Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ముఖంలో తపస్సు చేస్తే వచ్చే వెలుగు లాంటిది కనిపించింది: సజ్జల రామకృష్ణారెడ్డి

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:17 IST)
ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వివాదాలను సృష్టిస్తున్నాయని రాష్ట్రప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో జరిగిన భారీ భూకుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న మీడియా, ఇతర శక్తులు మతపరమైన వివాదాలను ముందుకు తీసుకువస్తున్నాయని అన్నారు. 
 
సజ్జల మాట్లాడుతూ.. ఇంకా ఆయన ఏమన్నారంటే...
1) ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ శక్తులు, ప్రజలకు సంబంధించి ఎటువంటి ఎజెండా లేని పార్టీలు, అటువంటి పార్టీల వెనక నిలబడి, వారి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులు, శక్తులు, వారికి వత్తాసు పలుకుతున్న మీడియా, సోషల్ మీడియా మూకుమ్మడిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నాయి.
 
2) నిజమైన ప్రజా సమస్యలపై ఒక ఉద్యమం, రాజకీయ పోరాటం ఎంత స్థాయిలో జరగాలని కోరుకుంటారో, అంతే స్థాయిలో లేని సమస్యలను పట్టుకుని, అదే పనిగా వివాదాలను సృష్టించి.. సీఎం వైయస్‌ జగన్ ను ఇబ్బంది పెట్టాలనే ఏకైక ఎజెండాతో ఈ కృత్రిమ ఉద్యమాన్ని, ఆందోళనను కొన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రారంభించాయి.
 
3) ప్రజల్లో తిరుగులేని ప్రజానాయకుడిగా, సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా, బలమైన పార్టీకి నాయకత్వం వహిస్తున్న నేతగా వున్న వైయస్ జగన్ ను ఏదో ఒక రకంగా ఇబ్బందుల పాలు చేస్తే, ఆయన పాలనను అస్థిరం చేయాలని, పార్టీలోనూ ఇబ్బందులు కలిగించాలనే దురాశతోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి ముగ్గు(ట్రాప్)లో చిక్కుకున్న బిజెపిలోని కొందరు నాయకులు ఇటువంటి కుట్రలు చేస్తున్నారు. 
 
4) ఈ దుష్ట శక్తులు మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుని ప్రజల్లో అలజడి సృష్టించాలని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఒక మతానికి ప్రతినిధులుగా కొందరు ఈ రాష్ట్రంలో కుట్రపూరితంగా అరాచక సంఘటనలు సృష్టించారు. మొదట్లో యాదృచ్ఛికంగా ప్రారంభమైన ఈ సంఘటనలు తరువాత విగ్రహాలను ధ్వంసం చేసే రాక్షసక్రీడ, వికృత చేష్టలుగా మారడానికి ప్రధాన ప్రతిపక్షం టిడిపి, వారి వెనక వున్న తైనాతీలు, ఈముగ్గులోకి దిగి ఈ మధ్య వీరంగం వేస్తున్న బిజెపి నాయకులు వున్నారు.
 
5) సీఎం జగన్ గారి నాయకత్వంలో వున్న ప్రభుత్వం తొణకని కుండలా వుంది. ఇంతమంది ఎమ్మెల్యేలతో, ఇన్ని మంచి పనులు చేస్తున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మతపరమైన వివాదాలు జరగాలని ఎక్కడైనా కోరుకుంటుందా? ఈ విషయం ప్రజలకు తెలియదా? కావాలని ఇటువంటి దుశ్చర్యలతో జన నాయకుడిని ఇబ్బంది పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలుగా ప్రజలు వీటిని గుర్తించడం లేదా? ఈ రాష్ట్రంలో ఒక ఈ కృత్రిమ తుపాను సృష్టించే ప్రయత్నానికి స్పిల్ బర్గ్ సినిమాలో మాదిరిగా అన్నిరకాల ఎఫెక్ట్‌ లను కలిగించారో ప్రజలు గమనిస్తున్నారు. 
 
6) తాజాగా తిరుమల డిక్లరేషన్ మీద మరో వివాదం సృష్టించేందుకు ఈ దుష్ట శక్తులు ప్రయత్నించి.. తీరా బొక్క బోర్లా పడ్డాయి.  టిడిపి అధికారంలో వున్నప్పుడు కూడా జగన్ గారు తిరుమల కొండకు వెళ్ళారు. స్వామివారిని దర్శించుకున్నారు.

ఆనాడు లేని డిక్లరేషన్ అభ్యంతరం హఠాత్తుగా చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు వచ్చింది? ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రప్రభుత్వం తరుఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెడుతున్న వైయస్ జగన్ పై డిక్లరేషన్ వివాదంను రుద్దాలని తప్పుడు ప్రయత్నం చేశారు. చివరికి ఏమైంది.. ఎవరు తీసిన గోతిలో వారే పడే పరిస్థితి.  
 
