టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 4న కర్నూలుకు రానున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు ఘటన, అధికార పార్టీ అత్యుత్సాహం అనంతరం జరుగుతున్న చంద్రబాబు కర్నూలు పర్యటనపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అధికారులకు సమాచారం రావడంతో ఇప్పటి నుంచే చర్యలు చేపట్టారు.
కార్పొరేషన్, పోలీసుల అనుమతుల కోసం టీడీపీ జిల్లా నాయకత్వం వేగంగా కదులుతోంది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు కర్నూలుకు వచ్చి కింగ్ మార్కెట్ నుంచి రోడ్‌షో ప్రారంభిస్తారు.
గోషా హాస్పిటల్, ఎస్టీబీసీ కాలేజి రోడ్డు, మౌర్య ఇన్, బంగారు పేట, కొత్త బస్టాండ్, బళ్లారి చౌరస్తా మీదుగా చెన్నమ్మ సర్కిల్‌కు సాయంత్రానికి చేరుకుంటారు. అనంతరం హైదరాబాద్‌కు బయల్దేరుతారు. చంద్రబాబు పర్యటనపై తెలుగు తమ్ముళ్లలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
2019 ఎన్నికల తర్వాత కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ జోష్ మీద కనిపిస్తోంది. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా అన్ని డివిజన్ల నుంచి అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు.
అధికార పార్టీ వస్తున్న వేధింపులు, బెదిరింపులకు లొంగడంలేదు. తొలుత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో ప్రచారం చేయించాలని పార్టీ శ్రేణులు భావించాయి. 5,6,7 తేదీల్లో ఆయన హిందూపురం మున్సిపాలిటీ పర్యటనలో ఉండడంతో రాలేకపోతున్నారు.