ఏపీలో పలు రాజకీయ పరిణామాలు, దూషణ భూషణల అనంతరం నేడు విజయవాడకు జనసేన అధ్యక్షుడు పవన్ ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. హైదరాబాదు నుంచి స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం ఎయిర్ పోర్ట్ కు పవన్ కళ్యాణ్ ఈ ఉదయం 8:40 కి చేరుకున్నారు. ఆయన అక్కడి నుంచి నేరుగా మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ దాష్టీకాల తదితర అంశాలపై చర్చ చేసి, తమ పోరాట పంథాను మార్చుకునే విషయమై కార్యకర్తలు, నాయకులతో ఆయన చర్చించునున్నారు. అక్టోబర్ 2న రాష్ట్రంలో రహదారుల మరమ్మతుల శ్రమదానం కార్యక్రమంపై విధి విధానాలను ఖరారు చేస్తారు. అలాగే, ప్రత్యేకంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, జనసేన కార్యకర్తలపై దాడులు, ప్రభుత్వం దివాళా, అప్పులు, తప్పులపై చర్చించి, ఎలా ఉద్యమించాలో కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందిస్తారు.