7) తిరునామం ధరించి, అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమల ఆలయంలో ప్రవేశించడం నుంచి గరుడ సేవ, సుందరాకాండ పారాయణంలో పాల్గొనడంలో ఎక్కడ చూసినా సీఎం వైయస్ జగన్ లో ఎటువంటి భక్తి, భావాలు వ్యక్తమయ్యాయో ప్రజలంతా గమనించాలి. భగవంతుడి పట్ల నిష్టతో, సంపూర్ణ భక్తి, గౌరవంతో ఎలాంటి కల్మషం లేని భక్తుడిలా జగన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. చంద్రబాబులా యాంత్రికంగా ఆచారాలను పాటించలేదు. 
 
8) తిరుమలలో వైయస్ జగన్ ముఖంలో ఒక తపస్సు చేస్తే వచ్చే వెలుగు లాంటిది కనిపించింది. ఇదీ.. జగన్ లో దేవుడి పట్ల వున్న విశ్వాసానికి నిదర్శనం. డెబ్బై ఏళ్ళ జీవితం తరువాత వచ్చే ప్రశాంతత... యాబై ఏళ్ళ కంటే తక్కువ వయస్సు వున్న సీఎం వైయస్ జగన్ లో కనిపించింది.  ఈ అంశంపై మీడియాలో జరిగిన చర్చలో కూడా పలువురు విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రతిపక్షాలకు కనిపించలేదా? 
 
9) రాష్ట్రాన్ని పాలించే నాయకుడు ఒక కులానికి, మతానికే పరిమితం అవుతారా? అన్ని మతాలు, కులాల వారి విశ్వాసంను పొందినప్పుడే నిజమైన నాయకుడిగా గుర్తింపు పొందుతారు. ప్రజలందరికీ కులమతాలకు అతీతంగా పాలనను అందించగలిగితేనే మంచి సీఎంగా నిలిచిపోతారు. ఇప్పుడు జగన్ గారు చేస్తున్నది అదే. 
 
10) ఒక మతంలో భగవంతుడిపై భక్తి, నిష్టతో ఆచార వ్యవహారాలను గౌరవించే వారు అన్ని మతాల్లోనూ తమ వైఖరిని అదే విధంగా కొనసాగిస్తారు. రాష్ట్రంలోని కోట్లాది మంది విశ్వాసాన్ని గౌరవించడం, ఎన్నుకున్న ప్రజల ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను ఆదరించడం మంచి పాలకుడి లక్షణం, అది జగన్ లో సంపూర్ణంగా వుంది.

కానీ చంద్రబాబులో ఒక్క శాతం కూడా కనిపించదు. అదే వీరిద్దరికీ ఉన్న తేడా. అవసరమైతే సంక్షోభం సృష్టించడానికి చంద్రబాబు ఎన్ని తప్పుడు పనులు అయినా చేస్తారు. ఏవైతే సున్నితమైన అంశాలుగా వుంటాయో వాటిని రచ్చ చేయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, అటువంటి వాటిని కూడా తమ స్వార్థ రాజకీయం కోసం వివాదాస్పదం చేయడం, ఆ తరువాత అభాసుపాలు కావడం చంద్రబాబుకు, ఆయన మద్దతుదారులకు అలవాటుగా మారింది. 
 
11) వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాదిన్నర కూడా కాలేదు. ఇంకా మూడున్నర సంవత్సరాల సమయం ఈ ప్రభుత్వానికి వుంది. అధికారానికి దూరమైన చంద్రబాబు అప్పుడే ఆగలేకపోతున్నారా? ఏదో ఒక రచ్చ సృష్టించి ఈ ప్రభుత్వంపై బురదజల్లాలని ఎందుకు అనుకుంటున్నారు? జగన్ అంటే కొన్ని మతాలకు వ్యతిరేకమని, కొన్ని మతాలకు అనుకూలమనే భ్రమలు వుంటే దానిని చంద్రబాబు వదిలించేకుంటే మంచిది.

లేకపోతే ఆయనే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా అభాసుపాలు అవుతారు. చంద్రబాబు దురుద్దేశ పూర్వక ఆలోచనలతో వున్నారు. తన పన్నాగాలతో దుష్టపూరితమైన ప్రణాళికలు, వ్యూహాలు, ఎత్తుగడలతో ఈ ప్రభుత్వంను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. వీటన్నింటితో ప్రజలకు సంబంధం లేదు. కేవలం చంఢాలమైన, నీచమైన రాజకీయం చేయడమే చంద్రబాబు లక్ష్యం. ఇది టిడిపికే కాదు, దానికి వత్తాసు పలుకుతున్న మిగిలిన అన్ని శక్తులకు ఇది వర్తిస్తుంది.
 
12) ఒకవైపు అమరావతిలో వేల కోట్ల రూపాయల కుంభకోణం బయటకు వచ్చింది. దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్ళించేందుకు చంద్రబాబు ఈ కుట్రలు చేస్తున్నాడు. మత పరమైన వివాదాలను సృష్టిస్తున్నాడు. మొదట చంద్రబాబు విమర్శలు చేయడం, తరువాత దానిని పవన్ కళ్యాణ్‌ అందుకోవడం ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. ఆలయాలు, కోర్ట్‌లు, డిక్లరేషన్ ఇలా ప్రతి అంశాన్ని కృత్రిమంగా సృష్టించడం, దానిని వివాదాస్పదం చేసి, మొత్తం ప్రజల దృష్టి అంతా దానిపైనే వుండేలా, చర్చ అంతా దానిపైనే జరిగేలా చేస్తున్నారు.
 
