Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

బిబిసి
శుక్రవారం, 22 నవంబరు 2024 (22:53 IST)
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సహా ఎనిమిది మందిపై అమెరికాలోని న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టులో మోసానికి సంబంధించిన అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. భారత్‌లో లంచాలు కానీ, మరేదైనా వ్యవహారాలపైనా కానీ అమెరికాలో కేసు ఏమిటనే అనుమానం రావచ్చు. అయితే అదానీకి సంబంధించిన కంపెనీలు అమెరికా నుంచి కూడా పెట్టుబడులు సేకరించాయి. అక్కడ నుంచి పెట్టుబడులు సేకరించినప్పుడు వాటికి సంబంధించిన వినియోగంలో అవకతవకలు జరిగితే చర్యలు తీసుకునే అధికారం అక్కడి చట్టాల ప్రకారం అమెరికాకు ఉంటుంది. అందుకే అక్కడి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అదానీ కంపెనీపై లంచాల ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూపు ఖండిస్తోంది.
 
అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ చేసిన ఆరోపణలలో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి అని ప్రస్తావించారు. 2019 మే నుంచి 2024 జూన్ మధ్యన ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి’ అంటూ కమిషన్ ఫిర్యాదులో ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నది వైఎస్ జగన్మోహనరెడ్డి. దీనికి సంబంధించి న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టులోనూ అభియోగపత్రం దాఖలైంది. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి’తో గౌతమ్ అదానీ సమావేశం తర్వాత లంచాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని, దాని ఫలితంగానే అదానీ గ్రీన్, అజూర్ కంపెనీల సొలార్ పవర్‌ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కొనేందుకు ఒప్పందం కుదిరిందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అమెరికాలో ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించింది. అదానీ గ్రీన్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 30 బిలియన్ డాలర్లకు (దాదాపు 2.53 లక్షల కోట్లుకు) పైగా ఉందని చెప్పింది.
 
అసలు ఏమిటీ ఒప్పందం?
రాజస్థాన్‌లో భారీ సొలార్ విద్యుత్తు ప్లాంటును నిర్మించాలని అదానీ సంస్థ 2019లో నిర్ణయించింది. సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) ఆధ్వర్యంలో అదానీ గ్రీన్, అజూర్ కంపెనీలు సంయుక్తంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయించాయి. తర్వాత సోలార్ విద్యుత్ యూనిట్ ధరలు దేశీయంగా తగ్గుకుంటూ వచ్చాయి. సెకీ ప్రతిపాదించిన యూనిట్ రూ.2.49కు రాష్ట్రాలు ముందుకు రాలేదని అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ దశలొ సోలార్ పవర్‌ను అమ్మేందుకు ప్రభుత్వ సంస్థ ద్వారా ప్రయత్నించారనేది అభియోగాల్లోని సారాంశం.
 
సోలార్ విద్యుత్ అమ్మకానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇవ్వడం లేదా ఇస్తామని ఆశ చూపడం చేశారనేది అదానీ సహా ఎనిమిది మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభియోగం. ఈ వ్యవహారంలో 2019 మే నుంచి 2024 జూన్ మధ్య పనిచేసిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పాత్రను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ఆ కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని ఉన్నతస్థాయి వర్గాలకు ముడుపులు ఇవ్వడం లేదా ప్రోత్సాహాకాలు ఇస్తామని ఆశ చూపారనే ఆరోపణలున్నాయి.
 
‘‘అజూర్ ఎగ్జిక్యూటివ్స్‌కు అదానీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్స్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కొన్ని కీలక విషయాలు ఉన్నాయి. ఒప్పందాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు 200 మిలియన్ డాలర్ల (సుమారు 17 వందల కోట్ల రూపాయలు) ముడుపులు ముట్టాయి. ఈ విషయం అదానీ గ్రీన్ కంపెనీ రికార్డుల్లోనే ఉంది’’ అని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫిర్యాదులో ఉంది. దీనికి సంబంధించి న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన అభియోగపత్రంలో తేదీలతో సహా వివరాలు ఉన్నాయి. గౌతమ్ అదానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి లంచాలు ఇస్తానని వాగ్ధానం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
ఎప్పుడెప్పుడు ఏం జరిగిందంటే...
2021 ఆగస్టు 7- గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా అప్పటి ఏపీ ముఖ్యమంత్రిని కలిసినట్లు కోర్టు అభియోగపత్రంలో ఉంది.
 
అలాగే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫిర్యాదులో ‘‘విద్యుత్ సరఫరా ఒప్పందానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకోలేదు. దీంతో ఏపీ ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిశారు. ‘ఇన్సెంటీవ్స్’ కారణంగా ఏపీ ఒప్పందం చేసుకుంది’’ అని రాశారు.
 
2021 ఆగస్టు 8: గౌతమ్ అదానీ కలిసిన మరుసటి రోజునే గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 10.4 శాతం వాటాను గంగవరం పోర్టు లిమిటెడ్ నుంచి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీసెజ్) షేర్ రూ.120 చొప్పున రూ.645.10 కోట్లకు విక్రయింంచారు. దీనిపై మంత్రివర్గం తీర్మానం చేసింది.
 
2021 సెప్టెంబరు12: ఏపీ ముఖ్యమంత్రితో గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఈ విషయం కూడా అభియోగపత్రంలో ఉంది. అయితే, ఈ భేటీలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు? ఎందుకు భేటీ అయ్యారనే విషయాలు బయటకు రాలేదు. అటు ఏపీ ప్రభుత్వం నుంచి గానీ, ఇటు గౌతమ్ అదానీ సంస్థల నుంచి గానీ ఈ సమావేశం వివరాలు అప్పట్లో బయటకు రాలేదు.
 
