హైకోర్టులో రాజధాని కేసులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ కేసులు వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించుకుంది.
ఆయనకు ఫీజు కింద రూ.5 కోట్లు కేటాయిస్తూ ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా అడ్వాన్స్‌గా ఆయనకు రూ.కోటి చెల్లించేందుకు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు, మూడు రాజధానుల నిర్ణయం, సీఆర్‌డీఏ చట్టం ఉపసంహరణ తదితర అంశాలపై ఉన్నత న్యాయస్థానంలో నమోదైన కేసుల విచారణకు ప్రభుత్వం తరఫున వాదనలు విన్పించేందుకు రోహత్గీని నియమించారు. ఇకపై ఆయా కేసులన్నింటినీ రోహత్గీయే వాదించనున్నారు.
రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ అమలుపై విచారణ వాయిదా
రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలుపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆందోళనల సమయంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ చేస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు.
సదరు పోలీసులపై చర్యలకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.
ఇదిలాఉండగా.. హైకోర్టు, రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని తరలింపు వ్యవహారంలో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పిటిషనర్ తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు.
అమరావతి నుంచి కార్యాలయాల తరలింపునకు డైరెక్షన్స్ ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, దాన్ని ఆపడానికి మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని పిటిషనర్ కోరారు. అయితే రాజధాని తరలింపుపై శాసనమండలిలో చర్చ జరుగుతోందని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. దీంతో కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.