమూర్తిని ఈమెయిల్‌ ద్వారా బీబీసీ సంప్రదించింది. అటువైపు నుంచి స్పందన రాలేదు. 'మేము ఇప్పుడు ఈ విషయంపై మాట్లాడలేం' అని అసిస్టెంట్ రిజిస్ట్రార్ రేష్మా ఫోన్‌లో చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments