ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఎంతగా భ్రష్టుపట్టించారో జరిగినవి చూస్తుంటే అర్థమవుతోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు పలు విషయాలు చెప్పుకొచ్చారు. ఒక సీఎంగా చేసిన వ్యక్తికి 986 మంది సెక్యూరిటీ సిబ్బంది కావాలా? మనమేమన్నా రాజులమా? ఎక్కడనుంచైనా ఊడిపడ్డామా? సామాన్య మనుషులం అంతే. ప్రజలకు సేవ చేసేందుకు వారితో ఎన్నిక చేయబడినవారం.
అందుకే నేను మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా చెప్పాను. చాలా సింపుల్‌గా వుండమన్నాను. నేను వెళ్తున్నా కూడా రోడ్డుకి ఇరువైపులా పరదాలు కట్టేస్తున్నారు. మీకేమైనా పిచ్చిపట్టిందా ఎందుకిలా పరదాలు కడుతున్నారు అని అంటే, అలవాటైపోయింది సార్ అంటున్నారు. ప్రజలతో ఎన్నుకోబడింది పరదాలు కట్టుకుని తిరగడానికి కాదు, చుట్టూ వేలమంది భద్రత సిబ్బందిని పెట్టుకోవడానికి కాదు. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.