ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే కార్యక్రమాలు మొదల్యయ్యాయి. మహిళా నాయకురాళ్ళు కూడా తామెవ్వరికీ తీసిపోమన్నట్లుగా వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర హెచ్చరికలు జారీ చేసుకుంటున్నారు.
నిన్నమొన్నటి దాకా ఈ పోరు కాంగ్రెస్ నాయకురాలు గంగాభవానీ, నన్నపనేని రాజకుమారిల మధ్య వాడివేడిగా సాగింది. ప్రస్తుతం అది కాస్త తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీ నాయకురాళ్ళ మధ్య ఉడుకు పుట్టిస్తోంది. చాలా హూందా వ్యవహరించే ప్రజారాజ్యం పార్టీ నాయకురాలు శోభనాగి రెడ్డి ఈ పోరాటంలో ఇరుక్కు పోయారు.
ఎరక్కపోయి... ఇరుక్కుపోయాను...
చంద్ర బాబేమి ఆయన సొంత భూమిని చిరంజీవి రక్తదాన శిబిరానికి ఇవ్వలేదు. ప్రభుత్వ భూమినే ప్రజాసేవ సంస్థకు ఇచ్చారు. టిక్కెట్లు ఆశించే నన్నపనేని రాజకుమారి, రోజాలు చిరంజీవిపై అవాకులు చవాకులు పేలుతున్నారు.
- ప్రజారాజ్యం నాయకురాలు శోభా నాగి రెడ్డి
చిరంజీవిపై చేసిన విమర్శలను తిప్పికొట్టబోయిన ఈమె వాగ్యుద్ధంలో చిక్కుకున్నారు. సినిమాల్లో ఆయన సరసన కథానాయికలుగా నటించిన ఇక విజయశాంతి, రోజాలు చిరంజీవిపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తల్లి తెలంగాణ అధ్యక్షురాలు విజయశాంతి చిరంజీవిపై దుమ్మెత్తి పోశారు. రాజకీయాలలో చిరంజీవి తనకంటే చాలా జూనియరని చెప్పారు.
తెలంగాణపై రెండేళ్ళ కిందట తాను మద్దతు కోరితే ఏ మాత్రం స్పందించలేదని ఆరోపించారు. మరి ఇంతలోనే తెలంగాణపై ఆయన ప్రేమ కురిపించడం రాజకీయ లబ్ధికేనని విమర్శించారు. ఇక తెలుగుదేశం పార్టీ మహిళా శాఖ అధ్యక్షురాలు, సినీ నటి రోజా చిరంజీవిపై చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. చిరంజీవి పిల్లికి కూడా బిచ్చం వేయరని విమర్శించారు..
File
WD
వరదలు, జాతీయ విపత్తులు వచ్చిన సమయంలో కనీస సాయం కూడా చేయని ఆయనరాజకీయాలలో ఏమి సేవ చేస్తారని ఆ మధ్యలో తూలనాడారు. తాజాగా చంద్రబాబు ఇచ్చిన భూమి... అభిమానులు దానం చేసిన రక్తంతో ఆయన చేసిన సంఘ సేవ ఏమిటోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఇది కాకతాళీయంగా జరిగినా ఇద్దరు మాజీ నాయికలు ఒక మారు చిరంజీవిపై ఒకే మారు విరుచుకుపడ్డారు. దీంతో తమ నాయకుడి తీవ్ర స్థాయిలో విమర్శించిన వారికి సమాధానం చెప్పడంలో భాగంగా ప్రజారాజ్యం పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి ఎరక్కపోయి నన్నపనేని రాజకుమారి చేతిలో ఇరుక్కుపోయారు.
దటీజ్ రాజకుమారి
శోభా.... నోరు అదుపులో పెట్టుకో... నిన్నటి దాకా తెలుగుదేశం పార్టీలో అన్ని పదవులు అనుభవించిన దానివే... మేము టికెట్ల కోసం మాట్లాడుతున్నామా..! నేను నోరు తెరిస్తే నా కంటే తిట్ట గలిగే వారుండరు. గుర్తు పెట్టుకో...!
-తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని
చిరంజీవి రక్తనిధికి చంద్రబాబు ఇచ్చిన భూమి ఆయన సొంతమేమి కాదనీ, ప్రభుత్వ భూమిని ప్రజల కోసం సేవ చేసే సంస్థకు ఇచ్చారని ఆరోపించారు. కేవలం టికెట్ల కోసమే రోజా, నన్నపనేని రాజకుమారీలు విమర్శలకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది నన్నపనేనికి కోపం తెప్పించింది. ఇక వేరే చెప్పాలా... ఆమె శోభా నాగిరెడ్డిపై లంఘించుకున్నారు.
' నిన్నటి దాకా తెలుగుదేశం పార్టీలో అన్ని పదవులు అనుభవించిన నీకు చంద్రబాబును విమర్శించే హక్కు లేదం'టూ శోభా నాగి రెడ్డిపై మండిపడ్డారు. తాము టెకెట్ల కోసం చిరంజీవిపై విమర్శలు చేస్తుంటే నిన్నటి దాకా తెలుగుదేశం తరుపున ఏం ఆశించి విమర్శలకు దిగావంటూ దుమ్మెత్తి పోశారు. నిన్నగాక మొన్న ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళిన అప్పుడే అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందంటూ ప్రశ్నించారు.
తిట్టడానికి కూడా చేత రావాలని ఒక ఉచిత సలహా పారేశారు.పైగా తిట్టదలుచుకుంటే తనకంటే తిట్లపురాణాన్ని వల్లించగలగేవారు మరోకరు ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. శోభా నోరు అదుపులో పెట్టుకో.... లేకపోతే.... అంటూ హెచ్చరికలకు దిగారు. ఇంకా కాంగ్రెస్ నాయకురాళ్ళు రంగంలోకి దిగలేదు. ఆ ఛాన్స్ వస్తే తన సత్తా చూపేందుకు ఆ పార్టీ నాయకురాలు గంగభావనీ ఉండనే ఉన్నారు. రాబోవు రోజుల్లో ఈ రాజకీయ వీరవనితలు ఎలాంటి వాగ్బాణాలను సంధిస్తారో వేచి చూద్దాం.