Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్: ప్రజల సొమ్ము నుంచి వేతనాలు అందుకుంటున్న వాలంటీర్లు.. పార్టీ సేవ చేయవచ్చా?

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (19:50 IST)
ఆంధ్రప్రదేశ్‌లో 'గడపగడపకూ మన ప్రభుత్వం' పేరుతో కార్యక్రమం జరుగుతోంది. వచ్చే ఎన్నికలకు సన్నాహకంగా దీనిని వినియోగించుకోవాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెబుతున్నారు. దానికి కొనసాగింపుగా ఏప్రిల్ 7 నుంచి 20 వరకు 'మా నమ్మకం నువ్వే జగన్' అంటూ మరో కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో గ్రామ/వార్డు వాలంటీర్లను కలుపుకొని సాగాలంటూ పార్టీ నేతలకు సీఎం జగన్ చేసిన సూచన వివాదాస్పదమవుతోంది. పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ సిబ్బందిని భాగస్వాములను చేసే యత్నాలపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా వేతనం లేదా గౌరవ వేతనం పొందుతున్న వారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు. అయినప్పటికీ అధికార పార్టీ ప్రచార కార్యక్రమంలో వాలంటీర్లను మమేకం చేయాలంటూ సీఎం జగన్ చెప్పడం వివాదానికి మూలం.
 
వాలంటీర్లకు ప్రజాధనం
జగన్ ప్రభుత్వం సుమారు 15 వేల గ్రామ/వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. వాటికి అనుబంధంగా ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించారు. వీరు 2019 ఆగస్టు నుంచి విధులు నిర్వహిస్తున్నారు. పింఛన్లను ఇంటింటికీ తీసుకెళ్లి పంచడం, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడం వారి బాధ్యత. ప్రజా సమస్యల పరిష్కారానికి సచివాలయం, సామాన్య ప్రజల మధ్య వారు వారధులని ప్రభుత్వం చెప్పింది. వారికి నెలకు రూ. 5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. ఇటీవల అదనంగా పత్రిక కొనుగోలు కోసమంటూ నెలకు రూ. 200 చొప్పున అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2,54,832 వాలంటీర్ పోస్టులున్నాయి. ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.62,400 చొప్పున సుమారు రెండు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తోంది.
 
అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలకు అలా...
అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలు వంటి వారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్న ఉమ్మడి కార్యక్రమాల్లో భాగంగా నియమితులయ్యారు. వారికి కూడా గౌరవ వేతనాలు అందిస్తారు. అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలను రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారనే కారణంగా విధుల నుంచి తొలగించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. రాజకీయంగా తమకు మద్దతుగా ఉండటం లేదనే కారణంగా అంగన్ వాడీలను వేధిస్తున్నారంటూ వారి సంఘం తరఫున నిరసనలు కూడా చేశారు. వాలంటీర్లకు మాత్రం అందుకు విరుద్ధంగా రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం విశేషంగా మారింది. అంగన్ వాడీ కార్యకర్తలకు వర్తించే నిబంధన వాలంటీర్లకు ఎందుకు వర్తింపజేయరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
 
"అధికార దుర్వినియోగం విస్తృతమవుతోంది. నేరుగా ముఖ్యమంత్రి ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. వాలంటీర్లను ప్రభుత్వ సేవలకు మాత్రమే వినియోగించుకోవాలి. తగిన వేతనం అందించాలి. కానీ పార్టీ కార్యకర్తల మాదిరిగా మార్చేసే ప్రయత్నం తగదు. ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్లు సహా గ్రామ గ్రామాన ఉన్న సిబ్బందికి వర్తించే విధానం వాలంటీర్లకు కూడా వర్తింపజేయాలి. అందుకు విరుద్ధంగా ఇటు ప్రజలను వంచిస్తూ, అటు పనిచేసే వాలంటీర్ల సేవలను దుర్వినియోగం చేయాలనే ప్రయత్నం తగదు" అంటూ ఏపీ గ్రామ వాలంటీర్ల యూనియన్ ప్రతినిధి సీహెచ్ రాజ్ కుమార్ అన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ఐక్యం కాకుండా ఆటంకాలు పెడుతున్నారని, వారిని ఇలాంటి కార్యక్రమాల్లో మళ్లించే యత్నం తగదని ఆయన అభిప్రాయపడ్డారు.
 