13) అమరావతిలో అవినీతిపై చర్చ జరగకుండా, ఈ ప్రక్రియలో న్యాయస్థానాల్లో కూడా స్టేలు తెచ్చుకుని, అన్నిరకాలుగా మేనేజ్ చేసుకుని బయటపడాలనే దుష్ట యత్నంపైన కూడా చర్చ జరగకుండా చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. దీనికోసం ఢిల్లీ నుంచి ఇక్కడి వరకు వున్న శక్తులు, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలోకి లోపాయికారిగా పంపిన తమ వారిని వాడుకుంటున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్‌ వంటి వారిని అండగా చేసుకోవడం, ఒక్కరు స్టేట్‌ మెంట్ ఇస్తే, మిగిలిన వారు అందరూ వెంటనే అదే మాదిరిగా స్పందించడం చేస్తున్నారు. 
 
14) గత ఏడాదిన్నరగా ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఏం చేయాలనే దానిపైనే దృష్టి సారించారు. తనపైన నిత్యం ఈ దుష్ట రాజకీయం చేస్తున్న శక్తులను ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఒక మంచి కోసం జరుగుతున్న యజ్ఞంను భగ్నం చేయడానికి రాక్షసుల మాదిరిగా ఈ శక్తులు సృష్టిస్తున్న ఆటంకాలను లక్ష్య పెట్టకుండా ప్రతి అడుగు ప్రజల కోసం వేస్తున్నారు.

ప్రతిపక్షాల నుంచి ఇంతగా కుట్రలు, దాడులు చేయకపోతే ఆయనలో వున్న ధీరోదాత్తమైన లక్షణాలు బయటకు వచ్చేవి కావు.  ప్రజలమీద ఆయనకు వున్న సంపూర్ణ విశ్వాసమే ఆయనను ముందుకు నడిపిస్తుంది. ప్రజలు స్వావలంబనతో తమ కాళ్ళ మీద తాము నిలబడి కుటుంబాన్ని నడిపించుకునేలా వారికి అండగా నిలవడం, మహిళల సాధికారత కోసం కృషి చేయడంపైనే సీఎంగా ఆయన దృష్టి సారించారు. 
 
15) ఊహించడానికి కూడా భయపడే ఆర్థిక సంక్షోభంను కూడా దాటించే ప్రయత్నంలో సవ్యసాచిలా సీఎం జగన్  పనిచేస్తున్నారు. నిన్న ఢిల్లీకి వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో చర్చలు జరిపారు. ఆ తరువాత తిరుమలకు వచ్చి అక్కడి నుంచే పీఎంతో జరిగిన వీడియోకాన్ఫెరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైయస్ జగన్ లోని నాయకత్వ లక్షణాలను, మంచి పాలకుడిని ప్రధాని ప్రశంసించారు. కోవిడ్ సంక్షోభంలోనూ చక్కగా పనిచేస్తున్నారని, వాలంటీర్ల వ్యవస్థతో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ప్రధాని కితాబు ఇచ్చారు. 
 
16) గత రెండు రోజుల పాటు ప్రతిపక్షాలు, దుష్టశక్తులు తమ కడుపుమంటను ఎల్లోమీడియా ద్వారా వెల్లడించారు. ప్రజలు తమ రోత రాతలను విశ్వసిస్తారా అనే ఆలోచన కూడా లేకుండా, ఒక సీఎం, ప్రజానాయకుడు అయిన వైయస్ జగన్ గారిపై అభూతకల్పనలతో ఎల్లో మీడియా వార్తలు రాసింది.

సీఎంకు కేంద్రమంత్రులు క్లాస్ తీసుకున్నారంటూ తప్పుడు వార్తలు రాసిన ఎల్లో మీడియాకు తిరుమలలో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని సీఎంకు ఇచ్చిన కితాబు సమాధానం చెప్పినట్లయ్యింది. ఇప్పటికైనా ఎల్లో మీడియా సిగ్గుపడాలి. 
 
17) న్యాయస్థానం అనేది పెద్దరికంగా వుండి, నిష్పాక్షికంగా తీర్పులు ఇవ్వాలి. ఆ తీర్పులపై ఏదైనా అభ్యంతరాలు వుంటే మా వైపు నుంచి అభిప్రాయాలు చెబుతున్నాం. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వ పాలనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో భిన్నమైన భావనలను కలిగించేలా వున్నాయి.

మీరు ఎలా సంతృప్తి పరుస్తారో తెలుసులే అని, డిజిపి ఇలాగే పనిచేస్తే రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సి వుంటుందని, ఇలా అయితే ఈ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వుందా? పరిపాలన చేస్తోందా? అంటూ న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఎటువంటి సంకేతాలను తీసుకువెడతాయనేదే మా అభ్యంతరం. అయినప్పటికీ కోర్ట్‌ల పట్ల మేం ఎంతో గౌరవంతోనే  వ్యవహరిస్తున్నాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments