ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు త్వరలోనే తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాదరెడ్డి చెప్పారు. విశాఖపట్టణం నుంచే ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి ఆదివారం విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయలేదని, తాము ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అవసరం మేరకు బస్సుల సంఖ్య పెంచుతామని, ఎలక్ట్రికల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. జగన్ హయాంలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను తరిమేశారని, కొత్త వాటిని ప్రోత్సహించలేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలను ఇప్పుడు స్థాపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
వైకాపా పాలనలో జగన్ తర్వాత ఎక్కువ అక్రమాలకు పాల్పడింది, అధిక మొత్తంలో అక్రమార్జన కూడబెట్టింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనని మంత్రి రాంప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి టీడీపీపై చేసిన విమర్శలను ఖండించారు. రాయలసీమ జిల్లాల్లో పెద్దిరెడ్డిదే అతిపెద్ద మాఫియా కుటుంబమని, మొత్తం ఖనిజ సంపదను దోచేశారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించి ల్యాండ్, వైన్, మైన్ కుంభకోణాలను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే మిథున్ రెడ్డికి అన్నమయ్య జిల్లా వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని, అందులో తప్పేముందని ప్రశ్నించారు.