ఆది నుంచి వివాదమే
వాలంటీర్ల విషయంలో నియామకం నుంచి వివాదాలున్నాయి. వాలంటీర్లను పూర్తిగా అధికార పార్టీ కార్యకర్తలతో నింపేశారని విపక్షాలు విమర్శించాయి. వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లాంటి సీనియర్ నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా ఆ విమర్శలకు మరింత బలాన్ని ఇచ్చాయి. వాలంటీర్ల వ్యవస్థతో అందరినీ నియంత్రించే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలూ ఎక్కువగా ఉన్నాయి. స్థానిక ఎన్నికలు, ఓటర్ల జాబితా సవరణ వంటి సమయాల్లో వాలంటీర్ల మీద ఫిర్యాదులు రావడంతో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంది. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలనే ఆదేశాలూ ఇచ్చింది.
వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక, పథకాల అమలులో వాలంటీర్లు క్షేత్రస్థాయిలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వారిని ఉపయోగించుకుని రాజకీయ కార్యాచరణకు పూనుకునే ప్రయత్నంలో అధికార పార్టీ ఉంది.
 
అందుకు అనుగుణంగానే ఇటీవల ప్రతి సచివాలయ పరిధిలో వైసీపీ కోసం పనిచేసే కన్వీనర్లను నియమించారు. వాలంటీర్లకు అనుసంధానంగా గృహసారథులు అనే పేరుతో కొత్త యంత్రాంగాన్ని రంగంలోకి తెచ్చారు. ఇప్పుడు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో వాలంటీర్లను మమేకం చేసి 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. "ఆ కార్యక్రమాలన్నీ సజావుగా, సమర్థవంతంగా ఆయా నియోజకవర్గాల్లో నడిచేలా మీరు పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలు స్వీకరించండి. మీరు, నేను, పార్టీ యంత్రాంగం అంతా కలిసి ముందుకు సాగుదాం" అంటూ పార్టీ కోఆర్డినేటర్లకు జగన్ సూచించారు.
 
ప్రజాధనం దుర్వినియోగమనే విమర్శలు
వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసే సామాజిక పింఛన్లను గడిచిన కొన్ని నెలలుగా వైసీపీ ఆధ్వర్యంలోని గృహసారథుల చేతుల మీదుగా అందిస్తున్నారు. ప్రతి నెలా మొదటి వారంలో పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు కలిసి ఉమ్మడిగా ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్లు అందించాలంటూ జగన్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇది అమలవుతోంది. వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలను నియమించుకున్నారని, అంతమాత్రాన వారిని ప్రభుత్వ సేవలకు కాకుండా, పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకోవడం అధికార దుర్వినియోగమవుతుందని విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ అంటున్నారు. "వాలంటీర్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఖర్చు చేస్తున్నారు. ప్రజల సొమ్మును గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా వైసీపీ నియమించుకొన్న వారు గృహ సారథులు. మరి, గృహ సారథులు, వాలంటీర్లు సంయుక్తంగా, సమన్వయంతో వైసీపీ ప్రచార కార్యక్రమంలో ఎలా పాల్గొంటారు? ఇది అధికార దుర్వినియోగం కాదా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి" అని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
 
'ముఖ్యమంత్రి పిలుపు ఇస్తే తప్పుబట్టలేం'
‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే కార్యక్రమం ప్రభుత్వ అధినేత పిలుపు కాబట్టి వాలంటీర్లతో మమేకం కావాలన్న జగన్ మాటల్లో తప్పులేదని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. "మా నమ్మకం వైఎస్సార్‌సీపీ అంటే తప్పు. అది పార్టీ కార్యక్రమం. ఇప్పుడు జగన్ అంటున్నారు. అంటే ప్రభుత్వ అధినేత మీద విశ్వాసం చాటాలనే ప్రయత్నంగా చూడాలి. దానిలో వాలంటీర్లు భాగస్వాములు కావడం తప్పెలా అవుతుంది? ఏ కార్యక్రమంలోనయినా అధికార పార్టీ శ్రేణులే పాల్గొంటాయి. అప్పుడు పార్టీ జెండాలు ప్రదర్శిస్తే రాజకీయ కార్యక్రమంగా చూడాలి. అంతవరకూ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఎవరు పాల్గొన్నా అది నిబంధనలకు విరుద్ధంగా భావించలేం" అని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. గడప గడపకూ కార్యక్రమంలో అధికారులు, వాలంటీర్లు అంతా పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
 
ప్రభుత్వ విధానాల ప్రచారం నేరమా: మంత్రి బొత్స
మంత్రి బొత్స సత్యనారాయణ బీబీసీతో మాట్లాడుతూ- ప్రభుత్వ విధానాలను ప్రచారం చేయడం నేరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలందరి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి పాటుపడుతున్నారని, ఆయన మీద విశ్వాసం చాటుకునే కార్యక్రమంలో వాలంటీర్లు సహా అన్ని వర్గాలు పాలుపంచుకుంటే నేరమా అని ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments