ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం కూడా టీడీపీ సభ్యులు రచ్చ చేశారు. జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై వారు చర్చకు పట్టుబట్టారు. అందుకు ప్రభుత్వం సమ్మతించలేదు. దీంతో స్పీకర్ పోడియంను తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను సభను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియం వద్దకు టీడీపీ సభ్యులు వెళ్లడంతో వారిని ఒకరోజు సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీర్మానం ప్రవేశపెట్టారు. టీడీపీ సభ్యులు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆయన చెప్పారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం మొత్తం 11 మంది టీడీపీ సభ్యులపై సస్పెండ్ చేస్తూ నిర్ణయించారు. అనంతరం సభ కాసేపు వాయిదాపడింది.