2021 సెప్టెంబరు15: సెకి నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ. రాజస్థాన్‌లోని సోలార్ విద్యుత్ ప్లాంటు నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని విజ్జప్తి. 25 ఏళ్ల కాలానికి యూనిట్‌కు రూ.2.49 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని లేఖలో ప్రస్తావించినట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ప్రస్తావించింది.
 
2021సెప్టెంబరు16 : సెకి నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని ఏపీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. మొదటి విడతలో 7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు చేయాలని తీర్మానించారు.
 
‘‘కేబినెట్ సమావేశంలో సెకి ప్రతిపాదనను అనుమతిస్తూ తీర్మానించాం. వివిధ చర్చల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల మెగావాట్ల సొలార్ విద్యుత్‌ను మొదటి విడతలో కొనుగోలు చేయాలని నిర్ణయించింది’’ అని ఏపీ ప్రభుత్వం చెప్పినట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ పేర్కొంది. లంచాలు, ఇతర వాగ్దానాలు పనిచేశాయని రాసింది. 2021 జులై 22 నుంచి డిసెంబరు 1 మధ్య కాలంలో నాలుగు భారత రాష్ట్రాలతో సెకి విద్యుత్ సరఫరా ఒప్పందాలు చేసుకుంది. “దీనివల్ల అదానీ గ్రీన్, అజూర్ కంపెనీలతో సెకి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం సులువు అయ్యింది. బిలియన్ డాలర్లు సంపాందించేందుకు ఈ రెండు కంపెనీలకు మార్గం దొరికింది” అని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభియోగం.
 
2021 డిసెంబరు 14 - అదానీ గ్రీన్ ఒక ప్రకటన జారీ చేసింది.
‘‘ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావిస్తున్న గ్రీన్ పీపీఏపై సెకి, అదానీ మధ్యం ఒప్పందం కుదిరింది’’ అని చెప్పింది. ఇందులో దాదాపు 5 గిగావాట్ల విద్యుత్‌ను అదానీ గ్రీన్ నుంచి సెకి కొనుగోలు చేయనుంది.
 
మరో రెండుసార్లు జగన్, అదానీల భేటీ
2022 మే 22న జగన్‌తో దావోస్‌లో గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి ఏయే అంశాలపై చర్చించారనే విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘‘1.25 లక్షల కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్ కో, అరబిందో సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది’’ అని సాక్షి రాసింది.
 
2023 సెప్టెంబరు 28 - తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అప్పటి సీఎం జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ‘‘గంగవరం పోర్టుకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అదానీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అదానీ గ్రూపు సంస్థల పెట్టుబడులపై ఈ భేటీలో చర్చ జరిగినట్లుగా సమాచారం’’ అని సాక్షి టీవీ అప్పట్లో వెల్లడించింది.
 
‘‘ఏపీ సీఎం జగన్‌తో గంగవరం పోర్టు, వైజాగ్ డాటా సెంటర్ విషయంపై చర్చించాం. ఏపీ పురోగతిలో రెండు ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి’’ అంటూ గౌతమ్ అదానీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
 
అదానీ గ్రూప్, వైసీపీ ఏమన్నాయి?
ఇక అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది. వాటిని నిరాధారమైనదిగా పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో "అదానీ గ్రీన్ డైరెక్టర్లపై యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. మేం వాటిని తిరస్కరిస్తున్నాం" అని వెల్లడించింది. అవి కేవలం నేరారోపణలు మాత్రమే, దోషులుగా రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే భావించాల్సి ఉంటుందని చెప్పింది. న్యాయపరంగా ముందుకెళ్లే అంశాలను పరిశీలిస్తామని కంపెనీ తెలిపింది.
 
''పాలనా వ్యవహారాల్లో, పారదర్శకత విషయంలో అదానీ గ్రూపు ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుంది. కంపెనీ కార్యకలాపాలు నిర్వహించే ప్రతిచోటా వీటిని పాటిస్తూ వస్తోంది. చట్టాలను గౌరవిస్తూ, వాటికి లోబడి నడుచుకుంటున్నందున వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'' అని తెలిపింది. ఇక అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ ఆరోపణలపై జగన్ స్పందించలేదు కానీ ఆయన అధ్యక్షుడిగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఎక్స్‌వేదికగా ఒక ప్రకటన చేసింది. ఏపీ డిస్కంలు అదానీ గ్రూపులతో ఎలాంటి ప్రత్యక్ష ఒప్పందాలు చేసుకోలేదని తెలిపింది.
 
ఆ ప్రకటనలో.. ‘’2020 నవంబర్‌లో 6,400 మెవాగాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లు పిలిచింది. యూనిట్ రూ.2.49-2.58 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొస్తూ 24 బిడ్లు దాఖలయ్యాయి. అయితే న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవడం వల్ల ఆ టెండర్ ప్రక్రియ రద్దయింది. అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు (ఐఎస్ఎస్) మినహాయించి యూనిట్ రూ.2.49 చొప్పున విద్యుత్తు సరఫరా చేస్తామంటూ సెకీ ప్రతిపాదించింది. సెకీ అనేది కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ.’’ అని తెలిపింది.
 
‘’సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి అత్యంత చౌకగా విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.3,700 కోట్ల మేర ఆదా అవుతుంది. 25 ఏళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉండటం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదా అవుతుంది’’ అని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments