వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12వ తరగతి చదివే, విద్యావసతి పొందే విద్యార్థులు అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్‌టాప్ అందిస్తాం అని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తెలిపారని ఈనాడు ఒక కథనం ప్రచురించింది.
నెల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన సభలో జగనన్న అమ్మఒడి రెండో ఏడాది చెల్లింపులను ఆయన ప్రారంభించారు. కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ తరగతులకు పేదింటి పిల్లలు దూరమయ్యారన్నారని, ఆ పరిస్థితులను మార్చాలనే ల్యాప్‌టాప్ ఇస్తున్నామన్నారు.
మార్కెట్‌లో రూ.25-27 వేల మధ్య దొరికే ల్యాప్‌టాప్‌ను ప్రభుత్వ చర్చలతో కొన్ని సంస్థలు రూ.18,500కే ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయన్నారు. టెండర్లు పిలిచి, రివర్స్ టెండరు ద్వారా 4జీబీ ర్యామ్, 500 జీబీ స్టోరేజీ, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ స్పెసిఫికేషన్‌తో ఇస్తామని తెలిపారు.
వాటికి మూడేళ్ల వారంటీ ఉంటుంది.. పనిచేయకపోతే ఏడు రోజుల్లోనే మరమ్మతులు చేసి ఇచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు వివరించారని ఆ కథనంలో పేర్కొన్నారు.