Tirupati Stampede తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటుచేసుకున్నది. ఈ నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి (vaikuntha ekadashi 2025) సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో భక్తులు పోటెత్తారు. ఈ టిక్కెట్ల జారీ సమయంలో ఒక్కసారిగా భక్తులు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 6 మంది భక్తులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.
టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు చేరడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు తమిళనాడులోని సేలంకి చెందినవారుగా గుర్తించారు.
క్యూలో కనీసం 5 వేల మంది భక్తులు టిక్కెట్ల కోసం వున్నారు. అందర్నీ క్యూ లైన్లలో పంపమని చెప్పినా ఒక్కసారిగా గేటు తీసారు. దాంతో తొక్కిసలాట జరిగి 10 మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఇది రామానాయుడు కాలేజి దగ్గర జరిగిందని చెప్పారు.