ఏపీ సర్కార్ యవ్వారంతో భారత్ పరువే ఢమాల్: జపాన్ కంపెనీ ఆరోపణ నిజమేనా?
ఒకవైపు విశాఖలో భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల వెల్లువ అంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రకటిస్తుండగానే అమరావతి డిజైన్ కాంట్రాక్టు దక్కించుకున్న జుపాన్ సంస్థ మకీ అండ్ అసోసియేట్స్ శుక్రవారం ఆంధ్రా సర్కారుపై చేసిన ఆరోపణ సంచలనం గొలిపించింది. అంతర్జాతీయ టెండర్
ఒకవైపు విశాఖలో భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల వెల్లువ అంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రకటిస్తుండగానే అమరావతి డిజైన్ కాంట్రాక్టు దక్కించుకున్న జుపాన్ సంస్థ మకీ అండ్ అసోసియేట్స్ శుక్రవారం ఆంధ్రా సర్కారుపై చేసిన ఆరోపణ సంచలనం గొలిపించింది. అంతర్జాతీయ టెండర్‌లో పాల్గొని కాంట్రాక్టు దక్కించుకున్న తమను అనైతికంగా తప్పించారని, ప్రభుత్వ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం, వారికి కావాల్సిన సంస్థను ఎంపిక చేసుకోవడానికి తమ సంస్థకు దక్కిన కాంట్రాక్టును రద్దు చేశారని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.
భారతీయ వాస్తు శిల్పి శాస్త్ర నిపుణుల (ఇండియన్ ఆర్కిటెక్చురల్ ప్రొఫెషన్) ప్రతిష్టను ఏపీ ప్రభుత్వం పణంగా పెట్టిందని జపాన్ కంపెనీ మకీ మండిపడింది. ఏపీ సర్కార్ వ్యవహరించిన తీరుతో భారతదేశంలో పనిచేసేందుకు అంతర్జాతీయ ఆర్కిటెక్టులు ఎవరూ సాహసం చేయలేరంటూ ‘మకీ అండ్ అసోసియేట్స్’ ప్రిన్సిపల్ ఆర్కిటెక్టర్ ఫుమిహికో మకీ 2016 డిసెంబర్ 21న భారత ఆర్కిటెక్చర్ సమాఖ్య ఉపాధ్యక్షుడు విజయ్ గర్గ్‌కు రాసిన లేఖ ఇప్పుడు బయటపడింది.
అమరావతి వ్యవహారంలో పారదర్శకత లేశమాత్రం కూడా కనిపించలేదని, అధికార యంత్రాంగానికి చిత్తశుద్ధి లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. తాము విదేశీయులం కాబట్టి.. సమాచార హక్కు కింద సమాచారాన్ని తీసుకోలేమని, ఆర్కిటెక్చర్ సమాఖ్య ప్రతినిధులు శ్రద్ధ తీసుకొని ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరిస్తే.. స్వార్థ ప్రయోజనాల పరిరక్షణకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ పెద్దల బండారం బయటపడుతుందని సూచించారు. రాష్ట్రంలో విదేశీ, స్వదేశీ పెట్టుబడులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజధానిలో వెయ్యి ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయం (అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్, డైరెక్టరేట్లు)ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ భవనాల సముదాయం డిజైన్ల కోసం అంతర్జాతీయ పోటీ ద్వారా మాస్టర్ ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపికకు ప్రొఫెసర్ క్రిస్టపర్ బెన్నింగర్ అధ్యక్షతన కేటీ రవీంద్రన్, ఎర్విన్ విరే, సుహా ఓజ్కాన్, పద్మభూషణ్ రాజీవ్ సేథీ, కేశవ్ వర్మ సభ్యులుగా ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాస్టర్ ఆర్కిటెక్ట్ పోటీలో పాల్గొనాలని కోరుతూ జపాన్‌కు చెందిన మకీ అసోసియేట్స్‌కు ప్రభుత్వం డిసెంబర్ 12, 2015న లేఖ రాసింది. అంతర్జాతీయ పోటీలో సంస్థలు అందించిన ప్రతిపాదనలను పరిశీలించిన జ్యూరీ మకీ అసోసియేట్స్‌ను మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఎంపిక చేస్తున్నట్లు మార్చి 25, 2016న ప్రకటించింది.
కానీ ప్రభుత్వం మే నెలలో మరో ఏడుగురు ఆర్కిటెక్టర్లకు ప్రభుత్వ కార్యాలయాల సముదాయం డిజైన్లు సమర్పించే పని అప్పగించింది. డిజైన్ ప్రతిపాదనలు సమర్పించిన ఏడు సంస్థల్లో ‘హఫీజ్ కాంట్రాక్టర్’ ఆఖరు స్థానంలో నిలిచినట్లు తెలిసినా ఆఖరు స్థానంలో నిలిచిన ‘హఫీజ్ కాంట్రాక్టర్’నే డిజైన్ల రూపకల్పనకు ఎంపిక చేశారు. ప్రభుత్వం కోరినట్లు తమ డిజైన్‌లలో మకీ మార్పులు చేర్పులు చేస్తుండగానే ఆ సంస్థను మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా తొలగిస్తున్నట్లు అక్టోబర్ 24, 2016న ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా మమ్మల్ని తొలగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం కనీసం సమాచారం ఇవ్వలేద’ని మకీ చీఫ్ ఫుమిహికో మకీ పేర్కొన్నారు. జ్యూరీ ఎంపిక చేసిన తమకు కనీస సమాచారం ఇవ్వకుండా వేటు వేసి.. నిబంధనలకు విరుద్ధంగా ఫోస్టర్ పార్టనర్స్–హఫీజ్ కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఎవరిని ఎంపిక చేసినా తమకు నష్టం లేదని.. కానీ ఏపీ సర్కార్ వ్యవహరించిన తీరు వల్ల భారతదేశ ప్రతిష్టకు విఘాతం కలిగిందని మకీ చీఫ్ ఫుమిహికో మకీ పేర్కొన్నారు. ఇలాగైతే భారతదేశంలో పనిచేసేందుకు అంతర్జాతీయ నిపుణులు ఎవరూ సాహసించలేరని స్పష్టీకరించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నట్లు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రాజధాని నిర్మాణం సాకారం కావాలని ఆశిస్తున్నట్లు పేర్కొంటూ ఆయన కేంద్రానికి రాసిన లేఖ బహిర్గతం కావడం కలకలం రేపుతోంది. ఇదే విధంగా ప్రధాని కార్యాలయానికి కూడా మకీ లేఖ రాసినట్లు సమాచారం. దీనిపై పీఎంఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరినట్లు సమాచారం. ప్రభుత్వ చర్యలతో రాష్ట్ర ప్రతిష్ట మసకబారిందని నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.